‘ఆమెకు 24 సంవత్సరాల శిక్ష సరైందే’ | Sonu Punjaban Gets 24 Years in Jail | Sakshi
Sakshi News home page

భారీ సెక్స్‌ రాకెట్‌ నిర్వాహకురాలికి కఠిన శిక్ష

Published Wed, Jul 22 2020 9:19 PM | Last Updated on Wed, Jul 22 2020 9:25 PM

Sonu Punjaban Gets 24 Years in Jail - Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధానిలోనే అత్యంత భారీ సెక్స్ రాకెట్ నిర్వాహకురాలికి స్థానిక కోర్టు 24 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. సోను పంజాబన్ అలియాస్ గీతా అరోరాగా గుర్తింపు పొందిన ఈ మహిళ ఢిల్లీలోనే అత్యంత భారీ సెక్స్ రాకెట్‌ను నిర్వహించినట్టు ఆమెపై వచ్చిన ఆరోపణలు రుజువయ్యాయని కోర్టు తెలిపింది. దాంతో ద్వారకా జిల్లా కోర్టు బుధవారం ఆమెకు 24 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. ఆమెతో పాటు సహ నిందితుడైన సందీప్‌కు 20 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. కోర్టు తీర్పు సందర్భంగా న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘సోను పంజాబన్ ఓ మహిళ అయినప్పటికి అన్ని హద్దులను దాటింది. ఆమెకు కఠిన శిక్షే సరైందని’ పేర్కొన్నారు. 

సోను పంజాబన్, సందీప్ కలసి చిన్న వయసు బాలికలను వ్యభిచార కూపంలోకి దింపేవారు. ఇందుకు గాను మైనర్‌ బాలికల కిడ్నాప్‌లకు కూడా పాల్పడ్డారు. ఈ క్రమంలో పోలీసులు 2014లో ఓ బాలిక ఫిర్యాదు మేరకు సోను పంజాబన్‌పై నిజాఫ్గఢ్ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఆమె ఆరుగురు సహాయకులపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. సందీప్ మీద కిడ్నాప్, సెక్స్ రాకెట్, లైంగిక దాడి కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత ఈ కేసు దర్యాప్తు క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ చేశారు. ఈ కేసులో వీరిని అరెస్ట్ చేసిన పోలీసులు తీహార్ జైల్లో ఉంచారు. కొన్ని రోజుల క్రితం సోను పంజాబన్ తీహార్‌ జైల్లో మందులు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. దాంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. చికిత్స తర్వాత కోలుకుంది. 

ఈ కేసులో బాధితురాలు అయిన బాలిక కిడ్నాప్‌కు గురైనప్పుడు 12 సంవత్సరాల పది నెలల వయసు అని పోలీసులు తెలిపారు. 2009లో బాలికను కిడ్నాప్ చేసిన సందీప్.. ఆమెను మరొకరికి విక్రయించాడు. ఈ క్రమంలో బాలికను దాదాపు 12 మందికి విక్రయించారు. బాధితురాలికి భారీ ఎత్తున మత్తు పదార్థాలు ఇచ్చారని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ఒకసారి బాలిక సోను పంజాబన్‌ చెర నుంచి తప్పించుకుని నిజాఫ్గఢ్‌ పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుంది. తాను అనుభవించిన నరకం గురించి పోలీసులకు చెప్పింది. బాలిక ఫిర్యాదు ఆధారంగా పోలీసులు సోను పంజాబన్‌ను అరెస్ట్‌ చేశారు. ఈ క్రమంలో బాధితురాలికి రూ.7 లక్షల పరిహారం కూడా ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement