ఘజియాబాద్: కొట్టుకెళ్లి పచారీ సరుకులు తీసుకురారా కొడుకా అంటే ఓ యువకుడు ఏకంగా ఓ అమ్మాయినే వెంటబెట్టుకొచ్చాడు. దీంతో షాక్ తిన్న తల్లి పోలీస్ స్టేషన్‌కు పరిగెత్తింది. జరిగింది తెలుసుకుని పోలీసులూ ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ వింత ఘటన బుధవారం ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఘజియాబాద్‌లోని సహీదాబాద్‌కు చెందిన గుడ్డు రెండు నెలల క్రితం సవితా అనే యువతిని హరిద్వార్‌లో ఆర్య సమాజ్ మందిర్‌లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. కానీ ఆ పెళ్లికి ప్రత్యక్ష సాక్ష్యులు లేక మ్యారేజ్ సర్టిఫికెట్ దక్కలేదు. సర్టిఫికెట్ కోసం ప్రయత్నాలు చేద్దామనుకునేలోపే లాక్‌డౌన్ అమల్లోకి వచ్చింది. ఇంట్లో పెళ్లి విషయం చెప్పని గుడ్డు తన భార్యను ఢిల్లీలోని ఓ అద్దె ఇంట్లో ఉంచాడు. అతను మాత్రం సహీదాబాద్‌లోని స్వగృహంలోనే ఉన్నాడు. (సొంత జిల్లాలకు వలస కూలీలు)
మరోవైపు తన భార్య ఇంటి యజమానులు ఆమెను ఇల్లు ఖాళీ చేయాలని ఒత్తిడి చేశారు. దీంతో ఆమెను ఎలాగైనా ఇంటికి తీసుకురావాలనుకున్నాడు. ఈ క్రమంలో అతని తల్లి బుధవారం కిరాణ వస్తువులు తీసుకురమ్మని గుడ్డును బయటకు పంపింది. ఇదే మంచి సమయమని భావించిన అతగాడు బయటకు వెళ్లిన కాసేపటికే ఇంటిముందు భార్యతో సహా ప్రత్యక్షమయ్యాడు. ఇదెక్కడి ఘోరం అనుకున్న తల్లి పోలీసులను ఆశ్రయించగా వారు తాత్కాలిక పరిష్కారాన్ని కనుగొన్నారు. ఢిల్లీలోని సవిత ఇంటి యజమానులతో మాట్లాడిన పోలీసులు ఈ జంటను లాక్‌డౌన్ ముగిసేవరకు అక్కడే ఉండేందుకు అనుమతించాలన్నారు. దీనికి వారు కూడా అంగీకరించారు. (3 వేల కి.మీ. ప్రయాణం.. మృతదేహాన్ని)
Comments
Please login to add a commentAdd a comment