వారంలో పంట నష్టపరిహారం పంపిణీ
పుట్టపర్తి టౌన్ : వారం రోజుల్లో జిల్లా రైతులకు 2013-14 సంవత్సరానికి సంబంధించి పంట నష్టపరిహారం పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర సమాచార, ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పుట్టపర్తికి విచ్చేసిన మంత్రి పర్తిసాయి ధర్మశాలలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 692 కోట్ల పంట నష్టపరిహారం మంజూరైతే ఇందులో రూ.569 కోట్లు అనంతపురం జిల్లాకు మంజూరైందన్నారు. త్వరలోనే జిల్లా పర్యటనకు రానున్న ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు చేతులు మీదుగా పరిహారం పంపిణీ ప్రారంభిస్తామన్నారు.
పశుగ్రాసం పెంపకానికి సబ్సిడీతో గడ్డివిత్తనాలు పంపిణీ చేస్తామన్నారు. దాణాను ఉచితంగా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. బుక్కపట్నం ప్రధాన రహదారి విస్తరణ పనులు త్వరలో చేపడతామని, కొత్తచెరువులో ఇంటి పట్టాలు త్వరలో పంపిణీ చేస్తామన్నారు.