
సోమ్‌నాథ్ భారతికి మొండిచెయ్యి!
న్యూఢిల్లీ: ఈనెల 14న ప్రమాణ స్వీకారం చేయబోతున్న అరవింద్ కేజ్రీవాల్ కేబినెట్ కూర్పు ఎలా ఉండనుందనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. 2013లో కేజ్రీవాల్ మంత్రివర్గంలో పనిచేసిన ముగ్గురిని ఈసారి పక్కనపెట్టనున్నట్లు పార్టీలోని విశ్వసనీయవర్గాల సమాచారం. వివాదాస్పదుడిగా ముద్రపడిన సోమ్‌నాథ్ భారతిని ఈసారి కేబినెట్‌కు దూరం గా ఉంచనున్నట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు రాఖీ బిర్లా, గిరీష్ సోనీకి కూడా ఈసారి కేబినెట్లో చోటు దక్కకపోవచ్చు. పార్టీలో నంబర్ టూగా వెలుగొందుతున్న మనీష్ సిసోడియాకు ఈసారి మరింత కీలక బాధ్యతలు అప్పజెప్పనున్నట్లు వినికి డి. 2013లో కేజ్రీవాల్ మంత్రివర్గంలో ఉన్న సత్యేంద్ర జైన్, సౌరభ్ భరద్వాజ్‌లకు ఈసారీ చోటు దక్కవచ్చు. మంత్రివర్గ కూర్పుపై పార్టీ సీనియర్ల సమావేశం గురువారం జరుగనుంది.
అసెంబ్లీ ఎన్నికల్లో సునామీ సృష్టించి ఆమ్ ఆద్మీ పార్టీ 67 స్థానాలు (మొత్తం 70లో) గెలుచుకున్న విషయం తెలిసిందే. సీట్ల సంఖ్యను బట్టి సీఎంతో సహా 11 మంది కేబినెట్లో ఉండొచ్చు. పలువురు విద్యాధికులు గెలిచి నందువల్ల మంత్రివర్గ కూర్పుపై కేజ్రీవాల్ సుదీర్ఘ కసరత్తే చేయా ల్సి రావొచ్చు. లాల్ బహదూర్‌శాస్త్రి మనవడు ఆదర్శ్ శాస్త్రి, చాందినీ చౌక్ ఎమ్మెల్యే అల్కాలాంబా పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.