'దత్తత తీసుకున్న రాయబరేలి ప్రజలే గెలిపిస్తారు'
రాయ్ బరేలి: ప్రేమాభిమానాలతో దత్తత తీసుకున్న రాయ్ బరేలి ప్రజలు మరోసారి ఘనవిజయాన్ని అందిస్తారని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆశాభావం వ్యక్తం చేశారు. రాయ్ బరేలి లోకసభ స్థానంలో నామినేషన్ దాఖలు చేసిన తర్వాత క్లుప్తంగా మీడియాతో మాట్లాడారు. జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకోవడానికి ముందు ఫురసత్ గంజ్ ఎయిర్ పోర్ట్ లో సోనియాకు ఘన స్వాగతం పలికారు. రాహుల్ స్వయంగా కారు నడపగా సోనియా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. సోనియా నామినేషన్ కార్యక్రమంలో గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు సతీష్ శర్మ పాల్గొన్నారు.
1960 నుంచి ప్రతి ఎన్నికల్లో నెహ్రూ, గాంధీల కుటుంబం రాయ్ బరేలి నియోజకవర్గంలో విజయం సాధిస్తోంది. తన భర్త ఫిరోజ్ గాంధీ మరణం తర్వాత తొలిసారి ఇందిరా గాంధీ ఈ నియోజకవర్గంలో విజయం సాధించారు. సోనియాగాంధీ మూడు సార్లు ఇదే నియోజకవర్గం నుంచి విజయం సాధిస్తూ వస్తున్నారు. ఆస్తుల వ్యవహారంలో వచ్చిన ఆరోపణల నేపథ్యంలో రాజీనామా చేసిన 2004 ఎన్నికల్లో సోనియాగాంధీ అమేథి నుంచి రాయ్ బరేలికి మారారు. గతంలో బళ్లారి నియోజకవర్గంలో సుష్మా స్వరాజ్ ను సోనియాగాంధీ ఓడించిన సంగతి తెలిసిందే.