ఇప్పుడైనా జమయ్యేనా..
- ఇన్‌పుట్ సబ్సిడీ కోసం రైతుల ఎదురుచూపులు
- వెంటనే జమ చేయాలని కేసీఆర్ ఆదేశం
చొప్పదండి : నాలుగేళ్లుగా నీలం తుఫాన్, పై-లీన్ తుఫాను, వర్షాలు, వరదలతో జిల్లాలో రైతులు పంట నష్టపోయారు. వరి, మొక్కజొన్న, మామిడి పంటలు నష్టపోయిన రైతుల వివరాలను ఆయా సందర్భాలలో అధికారులు నమోదు చేసి, ప్రభుత్వానికి నివేదికలు అందించారు. పంట నష్ట పరిహారం కోసం పలు సందర్భాలలో రైతులు ఆందోళనలు సైతం నిర్వహించారు. నివేదికల ఆధారంగా అప్పటి ప్రభుత్వాలు పరిహారం మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశాయి. కానీ, రైతులకు ఇప్పటివరకు పరిహారం మాత్రం అందలేదు. 2011లో సుమారు రూ.3.41 కోట్లు, 2012లో రూ.4.53 కోట్లు, 2013లో సుమారు రూ.11 కోట్ల వరకు పంట నష్టం జరిగినట్లు తేల్చారు. వీటిని మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఏళ్లుగా ఎదురుచూపులు
గత మే నెలలో జిల్లాకు రూ. 50.89 కోట్ల పెట్టుబడి రాయితీ మంజూరైందని అధికారులు ప్రకటించారు. ఇందులో ఉద్యానవన పంటలకు రూ. 15.44 కోట్లు మంజూరు కాగా, ఆహార పంటలకు రూ. 35.41 కోట్లు మంజూరయ్యాయి. 2012లో ఉద్యానవన పంటలపై ప్రృతి కన్నెర్ర చేయడంతో 1,700 హెక్టార్లలో 2,313 మంది రైతులు నష్టపోయారు. వీరికి రూ. 1.52 కోట్ల పరిహారం మంజూరైంది. 2013 ఫిబ్రవరిలో 9,200 హెక్టార్లలో నష్టపోయిన ఉద్యానపంటలకు రూ. 13.89 కోట్ల పరిహారం మంజూరైందని అధికారులు ప్రకటించారు.
ఇదే సంవత్సరం ఏప్రిల్, మే నెలల్లో మరో ఇరవై ఎకరాల్లో ఎనభై మంది రైతులకు నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు. గత మే నెలలో నేరుగా రైతుల ఖాతాల్లోకే డబ్బులు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఎన్నికల హడావుడి, రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆ నిధులు ట్రెజరీలోనే మూలుగుతున్నాయి. ఎన్నికలు పూర్తయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా ఆ నిధుల విడుదలకు చర్యలు తీసుకోలేదు. ఈ క్రమంలో రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడం, రుణమాఫీపై స్పష్టత లేకపోవడంతో రైతులకు బ్యాంకులు రుణాలు మంజూరుచేయకపోవడంతో రైతులు పెట్టుబడి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పంటనష్టపరిహారం కింద ఇన్‌పుట్ సబ్సిడీ వస్తే ఎంతో కొంత ఉపయోగంగా ఉంటుందని భావించారు. కానీ, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ క్రమంలో 2009 నుంచి 2014 వరకు ఇన్‌పుట్ సబ్సిడీని వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో రైతులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికైనా తమ ఖాతాల్లో డబ్బు చేరితే పెట్టుబడికి ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొంటున్నారు.