రైతు సమస్యలపై పోరాడుతా
సోనియా గాంధీ ఉద్ఘాటన
పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలి
భివాని(హరియాణా)/లక్నో: రైతు సమస్యలపై పోరాడతానని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ పునరుద్ఘాటించారు. రైతులను పట్టించుకోవడం లేదని కేంద్రంపై విరుచుకుపడ్డారు. అకాల వర్షాలు, వడగండ్ల వల్ల పంట నష్టపోయిన రైతులందరికీ సకాలంలో పరిహారం చెల్లించాలని బీజేపీ పాలిత రాష్ట్రాలను డిమాండ్ చేశారు. హరియాణాలోని రోహతక్, భివాని జిల్లాల్లో సోనియా శనివారం పర్యటించి పంట నష్టపోయిన రైతులతో మాట్లాడారు. ‘అందరికీ అన్నం పెట్టే అన్నదాత ఇప్పుడు కష్టాల్లో ఉన్నాడు. అందరం కలిసి వారికి సాయం చేయాలి. రైతులను ఆదుకోవాల్సిన ప్రధాన బాధ్యత ప్రభుత్వాల(కేంద్ర, రాష్ట్ర)పై ఉంది. అధికారంలో లేకున్నా వారి పరిహారం కోసం గట్టిగా పోరాడుతున్నాం. భవిష్యత్తులోనూ పోరాడుతాం’ అని అన్నారు. సోనియా శుక్రవారం రాజస్తాన్‌లోని కోటా జిల్లాలోనూ పర్యటించారు. పంట నష్ట పోయిన రైతులకు సంఘీభావం తెలిపారు.
‘రైతులకు ఏమి కావాలి? వారికి కావాల్సింది పరిహారం మాత్రమే. ఆ బాధ్యత ప్రభుత్వంపై ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వారికి పరిహారం చెల్లించాలి’ అని కోరారు. ఉత్తరప్రదేశ్‌లో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదంలో గాయపడిన వారిని సోనియా పరామర్శించారు. రైల్వే శాఖ బాధితులకు త్వరగా తగిన సహాయం చేయాలని కోరారు. ఏప్రిల్ రెండో వారంలో న్యూఢిల్లీలో కాంగ్రెస్ తలపెట్టిన భారీ రైతు ర్యాలీని ఉద్దేశించి సోనియా ప్రసంగించనున్నారు. ఈ ర్యాలీకి రాహుల్ హాజరవుతారో లేదో తెలియరాలేదు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, పీసీసీ చీఫ్‌లు కూడా దీనికి హాజరవుతారని పార్టీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేది తెలిపారు.