Crop compensation
-
రైతులకు నేడు పంట నష్టపరిహారం జమ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గతేడాది సెప్టెం బర్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు వర్షాలు, వరదలతో పంట నష్టపోయిన 67,874 మంది రైతులకు పెట్టుబడి రాయితీ కింద రూ. 54.52 కోట్ల పంట నష్టపరిహారాన్ని శుక్రవారం చెల్లించనున్నట్టు వ్యవసాయ శాఖ కమిషనర్ హెచ్.అరుణ్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పంట నష్టపోయిన రైతుల జాబితాలో పేర్లున్న వారి ఖాతాలకు నగదును జమ అవుతుంది. ఆధార్ అనుసంధానమైన రైతుల బ్యాంకు ఖాతాలకు ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ పద్ధతిన నగదు జమ అవుతుంది. నగదు జమ అయిన తర్వాత రైతుల పేర్లను గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శిస్తారు. -
ఏ ఒక్క రైతుకు పరిహారం అందలేదు
సాక్షి, పామర్రు : మండల పరిధిలోని రిమ్మనపూడి శివారు ప్రాంతమైన అంకామ్మగుంట వద్ద గల బాడవాలోని 70 ఎకరాల పోలంలో ఒక్క ఎకరానికి కూడా పంట నష్ట పరిహారం రాలేదని ఆ గ్రామానికి చెందిన రైతు నేతల సతీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం స్థానిక వ్యవసాయశాఖ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ తుఫాను కారణంగా కురిసిన వర్షాలకు పంట నష్ట పోయిన రైతులకు నష్ట పరిహారం ఇస్తున్నారని తెలిపి వ్యవసాయశాఖ కార్యాలయం వద్దకు వచ్చాడు. అక్కడ ఉన్న లిస్టులో అంకామ్మగుంట బాడవా పొలం సుమారు 70 ఎకరాలను 15 మంది రైతులు సాగు చేయడం జరుగుతోంది. ఈ పొలాలకు సంబంధించిన ఏ ఒక్క రైతుకు పంట నష్టం నమోదు రాలేదన్నారు . బడా రైతులకు ఎలా వచ్చాయి.. ? గ్రామంలోని బడా రైతుల పేర్లు మాత్రమేలిస్టులో వచ్చాయని, సన్నా చిన్న కారు రైతుల పేర్లు మాత్రం ఒక్కటీ కూడా రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామానికి వచ్చిన పంట నష్ట నమోదు అధికారులైన వీఆర్ఏ, ఎంపీఈవోలను ప్రసన్నం చేసు కున్న వారి పొలాలకు మాత్రమే నష్టం రాయడం జరిగిందని, ప్రసన్నం చేసుకోలేని వారి పోలాలు రాయలేదని తెలిపారు. అందువల్ల నిరుపేదలైన అంకామ్మగుంటలోని బాడవా పోలాలకు నష్టం నమోదు చేయలేదని తెలిపారు. ఈ విషయమై పామర్రు ఏడీఏ పద్మజకు ఫిర్యాదు చేయడంజరిగిందన్నారు. స్పందించిన ఏడీఏ అంకామ్మగుంట వద్ద గల బాడవా పొలంలో పంట నష్ట పోయిన రైతుల వివరాలను సంబంధించిన పత్రాలను తీసుకుని అర్జీని ఆన్లైన్లో పెట్టాలని ఆదేశించారు. రైతులకు న్యాయంజరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. -
ఎదురుచూపులే...
♦ ఏడాది కావస్తున్నా అందని పంటల పరిహారం ♦ రూ.197 కోట్ల పరిహారానికి ఎదురుచూపులు ♦ ఖరీఫ్ సమీపిస్తున్నా ఖాతాల్లో చేరని డబ్బులు ♦ కేంద్ర సాయం రానందునే జాప్యం ఆందోళనలో రైతాంగం గత ఖరీఫ్ పోయి మరో ఖరీఫ్ రావట్టే.. అయినా అందని పంటల పరిహారం. ఏడాది కావస్తున్నా పరిహారం రాక ఆందోళనలో రైతన్న. వర్షాభావం కారణంగా జిల్లా మొత్తాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించిన అధికారులు ఆ మేరకు పరిహారం పంపిణీలో విఫలమయ్యారు. క్షేత్ర స్థాయిలో సర్వే జరిపినా, ఖాతా వివరాలు సేకరించినా డబ్బులు జమ కావడం లేదని రైతులు మండిపడుతున్నారు. ఆ పరిహారం డబ్బులేవో ఇప్పుడిచ్చినా వచ్చే ఖరీఫ్ పెట్టుబడికి సాయంగా ఉంటుందని రైతులు ఆశిస్తున్నారు. - సాక్షి, సంగారెడ్డి వర్షాభావ పరిస్థితులు, పంట నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం జిల్లాలోని 46 మండలాలను ప్రభుత్వం కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. జిల్లాలోని 4,78,431 మంది రైతులకు చెందిన 2,72,605 హెక్టార్లలో పంటనష్టం వాటిల్లినట్టు అధికారులు గుర్తించారు. పంట నష్టపోయిన రైతులకు రూ.197.97 కోట్ల మేర పరిహారం చెల్లించాలని అధికారులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదికలు పంపారు. కేంద్ర బృందం పర్యటించినా... కేంద్ర కరువు సహాయక బృందం అధికారులు జిల్లాలో పర్యటించి నష్టం వివరాలను సేకరించారు. రైతులతో మాట్లాడి నష్టం వివరాలను తెలుసుకున్నారు. పరిహారం త్వరగానే అందుతుందని రైతులు భావించారు. మళ్లీ ఖరీఫ్ సమీపిస్తున్నా ఇంతవరకు కరువు సాయం అందకపోవడంతో రైతులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. రబీలోనూ... గత ఏడాది ఖరీఫ్‌తోపాటు రబీలోనూ పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో రైతులు ప్రభుత్వం అందజేసే పంటనష్ట పరిహారం కోసం ఎదురుచూస్తున్నారు. నష్టపోయిన రైతులు ఇది వరకే తమ బ్యాంకు ఖాతాల వివరాలను అధికారులకు అందజేశారు. రైతుల ఖాతాల్లో పరిహా రం డబ్బులు నేరుగా జమవుతాయని అధికారులు చెబుతున్నా డిపాజిట్ కాలేదు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో వచ్చే ఖరీఫ్‌పై రైతు ల్లో ఆశలు చిగురించాయి. ఖరీఫ్‌లో పంటల సాగుకు వీలుగా ఇకనైనా పరిహారం డబ్బులు అందజేయాలని రైతులు కోరుతున్నారు. 2.72 లక్షల హెక్టార్లలో పంటనష్టం... గత ఏడాది ఖరీఫ్‌లో జిల్లాలో పెద్ద ఎత్తున పంటనష్టం వాటిల్లింది. వేలాది ఎకరాల్లో పంటనష్టం జరిగినా 33 శాతానికి మించి నష్టం వాటిల్లితేనే పరిహారం అందేందుకు రైతులు అర్హులవుతారు. నిబంధలన మేరకు లెక్కింపులు చేపడితే జిల్లాలో 33 శాతానికిపైగా 4,78,431 మంది రైతులకు చెందిన 2,72,605 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. ఆరుతడి పంటలు 2,72,356 హెక్టార్లలో దెబ్బతినగా బోరుబావుల కింద 249.1 హెక్టార్లలో పంటలు నష్టపోయాయి. పత్తి, మొక్కజొన్న, సోయాబీన్‌తోపాటు సజ్జలు, మినుములు, ఆముదం, పెసర, జొన్న, కంది, నువ్వులు, చెరకు పంటలు దెబ్బతిన్నాయి. ఆయా పంటలకు సంబంధించి రూ.197.97 కోట్ల మేర పరిహారం చెల్లించాల్సి ఉంది. ఏడాది గడుస్తున్నా పరిహారం చెల్లించకపోవడంపై రైతుల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. కేంద్ర సాయం లేకనే... కేంద్ర ప్రభుత్వం నుంచి కరువు సహాయం అందకపోవడం వల్లే నష్టం పరిహారం చెల్లింపుల్లో జాప్యం జరుగుతున్నట్టు సమాచారం. రాబోయే పక్షం రోజుల్లో పరిహారం డబ్బులు రైతులకు అందుతాయని అధికారులు చెబుతున్నారు. ఖరీఫ్ ప్రారంభానికి ముందే రైతులకు డబ్బులు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. -
వారంలో పంట నష్టపరిహారం పంపిణీ
పుట్టపర్తి టౌన్ : వారం రోజుల్లో జిల్లా రైతులకు 2013-14 సంవత్సరానికి సంబంధించి పంట నష్టపరిహారం పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర సమాచార, ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పుట్టపర్తికి విచ్చేసిన మంత్రి పర్తిసాయి ధర్మశాలలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 692 కోట్ల పంట నష్టపరిహారం మంజూరైతే ఇందులో రూ.569 కోట్లు అనంతపురం జిల్లాకు మంజూరైందన్నారు. త్వరలోనే జిల్లా పర్యటనకు రానున్న ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు చేతులు మీదుగా పరిహారం పంపిణీ ప్రారంభిస్తామన్నారు. పశుగ్రాసం పెంపకానికి సబ్సిడీతో గడ్డివిత్తనాలు పంపిణీ చేస్తామన్నారు. దాణాను ఉచితంగా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. బుక్కపట్నం ప్రధాన రహదారి విస్తరణ పనులు త్వరలో చేపడతామని, కొత్తచెరువులో ఇంటి పట్టాలు త్వరలో పంపిణీ చేస్తామన్నారు. -
పరిహారం పత్తాలేదు
♦ నాలుగేళ్లుగా నాన్చుతున్నారు ♦ నివేదికలకే పరిమితమైన పంటనష్టం ♦ అదిగో.. ఇదిగో అంటూ కాలయాపన ♦ ఏళ్లుగా ఎదురుచూస్తున్న అన్నదాత సాక్షి ప్రతినిధి, నెల్లూరు : పంట నష్టపరిహారం అందని ద్రాక్షగా మారింది. ప్రకృతి వైపరీత్యాలతో ఏటా నష్టపోతున్న రైతుకు పరిహారం అందించటంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. నాలుగేళ్లుగా పంట నష్టపోతున్న రైతుకు ప్రభుత్వం ఇంతవరకు పరిహారం మంజూరు చేయలేదు. ఏటా నష్టపోతున్న పంటలకు సంబంధించిన నివేదికలు పంపడమే కానీ.. నిధులు విడుదల చేసిన దాఖలాలు లేవని అధికారులు చెబుతున్నారు. దీంతో అన్నదాతలు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. వివరాల్లో కెళితే... 2011 డిసెంబర్లో వచ్చిన థానే తుపానుకు జిల్లాలో 1415.34 హెక్టార్లలో వివిధ పంటలు దెబ్బతిన్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారయంత్రాంగం పంటనష్టంపై అంచనాలను సిద్ధం చేసింది. థానే తుపాను కారణంగా దెబ్బతిన్న పంటలకు సంబంధించి రూ.79,70,342 పరిహారం చెల్లించాలని ప్రభుత్వానికి నివేదికలు పంపారు. అదేవిధంగా 2012 జనవరిలో వచ్చిన తుపాను కారణంగా జిల్లాలో 2,177 మంది రైతులకు సంబంధించి 1943.03 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. పంట నష్టం కింద రూ.74,16, 232 పరిహారం అందించాలని నివేదికలు పంపారు. ఇకపోతే 2013 ఫిబ్రవరిలో కురిసిన భారీవర్షాలకు 843 మంది రైతులకు సంబంధించి 567.345 హెక్టార్లలో వివిధ పంటలు దెబ్బతిన్నాయి. అందుకు గాను రూ.46,79,909లు పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. అదే ఏడాది మే నెలలో వడగళ్ల వాన కురిసింది. దీంతో జిల్లాలో 124 మంది రైతులకు సంబంధించి 6,471 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. వారికి రూ.5,59,596 పరిహారం చెల్లించమని కోరారు. జిల్లాలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు 3,651 మంది రైతులకు సంబంధించి 2107.434 హెక్టార్లలో చేతికొచ్చే సమయంలో పంట నేలపాలైంది. అధికారులు రూ.3,16,11,510లు నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. సర్కారు కాలయాపన.. అప్పుల ఊబిలో అన్నదాత ప్రతి ఏటా వచ్చిన అకాల వర్షాలకు పంటలు దెబ్బతింటున్నా.. ప్రభుత్వం మాత్రం ఒక్క రూపాయి ఇచ్చిన దాఖలాలు లేవు. పంటలు దెబ్బతిన్న సమయంలో ప్రభుత్వం అప్పటికప్పుడు అధికారులను పంపి నష్టానికి సంబంధించిన వివరాలు సేకరిస్తుంది. ఆ నివేదికలన్నీ ప్రభుత్వానికి పంపినా.. ఇంతవరకు పరిహారం మంజూరుచేసిన దాఖలాలు కనిపించలేదు. దివంగత సీఎం వైఎస్ ఆర్ ఉన్న సమయంలో విడుదలైన పరిహారం తప్పా.. తర్వాత ఒక్కరూపాయి కూడా రాలేదు. బ్యాంకుల్లో తీసుకున్న రుణం మాఫీ కాకపోవటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి పరిహారం మంజూరుచేయాలి. -
రైతు సమస్యలపై పోరాడుతా
సోనియా గాంధీ ఉద్ఘాటన పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలి భివాని(హరియాణా)/లక్నో: రైతు సమస్యలపై పోరాడతానని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ పునరుద్ఘాటించారు. రైతులను పట్టించుకోవడం లేదని కేంద్రంపై విరుచుకుపడ్డారు. అకాల వర్షాలు, వడగండ్ల వల్ల పంట నష్టపోయిన రైతులందరికీ సకాలంలో పరిహారం చెల్లించాలని బీజేపీ పాలిత రాష్ట్రాలను డిమాండ్ చేశారు. హరియాణాలోని రోహతక్, భివాని జిల్లాల్లో సోనియా శనివారం పర్యటించి పంట నష్టపోయిన రైతులతో మాట్లాడారు. ‘అందరికీ అన్నం పెట్టే అన్నదాత ఇప్పుడు కష్టాల్లో ఉన్నాడు. అందరం కలిసి వారికి సాయం చేయాలి. రైతులను ఆదుకోవాల్సిన ప్రధాన బాధ్యత ప్రభుత్వాల(కేంద్ర, రాష్ట్ర)పై ఉంది. అధికారంలో లేకున్నా వారి పరిహారం కోసం గట్టిగా పోరాడుతున్నాం. భవిష్యత్తులోనూ పోరాడుతాం’ అని అన్నారు. సోనియా శుక్రవారం రాజస్తాన్‌లోని కోటా జిల్లాలోనూ పర్యటించారు. పంట నష్ట పోయిన రైతులకు సంఘీభావం తెలిపారు. ‘రైతులకు ఏమి కావాలి? వారికి కావాల్సింది పరిహారం మాత్రమే. ఆ బాధ్యత ప్రభుత్వంపై ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వారికి పరిహారం చెల్లించాలి’ అని కోరారు. ఉత్తరప్రదేశ్‌లో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదంలో గాయపడిన వారిని సోనియా పరామర్శించారు. రైల్వే శాఖ బాధితులకు త్వరగా తగిన సహాయం చేయాలని కోరారు. ఏప్రిల్ రెండో వారంలో న్యూఢిల్లీలో కాంగ్రెస్ తలపెట్టిన భారీ రైతు ర్యాలీని ఉద్దేశించి సోనియా ప్రసంగించనున్నారు. ఈ ర్యాలీకి రాహుల్ హాజరవుతారో లేదో తెలియరాలేదు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, పీసీసీ చీఫ్‌లు కూడా దీనికి హాజరవుతారని పార్టీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేది తెలిపారు. -
గందరగోళం!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పంటనష్ట పరిహారాన్ని నేరుగా రైతుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తోంది. పంపిణీ బాధ్యతల్ని ఓ ప్రైవేటు బ్యాంకుకు అప్పగించింది. వ్యవసాయశాఖ రైతుల జాబితా, నిధులకు సంబంధించిన బిల్లులు తయారు చేసి ఖజానా శాఖ ఆమోదం పొందిన అనంతరం సదరు బ్యాంకు యంత్రాంగం రైతుల ఖాతాకు ఆన్లైన్ పద్ధతిన నగదును బదిలీ చేస్తుంది. 2013 ఖరీఫ్ సీజన్‌తో పాటు ఇంతకు ముందు బకాయిలన్నీ కలుపుకొని జిల్లాకు రూ.31.03 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ పరిహారాన్ని 1,21,327 మంది రైతులకు పంపిణీ చేయాల్సి ఉంది. అయితే లబ్ధిదారులకు సంబంధించి వ్యవసాయ శాఖ బిల్లులు రూపొం దించి ఖజానా విభాగం ఆమోదంతో సర్వీస్ ప్రొవైడర్‌కు వివరాలు అందించగా.. పంపిణీ ప్రక్రియలో ఇబ్బం దులు తలెత్తాయి. రైతులిచ్చిన బ్యాంకు ఖాతాలు పనిచేయడం లేదని, కొందరు రైతుల బ్యాంకు ఖాతా అంకెల్లో తేడాలున్నట్లు సర్వీస్ ప్రొవైడర్ తేల్చింది. ఇప్పటివరకు 1,01,706 మంది రైతులకు రూ.26.87 కోట్లు పంపిణీ చేశారు. ఇంకా 19,621 మంది రైతులకు రూ.4.16 కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. సర్వీస్ ప్రొవైడర్ చేతులెత్తేసింది. దీంతో మళ్లీ వివ రాలు సేకరించాలని వ్యవసాయశాఖ నిర్ణయించి.. క్షేత్రస్థాయిలో చర్యలు మొదలుపెట్టింది. గతంలోనూ ఇదే సీను.. 2012 సంవత్సరంలో జిల్లాకు మంజూరైన పంటనష్ట పరిహారంలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టమైంది. రైతులు సరైన వివరాలు ఇవ్వలేదని మొదట వాదించిన వ్యవసాయ శాఖ అధికారులు.. వారంతా బోగస్ రైతులని తేల్చుతూ రూ.8 కోట్లు ప్రభుత్వానికి వెనక్కు ఇచ్చారు. తాజాగా ఇదే తరహాలో రైతులు తప్పుడు ఖాతా నంబర్లు సమర్పించారంటూ వ్యవసాయ శాఖ పేర్కొనడం గమనార్హం. వాస్తవానికి జిల్లాలో మెజారిటీ రైతులు పంట రుణాలు తీసుకున్నారు. ఈ క్రమంలో రైతులందరికీ బ్యాంకు ఖాతాలున్నాయి. ఇటీవల పంటరుణ మాఫీ ప్రక్రియలోనూ ఈ ఖాతాలను సేకరించారు. తాజాగా ఆ జాబితా ప్రకా రం రైతుల వివరాలు పరిగణలోకి తీసుకుంటే అసలు సమస్యే ఉండదని రైతు సంఘాల నేతలు పేర్కొంటున్నారు. మొత్తంగా అధికారుల తప్పిదాలతో రైతులు నష్టపోతున్నట్లు వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘డబుల్’ ట్రబుల్.. మరోవైపు ఇప్పటికే పంపిణీ చేసిన పంటనష్ట పరిహారంపై కొత్త చిక్కు వచ్చిపడింది. కొన్నిచోట్ల ఒకే రైతుకు రెండుసార్లు పరిహారం జమ అయినట్లు అధికారవర్గాలు గుర్తించాయి. దాదాపు రూ.2కోట్ల వరకు ఇలా రెండేసిసార్లు రైతులకు ఇచ్చినట్లు అధికారులు అంచనా వేశారు. ఈమేరకు లెక్కలు తీసేపనిలో నిమగ్నమయ్యా రు. రెండుసార్లు పరిహారం విడుదలైన ఖాతాలను వెంటనే సీజ్‌చేసి సరిదిద్దే ప్రయత్నాలు మొదలయ్యాయి. -
పరిహారం.. పరిహాసం..
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : అన్నదాతలు పంట నష్ట పరిహారం కోసం కాళ్లరిగేలా వ్యవసాయ శాఖ కార్యాలయం చుట్టూ.. బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. నాలుగేళ్లకు సంబంధించి అధిక వర్షాలతో, వడగండ్లతో పంటనష్టపోయిన రైతులకు పంట నష్ట పరిహారాన్ని ప్రభుత్వం ఆగస్టులో మంజూరు చేసింది. జిల్లా వ్యాప్తంగా 1,40,618 మంది రైతులకు సంబంధించి 2011 నుంచి 2014 వరకు గాను పెండింగ్‌లో ఉన్న రూ.69.12 కోట్లు పరిహారాన్ని జీవో 6, 7 ద్వారా విడుదల చేసింది. కాగా.. నష్టపరిహారం మంజూరై రెండు నెలలు గడుస్తున్నా పూర్తిస్థాయిలో రైతులకు పరిహారం అందలేదు. ఇప్పటి వరకు కేవలం 93 వేల మంది రైతులకు రూ.40 కోట్ల 50 లక్షల 805 మాత్రమే వారి ఖాతాల్లో జమయ్యాయి. మిగిలిన 47,618 మంది రైతులకు రూ.29 కోట్ల వరకు అందించాల్సి ఉండగా, ఇందులో 13,618 మంది రైతుల ఖాతా వివరాలు సరిగా లేవనే సాకుతో వారికి సంబంధించిన రూ.10 కోట్లు వెనక్కి పంపించారు. ఇక మిగతా 25 వేల మంది రైతులకు రూ.19 కోట్లు నష్టపరిహారాన్ని త్వరలో అందజేయనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. అర్హులైన వారి పేర్లు గల్లంతు.. పంట నష్టపరిహారానికి అర్హులైన రైతుల పేర్లు సైతం అధికారులు తయారు చేసిన జాబితాలో గల్లంతు కావడం గమనార్హం. దీంతో తమ పంట నష్టపోయినా పరిహారం చెల్లించలేదని రైతులు ఆందోళనబాట పట్టారు. అనర్హులైన రైతులకు మాత్రం నష్టపరిహారం కింద డబ్బులు జమ చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిర్పూర్ (టి), దహెగాం, బెజ్జూర్, కాగజ్‌నగర్‌కు చెందిన రైతులు పరిహారం జాబితాల్లో పేర్లు లేవంటూ గత నెలలో ఆందోళన చేయడంతో వ్యవసాయ శాఖ అధికారులు స్పందించి జాబితాపై పునఃపరీశీల చేస్తున్నారు. పంట నష్టం వాటిల్లినప్పుడు పేర్లు రాసుకున్న రైతులకు కాకుండా పంటలు వేసుకోని వారి పేర్లు, వారి కుంటుంబంలో ఎంతమందికి భూమి ఉంటే అంతమందికి పరిహారం జాబితాల్లో చోటు కల్పించడంపై విస్మయానికి గురవుతున్నారు. ఆ సమయంలో పంటనష్టం వివరాలు సేకరించేందుకు వచ్చిన రెవెన్యూ అధికారులు, ఆదర్శ రైతులు అర్హులైన వారి పేర్లను జాబితాలో చేర్చారు. ఈ జాబితాలో భూమిలేని కుటుంబాలు, ఒకే కుటుంబంలోని ముగ్గురు నుంచి నలుగురు సభ్యుల పేర్లు ఉండడం, వారి నుంచి బ్యాంక్ ఖాతాలు తీసుకుని పరిహారం జమ చేయడం అనుమానాలకు దారితీస్తోంది. ఈ అక్రమాల్లో అధికారులతోపాటు, ఆదర్శ రైతులకు కూడా భాగస్వామ్యం ఉన్నట్లు తెలుస్తోంది. ఖాతా నెంబర్లు అందక వెనక్కి.. రైతుల ఖాతా నెంబర్ల వివరాలు సరిగా పొందుపరుచక రూ.10 కోట్లు వెనక్కి వెళ్లాయి. పంట నష్టం జరిగినప్పుడు రైతు పేర్లు సరిగా లేకపోవడం.. ఖాతానెంబర్లు ఇవ్వకపోవడంతోనే పరిహారం తిరిగి పంపినట్లు అధికారులు చెబుతున్నారు. గతేడాది ఖరీఫ్‌లో జూలై, ఆగస్టులో కురిసిన వర్షాలతో ప్రాణహిత నది ఉప్పొంగి బెజ్జూర్, కౌటాల మండలాల్లోని పంటలు తీవ్రంగా నష్టపోయాయి. అయినా.. ఆయా ప్రాంతాల రైతుల పేర్లు పరిహారం జాబితాలో లేకపోవడం గమనార్హం. దీంతో గత నెలలో ఆసిఫాబాద్ సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. అర్హులైన తమకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై వ్యవసాయ సంయుక్త సంచాలకులు రోజ్‌లీలాను వివరణ కోరగా.. అర్హులందరికీ పరిహారం జమ చేస్తామని చెప్పారు. ఏడీఏ, ఏవోల ద్వారా పునఃపరిశీలిస్తున్నామని, త్వరలోనే అందిస్తామని పేర్కొన్నారు. -
‘కాంగ్రెస్’ వాకౌట్
- రుణమాఫీ, పంట పరిహారంపై రగడ కరీంనగర్ : జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశం పంటనష్ట పరిహారం, రుణమాఫీ అంశంపై అట్టుడికింది. ఓ దశలో తీవ్ర వాగ్వాదం జరిగి ఎమ్మెల్యే జీవన్‌రెడ్డితోపాటు కాంగ్రెస్ సభ్యులంతా వాకౌట్ చేసే వరకూ వెళ్లింది. సమావేశం ప్రారంభం కాగానే జగిత్యాల ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లా పంటనష్ట పరిహారం రూ.108 కోట్లు విడుదల కాగా, వ్యవసాయశాఖ అధికారులు కేవలం రూ.18 కోట్లు రైతులకు చెల్లించి చేతులు దులుపుకున్నారని, నిధులు పంపిణీ చేయడంలో నిర్లక్ష్యమెందుకని మండిపడ్డారు. రుణమాఫీపై రోజుకో ప్రకటన చేస్తున్నారని, టైటిల్-1బీ అంటూ బ్యాంకులు అభ్యంతరాలు చెబుతున్నాయని, సభకు మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టమైన సమాధానం చెప్పాలని జీవన్‌రెడ్డి పదేపదే కోరారు. ఎమ్మెల్యే పుట్ట మధు జోక్యం చేసుకుని రైతుల పట్ల ప్రభుత్వం కృతనిశ్చయం తో ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంథని ప్రాంతంలో నాయకులు దోచుకో... దాచుకో అన్న చందంగా ఖజానాను కొల్లగొట్టారని ఆరోపించారు. ఆదర్శరైతుల అవినీతికి అడ్డులేకుండా పోయిందని, ఎకరం భూమిపైనే నాలుగైదు పేర్లు రాసి ఆదర్శరైతులే డబ్బులు కాజేశారని, తన నియోజకవర్గంలోని గద్దలపల్లి ఆదర్శరైతు వ్యవహారంపై వివరించారు. జీవన్‌రెడ్డి జోక్యం చేసుకుని ప్రభుత్వం మీదే ఉందని, విచారణ చేయిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అనడంతో బెజ్జంకి జెడ్పీటీసీ తన్నీరు శరత్‌రావు, శంకరపట్నం జెడ్పీటీసీ పి.సంజీవరెడ్డి జోక్యం చేసుకున్నారు. బెజ్జంకి మండలంలో పరిహారం రూ.5 కోట్లు వస్తే రూ.3 కోట్లు కాంగ్రెస్ కార్యకర్తలకే వచ్చాయని విమర్శించారు. బెజ్జంకి వ్యవసాయాధికారిని సస్పెండ్ చేయాలని జేడీఏకి ఫిర్యాదు చేసినా ఫలితం లేదని అన్నారు. కాంగ్రెస్ హయాంలో చేసిన పనులను చక్కదిద్దేందుకే టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుంటే జీవన్‌రెడ్డి టీఆర్ఎస్ను విమర్శించడం ఏంటని మండిపడ్డారు. దీంతో కాంగ్రెస్‌కు చెందిన కాటారం జెడ్పీటీసీ నారాయణరెడ్డి జోక్యం చేసుకుని సీనియర్ ఎమ్మెల్యే అయిన జీవన్‌రెడ్డిని అలా సంబోధించడం సరికాదని అనడంతో సభలో ఒక్కసారిగా గందరగోళం ఏర్పడింది. టీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యుల పరస్పర విమర్శలు, అరుపులతో సభ దద్దరిల్లింది. గౌరవం లేని సభలో తాను ఉండబోనని జీవన్‌రెడ్డి పోడియం వద్దకు వచ్చి మంత్రి ఈటెల, చైర్పర్సన్ ఉమతో వాగ్వాదానికి దిగారు. టీఆర్ఎస్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యేలు పుట్ట మధు, గంగుల కమలాకర్ జీవన్‌రెడ్డిని సముదాయించి సీట్లో కూర్చోబెట్టారు. చైర్పర్సన్ సభను నడిపించే ప్రయత్నం చేస్తుండగానే జీవన్‌రెడ్డి మరోసారి జోక్యం చేసుకుని, కాంగ్రెస్ సభ్యులతో కలిసి వాకౌట్ చేసి ఎమ్మెల్సీ సంతోష్‌కుమార్, డీసీఎంఎస్ చైర్మన్ సురేందర్‌రెడ్డి, జెడ్పీటీసీలతో కలిసి ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించారు. జెడ్పీ భవనాన్ని టీఆర్ఎస్ కార్యాలయంగా మార్చుకుని అమర్యాదగా ప్రవర్తించారని, క్షమాపణ చెప్పే వరకు జెడ్పీలో అడుగుపెట్టేది లేదంటూ భీష్మించుకు కూర్చున్నారు. 20 నిమిషాల పాటు నిరసన తెలపగా ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పుట్ట మధు, సోమారపు సత్యనారాయణ, సతీశ్‌బాబు తదితరులు జీవన్‌రెడ్డితో మాట్లాడి సభలోకి రావాలని పదేపదే విజ్ఞప్తి చేయడంతో సభ్యులతో కలిసి ఆయన తిరిగివచ్చారు. ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మనసు బాధకలిగితే క్షమించాలని బెజ్జంకి జెడ్పీటీసీ శరత్‌రావు కోరడంతో గొడవ సద్దుమణిగింది. -
ఇప్పుడైనా జమయ్యేనా..
- ఇన్పుట్ సబ్సిడీ కోసం రైతుల ఎదురుచూపులు - వెంటనే జమ చేయాలని కేసీఆర్ ఆదేశం చొప్పదండి : నాలుగేళ్లుగా నీలం తుఫాన్, పై-లీన్ తుఫాను, వర్షాలు, వరదలతో జిల్లాలో రైతులు పంట నష్టపోయారు. వరి, మొక్కజొన్న, మామిడి పంటలు నష్టపోయిన రైతుల వివరాలను ఆయా సందర్భాలలో అధికారులు నమోదు చేసి, ప్రభుత్వానికి నివేదికలు అందించారు. పంట నష్ట పరిహారం కోసం పలు సందర్భాలలో రైతులు ఆందోళనలు సైతం నిర్వహించారు. నివేదికల ఆధారంగా అప్పటి ప్రభుత్వాలు పరిహారం మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశాయి. కానీ, రైతులకు ఇప్పటివరకు పరిహారం మాత్రం అందలేదు. 2011లో సుమారు రూ.3.41 కోట్లు, 2012లో రూ.4.53 కోట్లు, 2013లో సుమారు రూ.11 కోట్ల వరకు పంట నష్టం జరిగినట్లు తేల్చారు. వీటిని మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఏళ్లుగా ఎదురుచూపులు గత మే నెలలో జిల్లాకు రూ. 50.89 కోట్ల పెట్టుబడి రాయితీ మంజూరైందని అధికారులు ప్రకటించారు. ఇందులో ఉద్యానవన పంటలకు రూ. 15.44 కోట్లు మంజూరు కాగా, ఆహార పంటలకు రూ. 35.41 కోట్లు మంజూరయ్యాయి. 2012లో ఉద్యానవన పంటలపై ప్రృతి కన్నెర్ర చేయడంతో 1,700 హెక్టార్లలో 2,313 మంది రైతులు నష్టపోయారు. వీరికి రూ. 1.52 కోట్ల పరిహారం మంజూరైంది. 2013 ఫిబ్రవరిలో 9,200 హెక్టార్లలో నష్టపోయిన ఉద్యానపంటలకు రూ. 13.89 కోట్ల పరిహారం మంజూరైందని అధికారులు ప్రకటించారు. ఇదే సంవత్సరం ఏప్రిల్, మే నెలల్లో మరో ఇరవై ఎకరాల్లో ఎనభై మంది రైతులకు నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు. గత మే నెలలో నేరుగా రైతుల ఖాతాల్లోకే డబ్బులు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఎన్నికల హడావుడి, రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆ నిధులు ట్రెజరీలోనే మూలుగుతున్నాయి. ఎన్నికలు పూర్తయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా ఆ నిధుల విడుదలకు చర్యలు తీసుకోలేదు. ఈ క్రమంలో రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడం, రుణమాఫీపై స్పష్టత లేకపోవడంతో రైతులకు బ్యాంకులు రుణాలు మంజూరుచేయకపోవడంతో రైతులు పెట్టుబడి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంటనష్టపరిహారం కింద ఇన్పుట్ సబ్సిడీ వస్తే ఎంతో కొంత ఉపయోగంగా ఉంటుందని భావించారు. కానీ, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ క్రమంలో 2009 నుంచి 2014 వరకు ఇన్పుట్ సబ్సిడీని వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో రైతులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికైనా తమ ఖాతాల్లో డబ్బు చేరితే పెట్టుబడికి ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొంటున్నారు.