న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పార్టీ ఎమ్మెల్యేలు కొందరు రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి 49 రోజులకే వైదొలిగారన్న అపవాదును మూటగట్టుకున్న ఆప్ అధిపతి అరవింద్ కేజ్రీవాల్‌కు ఇది ఎదురుదెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు. తమ పార్టీలో చాలా మంది ఎమ్మెల్యేలు బీజేపీకి సహకరించడానికి సిద్ధంగా ఉన్నారని పేరు వెల్లడించేందుకు ఇష్టపడని ఆప్ ఎమ్మెల్యే ఒకరు అన్నారు. ఈ విషయమై కేజ్రీవాల్ ఇటీవల ఒక టీవీ చానెల్‌తో మాట్లాడుతూ బీజేపీ ఎనిమిది మంది ఆప్ ఎమ్మెల్యేలకు లంచాలు ఇవ్వజూపుతోందని ఆరోపించారు. అయితే తమ సభ్యులు బీజేపీకి సహకరించే అవకాశం లేదని ఆప్ సీనియర్ నేత మనీశ్ సిసోసియా స్పష్టం చేశారు.
ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం సొంతపార్టీ నుంచి మూడింట ఒకవంతు ఎమ్మెల్యేలు వేరే పార్టీలో చేరితే వారికి ఈ చట్టం వర్తించదు. ‘మా ఎమ్మెల్యేలు వేరే పార్టీలో చేరతారనే ఆందోళనే మాకు లేదు. ఈ విషయాన్ని వాళ్లే మాకు తెలిపారు. వేరే వాళ్ల నుంచి మాకు సమాచారం అందితే ఆందోళనకు గురయ్యేవాళ్లం’ అని సిసోడియా అన్నారు. కాంగ్రెస్ సహకారంతో తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేద్దామని గతంలోనూ కొందరు ఎమ్మెల్యేలు అరవింద్ కేజ్రీవాల్‌కు సూచించినట్టు వార్తలు వచ్చాయి. అయితే కాంగ్రెస్ మాత్రం తిరిగి ఆప్‌కు మద్దతు ఇవ్వడానికి తిరస్కరించింది. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ హవా వీస్తున్నందున, ప్రస్తుతం ఢిల్లీలో ఎన్నికలు నిర్వహిస్తే ఓటమి పాలవుతామని ఆప్ ఎమ్మెల్యేలు వాదించారు.
బీజేపీకి ఆప్ మద్దతు ?
Published Tue, Jun 17 2014 10:31 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement