ఎదురుచూపులే...
♦ ఏడాది కావస్తున్నా అందని పంటల పరిహారం
♦ రూ.197 కోట్ల పరిహారానికి ఎదురుచూపులు
♦ ఖరీఫ్ సమీపిస్తున్నా ఖాతాల్లో చేరని డబ్బులు
♦ కేంద్ర సాయం రానందునే జాప్యం ఆందోళనలో రైతాంగం
గత ఖరీఫ్ పోయి మరో ఖరీఫ్ రావట్టే.. అయినా అందని పంటల పరిహారం. ఏడాది కావస్తున్నా పరిహారం రాక ఆందోళనలో రైతన్న. వర్షాభావం కారణంగా జిల్లా మొత్తాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించిన అధికారులు ఆ మేరకు పరిహారం పంపిణీలో విఫలమయ్యారు. క్షేత్ర స్థాయిలో సర్వే జరిపినా, ఖాతా వివరాలు సేకరించినా డబ్బులు జమ కావడం లేదని రైతులు మండిపడుతున్నారు. ఆ పరిహారం డబ్బులేవో ఇప్పుడిచ్చినా వచ్చే ఖరీఫ్ పెట్టుబడికి సాయంగా ఉంటుందని రైతులు ఆశిస్తున్నారు. - సాక్షి, సంగారెడ్డి
వర్షాభావ పరిస్థితులు, పంట నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం జిల్లాలోని 46 మండలాలను ప్రభుత్వం కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. జిల్లాలోని 4,78,431 మంది రైతులకు చెందిన 2,72,605 హెక్టార్లలో పంటనష్టం వాటిల్లినట్టు అధికారులు గుర్తించారు. పంట నష్టపోయిన రైతులకు రూ.197.97 కోట్ల మేర పరిహారం చెల్లించాలని అధికారులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదికలు పంపారు.
కేంద్ర బృందం పర్యటించినా...
కేంద్ర కరువు సహాయక బృందం అధికారులు జిల్లాలో పర్యటించి నష్టం వివరాలను సేకరించారు. రైతులతో మాట్లాడి నష్టం వివరాలను తెలుసుకున్నారు. పరిహారం త్వరగానే అందుతుందని రైతులు భావించారు. మళ్లీ ఖరీఫ్ సమీపిస్తున్నా ఇంతవరకు కరువు సాయం అందకపోవడంతో రైతులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
రబీలోనూ...
గత ఏడాది ఖరీఫ్‌తోపాటు రబీలోనూ పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో రైతులు ప్రభుత్వం అందజేసే పంటనష్ట పరిహారం కోసం ఎదురుచూస్తున్నారు. నష్టపోయిన రైతులు ఇది వరకే తమ బ్యాంకు ఖాతాల వివరాలను అధికారులకు అందజేశారు. రైతుల ఖాతాల్లో పరిహా రం డబ్బులు నేరుగా జమవుతాయని అధికారులు చెబుతున్నా డిపాజిట్ కాలేదు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో వచ్చే ఖరీఫ్‌పై రైతు ల్లో ఆశలు చిగురించాయి. ఖరీఫ్‌లో పంటల సాగుకు వీలుగా ఇకనైనా పరిహారం డబ్బులు అందజేయాలని రైతులు కోరుతున్నారు.
2.72 లక్షల హెక్టార్లలో పంటనష్టం...
గత ఏడాది ఖరీఫ్‌లో జిల్లాలో పెద్ద ఎత్తున పంటనష్టం వాటిల్లింది. వేలాది ఎకరాల్లో పంటనష్టం జరిగినా 33 శాతానికి మించి నష్టం వాటిల్లితేనే పరిహారం అందేందుకు రైతులు అర్హులవుతారు. నిబంధలన మేరకు లెక్కింపులు చేపడితే జిల్లాలో 33 శాతానికిపైగా 4,78,431 మంది రైతులకు చెందిన 2,72,605 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. ఆరుతడి పంటలు 2,72,356 హెక్టార్లలో దెబ్బతినగా బోరుబావుల కింద 249.1 హెక్టార్లలో పంటలు నష్టపోయాయి. పత్తి, మొక్కజొన్న, సోయాబీన్‌తోపాటు సజ్జలు, మినుములు, ఆముదం, పెసర, జొన్న, కంది, నువ్వులు, చెరకు పంటలు దెబ్బతిన్నాయి. ఆయా పంటలకు సంబంధించి రూ.197.97 కోట్ల మేర పరిహారం చెల్లించాల్సి ఉంది. ఏడాది గడుస్తున్నా పరిహారం చెల్లించకపోవడంపై రైతుల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది.
కేంద్ర సాయం లేకనే...
కేంద్ర ప్రభుత్వం నుంచి కరువు సహాయం అందకపోవడం వల్లే నష్టం పరిహారం చెల్లింపుల్లో జాప్యం జరుగుతున్నట్టు సమాచారం. రాబోయే పక్షం రోజుల్లో పరిహారం డబ్బులు రైతులకు అందుతాయని అధికారులు చెబుతున్నారు. ఖరీఫ్ ప్రారంభానికి ముందే రైతులకు డబ్బులు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది.