నోరు జారి చీఫ్ విప్ పదవీ పొగొట్టుకున్న‘పల్లె’
అమరావతి: మంత్రి పదవి పోయినందుకే తీవ్ర మనోవేదనతో ఉన్న పల్లె రఘునాథరెడ్డికి ఇప్పుడు ప్రభుత్వ చీఫ్ విప్ పోస్టు కూడా లేకుండా పోయింది. మంత్రి పదవి కుల సమీకరణల నేపథ్యంలో పోగా... నోరుజారి చీఫ్ విప్ పదవి పోగొట్టుకున్నట్టు మంగళవారం శాసనసభ లాబీల్లో తెలుగుదేశం పార్టీ నేతలే చెప్పుకొచ్చారు. మంత్రివర్గ విస్తరణకు ముందు కాల్వ శ్రీనివాసులు చీఫ్ విప్‌గా ఉన్నారు. ఆయన బోయ సామాజిక వర్గానికి చెందినవారు. ఆ వర్గాన్ని ఎస్టీలలో చేరుస్తామని చంద్రబాబు నాయుడు 2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. అది సాధ్యపడే అవకాశం లేకపోవడంతో ఆ వర్గానికి చెందిన కాల్వకు మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించారు.
ఆ విషయాన్నే చంద్రబాబు పల్లెకు వివరిస్తూ... ‘మిమ్మల్ని మంత్రివర్గం నుంచి తప్పించాలని లేదు. కానీ బోయల్ని ఎస్టీలలో చేర్చే పరిస్థితి లేదు. ఆ వర్గాన్ని సంతృప్తి పరిచేందుకు కాల్వకు మంత్రి పదవి ఇవ్వాలనుకున్నా. మీకు చీఫ్ విప్ పదవి ఇస్తా’నని చెప్పారు. దాంతో సంతృప్తి పడిన పల్లె రఘునాథరెడ్డి ఆగమేఘాల మీద సమాచార ప్రజా సంబంధాల శాఖ నుంచి మీడియాకు ప్రకటన ఇప్పించుకున్నారు. చీఫ్ విప్ పేరిట ఓ వాట్సాప్ గ్రూపును తయారు చేయించుకున్నారు.
అంతవరకు బాగానే ఉన్నా... ఆ తర్వాతే కథ చెడింది. మంత్రి పదవి నుంచి ఎందుకు తప్పించాల్సి వస్తుందో తనకు రహస్యంగా ముఖ్యమంత్రి చెప్పిన విషయాన్ని తన అనుచరుల వద్ద బహిర్గతం చేశారు. అది కాల్వ శ్రీనివాసులుకు తెలిసి చంద్రబాబు చెవిన పడేశారు. దాంతో ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు పల్లెకు ప్రకటించిన చీఫ్ విప్ పదవిని కూడా పీకేశారు. అందువల్లనేనేమో మంగళవారం శాసనసభలో కాల్వ శ్రీనివాసులు చీఫ్ విప్ పాత్ర కూడా పోషించారు.