సాక్షి, బెంగళూర్ : కేంద్ర పాలకులు దక్షిణాదిని నిర్లక్ష్యం చేస్తున్నారంటూ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.జాతీయ పార్టీకి చెందిన ఓ రాష్ట్ర సీఎం ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. సహజంగా ప్రాంతీయ పార్టీల నేతలు తరచూ ఉత్తరాది, దక్షిణాది పేరుతో వ్యాఖ్యలు చేస్తుండగా తాజాగా కాంగ్రెస్‌కు చెందిన సీఎం ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఆసక్తి రేపుతోంది. సర్కార్ ఖజానాకు దక్షిణాది నుంచి అధిక ఆదాయం సమకూరుతుండగా..అత్యధిక నిధులు ఉత్తరాదికి మళ్లిస్తున్నారని సిద్ధరామయ్య మండిపడ్డారు.
ఆరు రాష్ట్రాలతో కూడిన దక్షిణాది పన్నుల రూపంలో పెద్దమొత్తం సమకూరుస్తోందని..యూపీలో పన్ను కింద జమవుతున్న ప్రతిరూపాయికీ ఆ రాష్ట్రానికి రూ 1.79 అందుతుండగా, కర్ణాటకకు మాత్రం 47 పైసలే దక్కుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాంతీయ అసమానతలను తగ్గించకపోతే ఇక అభివృద్ధికి చోటెక్కడ అంటూ ఆయన ప్రశ్నించిన తీరు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. కేంద్ర పన్నుల పంపిణీకి జనాభా కీలకమైతే తాము ఎన్నాళ్లు బలికావాల్సి వస్తుందని ది న్యూస్‌మినిట్ వెబ్‌సైట్‌లో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కర్ణాటక, కేరళ, ఏపీ, తమిళనాడు, మహారాష్ట్ర అత్యధికంగా కేంద్ర పన్నులను చెల్లిస్తుండగా కేంద్రం నుంచి తమకు దక్కేది అరకొరేనని అసంతృప్తి వెళ్లగక్కారు. తమ రాష్ట్రాల నుంచి సమకూరే పన్నులు తమకే అత్యధికంగా చెందేలా వ్యవస్థను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. గతంలో ఏపీ, తెలంగాణ సీఎంలు సైతం పలు సందర్భాల్లో తాము అత్యధికంగా పన్నులు చెల్లిస్తున్నా కేంద్రం నుంచి ఆ స్థాయిలో రాబడి రావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment