న్యూఢిల్లీ: దేశ రాజధానిలో చెలరేగుతున్న హింసను కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు, యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ తీవ్రంగా ఖండించారు. బీజేపీ నేతలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం వల్లే ఢిల్లీలో అల్లర్లు చెలరేగాయని ఆరోపించారు. ఈ ఘటనలకు బీజేపీతో పాటు ఆప్ ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అనుకూల, వ్యతిరేక అల్లర్లతో ఢిల్లీ అట్టుకుడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ బుధవారం సమావేశమైంది. అనంతరం సోనియా గాంధీ మీడియాతో మాట్లాడుతూ... నిఘా వైఫల్యం కారణంగానే అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారని విమర్శించారు. ఢిల్లీలో చెలరేగిన హింసకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా బాధ్యత వహిస్తూ.. వెంటనే రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు.(ఢిల్లీ అల్లర్లు: ఇంటలిజెన్స్ ఆఫీసర్ మృతి)
‘‘అనేక ప్రాంతాల ప్రజలు ఢిల్లీలో జీవిస్తున్నారు. ఢిల్లీ అల్లర్లలో 72 గంటల్లో దాదాపు 20 మంది చనిపోయారు. వందలాది మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శాంతి భద్రతలు కాపాడటంలో ఢిల్లీ ప్రభుత్వం విఫలమైంది. ఆప్ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఘటనకు బాధ్యత వహించాలి. ఈశాన్య ఢిల్లీలో ఇంకా ఘర్షణలు కొనసాగుతున్నాయి. అల్లర్లను అదుపులోకి తెచ్చి ప్రజలకు భద్రత కల్పించాలి’’అని సోనియా గాంధీ పేర్కొన్నారు. కాగా ఢిల్లీలో చెలరేగుతున్న అల్లర్లలో ఇప్పటికే 20 మంది మరణించగా.. దాదాపు 200 మంది గాయపడ్డారు. పోలీసు హెడ్ కానిస్టేబుల్ రతన్‌లాల్, ఇంటలిజెన్స్ కానిస్టేబుల్ అంకిత్ శర్మ కూడా మృతిచెందిన వారిలో ఉన్నారు. (ఢిల్లీ అల్లర్లు: కేంద్రానికి కేజ్రీవాల్ విజ్ఞప్తి)
Comments
Please login to add a commentAdd a comment