శ్రుతి మించిన మంత్రి పల్లె రఘునాథరెడ్డి స్వామి భక్తి
హిందూపురం రూరల్: రాష్ట్ర సమాచారశాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి పదవీ గండం భయం పట్టుకున్నట్లుంది. తన అమాత్య పదవి పోకుండా ఉండేందుకు అయిన దానికి, కాని దానికి ముఖ్యమంత్రి చంద్రబాబును ఆకాశానికి ఎత్తుతుండటం చూసి విస్తుపోతున్నారు. ‘రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు రోజుకు 36 గంటలు పనిచేస్తున్నారు. ఒకప్పుడు ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ లాంటి నాయకులను కూడా సమర్థవంతంగా ఎదుర్కొన్న ఘనత నారా వారిది’ అంటూ ఆయన అనంతపురం జిల్లా హిందూపురంలో విలేకరులతో అన్నారు.
అదేంటి సార్.. అలా అంటున్నారంటే, ''అంతేనయ్యా.. మా ముఖ్యమంత్రి నిద్రపోకుండా పని చేస్తున్నారని చెబుతున్నాను'' అని కూడా అంటున్నారు. ఈ సారి మంత్రివర్గ విస్తరణలో ‘పల్లె’కు బెర్త్ దొరకదనే ప్రచారం ఊపందుకోవడంతో ఎక్కడ లేని భక్తి పుట్టుకొచ్చిందని ‘అనంత’వాసులు చర్చించుకుంటున్నారు.