సాక్షి, ముంబై : బిగ్ బీ అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా సోనీ టీవీ చానెల్‌లో ప్రసారమవుతున్న కౌన్ బనేగా కరోడ్‌పతి కార్యక్రమంలో మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్‌కు తగిన గౌరవం ఇవ్వలేదని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోనిటీవీ చానెల్‌ను, కేబీసీ కార్యక్రమాన్ని బహిష్కరించాలంటూ పిలుపునిస్తున్నారు. వివరాలు.. బుధవారం (నవంబర్ 6) నాటి కేబీసీ ఎపిసోడ్‌లో మొఘల్ సామ్రాట్ ఔరంగజేబ్‌కు సమకాలికుడు ఎవరు? అనే ప్రశ్నకు సమాధానంగా నాలుగు ఆప్షన్లు ఇచ్చారు.
అవి.. a)మహారాణా ప్రతాప్, b)మహారాజా రంజిత్ సింగ్, c)రాణా సంగా, d)శివాజీ. అయితే మొదటి ముగ్గురి రాజుల పేర్లకు ముందు వారి బిరుదులను చేర్చినట్టుగా శివాజీకి చేర్చలేదని నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకున్న బిరుదుతో కలిపి ‘ఛత్రపతి శివాజీ మహారాజ్’ అని ఆప్షన్ ఇవ్వకుండా అవమానించారని అంటున్నారు.
హిందూ దేవాలయాలను కూల్చేసిన ఔరంగజేబుకు మెఘల్ సామ్రాట్ అనే బిరుదును ఎలా పెట్టారని ఒక నెటిజన్ విమర్శించగా.. ఔరంగజేబు చేత శివాజీ దక్షిణ భారత సింహం అనిపించుకున్నాడని, అదీ ఆయన గొప్పతనమని మరొకరు కామెంట్ చేశారు. హిందూ సామ్రాజ్యాన్ని తిరిగి స్థాపించిన వీరుడిని అగౌరవపరచడం అవమానకరమని, దీనివల్ల భవిష్యత్ తరాలకు ఏం నేర్పుతున్నామని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. #BoycottSonyTv, #BoycottKBC హ్యాష్‌ట్యాగ్‌లతో ట్విటర్‌ను హోరెత్తిస్తున్నారు. అయితే, ఈ వివాదంపై తక్షణం స్పందించిన సోని టీవీ యాజమాన్యం ట్విటర్ వేదికగా క్షమాపణలు చెప్పింది. మరుసటి రోజునే (గురువారం) కేబీసీ ప్రోగ్రాం సమయంలో క్షమాపణలు చెబుతూ స్క్రోలింగ్ రన్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment