♦ నాలుగేళ్లుగా నాన్చుతున్నారు
♦ నివేదికలకే పరిమితమైన పంటనష్టం
♦ అదిగో.. ఇదిగో అంటూ కాలయాపన
♦ ఏళ్లుగా ఎదురుచూస్తున్న అన్నదాత
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : పంట నష్టపరిహారం అందని ద్రాక్షగా మారింది. ప్రకృతి వైపరీత్యాలతో ఏటా నష్టపోతున్న రైతుకు పరిహారం అందించటంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. నాలుగేళ్లుగా పంట నష్టపోతున్న రైతుకు ప్రభుత్వం ఇంతవరకు పరిహారం మంజూరు చేయలేదు. ఏటా నష్టపోతున్న పంటలకు సంబంధించిన నివేదికలు పంపడమే కానీ.. నిధులు విడుదల చేసిన దాఖలాలు లేవని అధికారులు చెబుతున్నారు. దీంతో అన్నదాతలు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు.
వివరాల్లో కెళితే... 2011 డిసెంబర్‌లో వచ్చిన థానే తుపానుకు జిల్లాలో 1415.34 హెక్టార్లలో వివిధ పంటలు దెబ్బతిన్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారయంత్రాంగం పంటనష్టంపై అంచనాలను సిద్ధం చేసింది. థానే తుపాను కారణంగా దెబ్బతిన్న పంటలకు సంబంధించి రూ.79,70,342 పరిహారం చెల్లించాలని ప్రభుత్వానికి నివేదికలు పంపారు. అదేవిధంగా 2012 జనవరిలో వచ్చిన తుపాను కారణంగా జిల్లాలో 2,177 మంది రైతులకు సంబంధించి 1943.03 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి.
పంట నష్టం కింద రూ.74,16, 232 పరిహారం అందించాలని నివేదికలు పంపారు. ఇకపోతే 2013 ఫిబ్రవరిలో కురిసిన భారీవర్షాలకు 843 మంది రైతులకు సంబంధించి 567.345 హెక్టార్లలో వివిధ పంటలు దెబ్బతిన్నాయి. అందుకు గాను రూ.46,79,909లు పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. అదే ఏడాది మే నెలలో వడగళ్ల వాన కురిసింది. దీంతో జిల్లాలో 124 మంది రైతులకు సంబంధించి 6,471 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. వారికి రూ.5,59,596 పరిహారం చెల్లించమని కోరారు. జిల్లాలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు 3,651 మంది రైతులకు సంబంధించి 2107.434 హెక్టార్లలో చేతికొచ్చే సమయంలో పంట నేలపాలైంది. అధికారులు రూ.3,16,11,510లు నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు.
సర్కారు కాలయాపన.. అప్పుల ఊబిలో అన్నదాత
ప్రతి ఏటా వచ్చిన అకాల వర్షాలకు పంటలు దెబ్బతింటున్నా.. ప్రభుత్వం మాత్రం ఒక్క రూపాయి ఇచ్చిన దాఖలాలు లేవు. పంటలు దెబ్బతిన్న సమయంలో ప్రభుత్వం అప్పటికప్పుడు అధికారులను పంపి నష్టానికి సంబంధించిన వివరాలు సేకరిస్తుంది. ఆ నివేదికలన్నీ ప్రభుత్వానికి పంపినా.. ఇంతవరకు పరిహారం మంజూరుచేసిన దాఖలాలు కనిపించలేదు. దివంగత సీఎం వైఎస్ ఆర్ ఉన్న సమయంలో విడుదలైన పరిహారం తప్పా.. తర్వాత ఒక్కరూపాయి కూడా రాలేదు. బ్యాంకుల్లో తీసుకున్న రుణం మాఫీ కాకపోవటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి పరిహారం మంజూరుచేయాలి.
పరిహారం పత్తాలేదు
Published Fri, Jun 19 2015 12:47 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement