సాక్షి, న్యూఢిల్లీ : జాతీయ అర్హతా ప్రవేశ పరీక్ష( నీట్) ఆలిండియా కోటా ద్వారా వైద్య కళాశాలల్లో ఓబీసీలకు రిజర్వేషన్ కోరుతూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి శుక్రవారం లేఖ రాశారు. రిజర్వేషన్లు నిరాకరించడంతో ఓబీసీలు 2017 నుంచి 11,000 సీట్లను కోల్పోయారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నీట్ ఆలిండియా కోటా ద్వారా భర్తీ చేసే పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వైద్య కళాశాలల్లో ఓబీసీ విద్యార్ధులకు రిజర్వేషన్లను నిరాకరిస్తున్న విషయాన్ని మీ దృష్టికి తీసుకువస్తున్నానని ప్రధానమంత్రి మోదీకి రాసిన లేఖలో సోనియా గాంధీ పేర్కొన్నారు. ఆలిండియా కోటా కింద షెడ్యూల్డ్ కులాలకు 15 శాతం, షెడ్యూల్డ్ తెగలకు 7.5 శాతం, ఓబీసీలకు 10 శాతం సీట్లను కేటాయించిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు.
ఓబీసీ అభ్యర్ధుల రిజర్వేషన్‌ను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని వైద్య విద్యా సంస్ధలు అమలు చేయడం లేదని, కేవలం జాతీయస్ధాయి వైద్య విద్యాసంస్ధల్లోనే ఓబీసీ కోటా వర్తింపచేస్తున్నారని లేఖలో వివరించారు. రాష్ట్రాల్లోని వైద్య విద్యా సంస్ధల్లో ఓబీసీ విద్యార్ధుల రిజర్వేషన్ అమలుకు నోచుకోకపోవడంతో అర్హులైన అభ్యర్ధులకు వైద్య విద్యను అభ్యసించడంలో ఆటంకాలు ఎదురవుతున్నాయని తెలిపారు. సమానత్వం, సామాజిక న్యాయం ప్రయోజనాలు అందరికీ అందేలా ఓబీసీ విద్యార్ధుల ఆలిండియా కోటా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని వైద్య సంస్థల్లో కూడా అమలయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నానని ఈ లేఖలో ప్రధాని మోదీని సోనియా కోరారు. (చదవండి : మోదీ విధానాల వల్లే వివాదం)
ఆలిండియా కోటా కింద ఎంబీబీఎస్ సీట్లలో 15 శాతం, పీజీ వైద్య సీట్లలో 50 శాతం సీట్లను రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి కేటాయిస్తాయి.ఈ సీట్లలో ప్రవేశానికి దేశవ్యాప్తంగా విద్యార్ధులు రిజర్వేషన్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కాగా సుప్రీంకోర్టు వద్ద ఓబీసీ కోటా వ్యవహరం పెండింగ్‌లో ఉండటంతో అది పరిష్కారమయ్యేవరకూ ప్రభుత్వ విద్యాసంస్ధల్లో ఆలిండియా కోటా కింద ఓబీసీ విద్యార్ధుల అడ్మిషన్‌పై ఓ నిర్ణయం తీసుకోలేమని ఇటీవల కేంద్ర ప్రభుత్వం మద్రాస్ హైకోర్టుకు నివేదించింది. మరోవైపు మేలో జరగాల్సిన నీట్ పరీక్ష కరోనా మహమ్మారి విజృంభణతో వాయిదా పడింది. కోవిడ్-19 కేసుల వ్యాప్తి నేపథ్యంలో నీట్ పరీక్ష ఇప్పట్లో జరిగే పరిస్ధితి కనిపించడం లేదు. ఇక జేఈఈ, నీట్ పరీక్షల వాయిదాపై నిపుణుల కమిటీ సూచనల ప్రకారం ఓ నిర్ణయం తీసుకుంటామని హెచ్‌ఆర్‌డీ మంత్రి రమేష్ పోక్రియాల్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment