karnataka cm sidharamaiah
-
కేంద్రానికి ప్రతిఘటన తప్పదన్న సిద్ధూ
సాక్షి, న్యూఢిల్లీ : దక్షిణాది రాష్ట్రాల్లో కేంద్ర వైఖరిపై పెరుగుతున్న అసహనానికి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి. కేంద్రాన్ని ప్రతిఘటించాల్సిన అవసరం నెలకొందని తమిళనాడు, కేరళ, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, పుదుచ్చేరి సీఎంలకు పిలుపు ఇస్తూ సిద్ధరామయ్య చేసిన ట్వీట్ దుమారం రేపుతోంది. ‘పన్నుల పంపిణీకి ఇప్పటివరకూ 1971 జనాభా లెక్కలను ప్రామాణికంగా తీసుకోగా, ఇప్పుడు 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రం 15వ ఆర్థిక సంఘాన్ని కోరడం దక్షిణాది ప్రయోజనాలకు మరింత విఘాతం కలిగిస్తుందని..దీన్ని మనం ప్రతిఘటించా’లని సిద్ధరామయ్య శుక్రవారం ట్వీట్ చేశారు. తన పోస్టును ఆయన ఆరుగురు ఇతర సీఎంల ట్విటర్ ఖాతాలకు ట్యాగ్ చేశారు. ఈ పోస్ట్‌ను డీఎంకే నేత ఎంకే స్టాలిన్, కాంగ్రెస్ నేత శశి థరూర్‌కూ సిద్ధరామయ్య ట్యాగ్ చేశారు. ఆర్థిక సంఘానికి కేంద్రం చేసిన తాజా సిఫార్సులపై దక్షిణాది రాష్ట్రాలు మండిపడుతున్నాయి. 1971 తర్వాత దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణకు పలు చర్యలు చేపట్టగా ఉత్తరాదిలో ఈ చర్యలు కొరవడటంతో జనాభా పెరుగుదల అధికంగా ఉంది. దీంతో 2011 జనాభా లెక్కల ప్రకారం పన్నుల పంపిణీ జరిగితే తక్కువ జనాభా కలిగిన దక్షిణాదికి నిధులు తక్కువ స్ధాయిలో వస్తాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. -
దక్షిణాదికి మొండిచేయిపై సిద్ధూ ఫైర్
సాక్షి, బెంగళూర్ : కేంద్ర పాలకులు దక్షిణాదిని నిర్లక్ష్యం చేస్తున్నారంటూ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.జాతీయ పార్టీకి చెందిన ఓ రాష్ట్ర సీఎం ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. సహజంగా ప్రాంతీయ పార్టీల నేతలు తరచూ ఉత్తరాది, దక్షిణాది పేరుతో వ్యాఖ్యలు చేస్తుండగా తాజాగా కాంగ్రెస్‌కు చెందిన సీఎం ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఆసక్తి రేపుతోంది. సర్కార్ ఖజానాకు దక్షిణాది నుంచి అధిక ఆదాయం సమకూరుతుండగా..అత్యధిక నిధులు ఉత్తరాదికి మళ్లిస్తున్నారని సిద్ధరామయ్య మండిపడ్డారు. ఆరు రాష్ట్రాలతో కూడిన దక్షిణాది పన్నుల రూపంలో పెద్దమొత్తం సమకూరుస్తోందని..యూపీలో పన్ను కింద జమవుతున్న ప్రతిరూపాయికీ ఆ రాష్ట్రానికి రూ 1.79 అందుతుండగా, కర్ణాటకకు మాత్రం 47 పైసలే దక్కుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాంతీయ అసమానతలను తగ్గించకపోతే ఇక అభివృద్ధికి చోటెక్కడ అంటూ ఆయన ప్రశ్నించిన తీరు ఆన్లైన్లో వైరల్‌గా మారింది. కేంద్ర పన్నుల పంపిణీకి జనాభా కీలకమైతే తాము ఎన్నాళ్లు బలికావాల్సి వస్తుందని ది న్యూస్‌మినిట్ వెబ్సైట్లో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కర్ణాటక, కేరళ, ఏపీ, తమిళనాడు, మహారాష్ట్ర అత్యధికంగా కేంద్ర పన్నులను చెల్లిస్తుండగా కేంద్రం నుంచి తమకు దక్కేది అరకొరేనని అసంతృప్తి వెళ్లగక్కారు. తమ రాష్ట్రాల నుంచి సమకూరే పన్నులు తమకే అత్యధికంగా చెందేలా వ్యవస్థను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. గతంలో ఏపీ, తెలంగాణ సీఎంలు సైతం పలు సందర్భాల్లో తాము అత్యధికంగా పన్నులు చెల్లిస్తున్నా కేంద్రం నుంచి ఆ స్థాయిలో రాబడి రావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. -
‘బీజేపీ, ఆరెస్సెస్‌లోనూ అతివాదులు’
బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య బీజేపీ, ఆరెస్సెస్‌పై మరోసారి నిప్పులు చెరిగారు. బీజేపీతో పాటు ఆరెస్సెస్‌లో హిందుత్వ అతివాదులు ఉన్నారని ఆయన ఆరోపించారు. బీజేపీతో పాటు ఆరెస్సెస్, బజరంగ్‌దళ్‌లో ఉగ్రవాదులు ఉన్నారని ఆయన గతంలో వ్యాఖ్యానించడం తెలిసిందే. ‘వాళ్లు(బీజేపీ, ఆరెస్సెస్) హిందుత్వ ఉగ్రవాదులని నేను చెప్పాను. నేను హిందువునే. కానీ నేను మానవత్వం ఉన్న హిందువును. కానీ వాళ్లు(బీజేపీ, ఆరెస్సెస్) మానవత్వం లేని హిందువులు’ అని అన్నారు. అయితే ఖలిస్తాన్‌తో పాటు ఎల్టీటీఈకి అండదండలు అందించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనని బీజేపీ ఎంపీ శోభా కరంద్లాజే విమర్శించారు. -
సిద్ధూపై ఏసీబీకి ఫిర్యాదు
సాక్షి, బెంగళూరు: ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై అవినీతి నిరోధక సంస్థ (ఏసీబీ)కు ఈ ఏడాది మొదటి రోజే ఫిర్యాదు అందింది. ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన సొమ్మును కాంగ్రెస్ పార్టీ సొంత ప్రచారానికి వినియోగిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్నది ప్రధాన ఆరోపణ. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను వివరిస్తూ వివిధ పత్రికలు, టీవీ మాధ్యమాలకు గత నాలుగన్నరేళ్లలో దాదాపు రూ.129.46 కోట్ల యాడ్స్ ఇచ్చారని బెంగళూరు నాగరిక హక్కు పోరాట సమితి ఉపాధ్యక్షుడు గణేష్‌సింగ్ ఏసీబీకి సోమవారం ఫిర్యాదు చేశారు. సదరు యాడ్స్‌లో పథకాల వివరాల కంటే సిద్ధరామయ్యతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకుల గుణగణాలను వివరించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని అందులో పేర్కొన్నారు. ఈ అక్రమాల్లో రాష్ట్ర సమాచార శాఖకు చెందిన పలువురు అధికారులకు భాగముందని వారినిపై కూడా దర్యాప్తు జరపాలని గణేష్ తన తన 257 పేజీల ఫిర్యాదులో పేర్కొన్నారు. -
కర్ణాటక సీఎంకు తప్పిన పెను ప్రమాదం
బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధారామయ్యకు శనివారం తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్లో పొగలు వెలువడ్డాయి. ఈ విషయాన్ని గమనించిన పైలెట్ చాకచక్యంగా వ్యవహరించటంతో పెను ప్రమాదం తప్పింది. సిద్ధారామయ్య బెంగళూరు నుంచి మైసూరు వెళుతుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆయనతో పాటు హెలికాప్టర్లో పౌరసరఫరాల మంత్రితో పాటు అధికారులు ఉన్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.