నేనూ రాయలసీమ వాడినే!
♦ సీమ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా?: సీఎం సవాల్
♦ ఉర్దూ టీచర్ల నియామకానికి ప్రత్యేక డీఎస్సీ
♦ కర్నూలు, వైఎస్సార్ జిల్లాల పర్యటనలో చంద్రబాబు వెల్లడి
సాక్షి ప్రతినిధి, కర్నూలు/కడప: ‘‘నేనూ రాయలసీమలోనే పుట్టాను. రాయలసీమ వాడినే. రాయలసీమను అభివృద్ధి చేసింది ఎన్టీఆర్. ఆ తర్వాత నేనే. కొంతమంది పెత్తందారీతనంతో ఇక్కడికి పరిశ్రమలు రాకుండా అడ్డుపడుతున్నారు. అభివృద్ధికి అడ్డుపడితే బుల్డోజర్‌లా ముందుకెళతా. బుల్లెట్‌లా దూసుకుపోతా. 52 ఏళ్లలో ఎవరి హయాంలో సీమ అభివృద్ధి జరిగిందనే అంశంపై చర్చకు సిద్ధమా’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాలు విసిరారు. ఆయన సోమవారం కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లులో ఉర్దూ విశ్వవిద్యాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. బహిరంగ సభలో మాట్లాడారు. అనంతరం గోరుకల్లు రిజర్వాయర్‌ను పరిశీలించారు. గోరుకల్లులో ఏర్పాటు చేసిన ‘మీ ఇంటికి-మీ భూమి’ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో వైఎస్సార్ జిల్లాకు బయల్దేరి వెళ్లారు. జిల్లాలోని ముద్దనూరులో దళిత, గిరిజన రుణమేళా సదస్సులో ప్రసంగించారు.
కడపలో హజ్ హౌస్ : ఇమామ్‌లతో పాటు మౌజార్లకు గౌరవ వేతనం ఇవ్వనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇమామ్‌లకు నెలకు రూ.5 వేలు, మౌజార్లకు రూ.3 వేల చొప్పున గౌరవ వేతనాన్ని ఈ నెల నుంచే ఇస్తామన్నారు. కడపలో హజ్ హౌస్‌ను నిర్మిస్తామని తెలిపారు. ఉర్దూ టీచర్ల నియామకానికి ప్రత్యేక డీఎస్సీని ప్రకటిస్తామన్నారు. హైదరాబాద్ నుంచి కర్నూలు మీదుగా బెంగళూరు వరకు పారిశ్రామిక కారిడార్‌ను ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతామని చంద్రబాబు తెలిపారు. సుమారు 125 ఎకరాల్లో రూ.150 కోట్లతో ఉర్దూ వర్సిటీని ఏర్పాటు చేస్తామని మంత్రి పల్లె చెప్పారు.
సీమను సస్యశ్యామలం చేస్తాం...
‘‘రానున్న కాలంలో నదుల అనుసంధానం చేస్తున్నాం. 80 టీఎంసీల గోదావరి నీటిని పట్టిసీమ ద్వారా రాయలసీమకు మళ్లిస్తాం. హంద్రీ-నీవా, గాలేరు నగరి ద్వారా సీమను సస్యశ్యామలం చేస్తాం’’ అని సీఎం చంద్రబాబు ముద్దనూరులో ప్రకటించారు.