
ఇక ‘మహా’ సంగ్రామమే
ఒకట్రెండు రోజుల్లో కాంగ్రెస్‌తో పొత్తుపై తుది నిర్ణయం: అఖిలేశ్
• యూపీలో తదుపరి ప్రభుత్వం ఎస్పీ–కాంగ్రెస్‌లదే: గులాంనబీ ఆజాద్
• కూటమిలో చేరేందుకు ఆర్‌ఎల్డీ, ఎన్సీపీ ఆసక్తి
• కొడుకుతో రాజీకి ములాయం ఓకే...
• తాను సూచించిన 40 మందికి టికెట్లు ఇవ్వాలంటూ కొడుకుకు షరతు
⇔ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సంగ్రామం రసవత్తరంగా మారింది. బీజేపీ, బీఎస్పీల్ని ఎదుర్కొని యూపీ అధికారం చేజిక్కించుకునే లక్ష్యంతో ‘మహా లౌకిక కూటమి’ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. పొత్తుకు సై అంటూ సమాజ్‌వాదీ, కాంగ్రెస్ పార్టీలు మంగళవారం స్పష్టమైన సంకేతాలిచ్చాయి. ఒకట్రెండు రోజుల్లో కూటమి ఏర్పాటుపై నిర్ణయం దాదాపు ఖరారవుతుందని యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ స్పష్టం చేయగా... ఎస్పీ–కాంగ్రెస్ కూటమే యూపీలో తదుపరి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందంటూ కాంగ్రెస్ ప్రకటించింది.
లక్నో/న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సంగ్రామం రసవత్తరంగా మారింది. బీజేపీ, బీఎస్పీల్ని ఎదుర్కొని యూపీ అధికారం చేజిక్కించుకునే లక్ష్యంతో ‘మహా లౌకిక కూటమి’ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. పొత్తుకు సై అంటూ సమాజ్‌వాదీ, కాంగ్రెస్‌లు మంగళవారం స్పష్టమైన సంకేతాలిచ్చాయి. ఒకట్రెండు రోజుల్లో కూటమి ఏర్పాటుపై నిర్ణయం దాదాపు ఖరారవుతుందని యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ స్పష్టం చేయగా... ఎస్పీ–కాంగ్రెస్ కూటమే తదుపరి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందంటూ కాంగ్రెస్ ప్రకటించింది. మహాకూటమిలో చేరేందుకు సిద్ధమంటూ ఇప్పటికే ఆర్‌ఎల్‌డీ, ఎన్సీపీలు కూడా సంకేతాలివ్వడంతో యూపీ ఎన్నికల సంగ్రామంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. యూపీలో ఈసారి ఎస్పీ నేతృత్వంలోని మహా కూటమి, బీజేపీ, బీఎస్పీల మధ్య త్రిముఖ పోరు ఖాయమని తేలింది.
సైకిల్ గుర్తును దక్కించుకున్నాక... అఖిలేశ్ సోమవారం రాత్రి నుంచి జోరు పెంచారు. మొదటి నుంచి కాంగ్రెస్‌తో పొత్తుకు ఆసక్తి చూపుతున్న ఆయన కాంగ్రెస్‌తో పొత్తుకు పచ్చజెండా ఊపారు. ‘కాంగ్రెస్‌తో పొత్తుపై ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటాం’ అని లక్నోలో చెప్పారు. మహా లౌకిక కూటమి ఆధ్వర్యంలోనే ఎన్నికల్ని ఎదుర్కొంటామంటూ ఎస్పీ ప్రధాన కార్యదర్శి రాంగోపాల్ యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
నేడో–రేపో రాహుల్, అఖిలేశ్‌ల భేటీ
ఇదే సమయంలో ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు స్పందిస్తూ... పొత్తుకు తాము కూడా సిద్ధమేనని ప్రకటించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి గులాం నబీ ఆజాద్ విలేకరులతో మాట్లాడుతూ... ‘సమాజ్‌వాదీ–కాంగ్రెస్ కూటమి యూపీలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనే నమ్మకం ఉంది’ అని అన్నారు. కాగా ఏ క్షణమైనా అఖిలేశ్–రాహుల్‌గాంధీ సమావేశమై పొత్తును ఖరారు చేయవచ్చని భావిస్తున్నారు. ఎస్పీతో పొత్తుకు సిద్ధమంటూ ఇప్పటికే ఆర్‌ఎల్‌డీ ప్రకటించించగా... అఖిలేశ్ నేతృత్వంలోని ఎస్పీకే తమ మద్దతంటూ ఎన్సీపీ కూడా స్పష్టం చేసింది. అయితే ఆ రెండు పార్టీలు అధికారికంగా మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు కాంగ్రెస్ యూపీ సీఎం అభ్యర్థిగా భావించిన షీలాదీక్షిత్ మాట్లాడుతూ... ఒకవేళ కూటమి ఏర్పాటైతే అఖిలేశ్‌కు మద్ధతుగా తాను సీఎం అభ్యర్థిత్వం నుంచి పక్కకు తప్పుకుంటానని చెప్పారు.
మొదటి దశకు నామినేషన్లు
ఫిబ్రవరి 11న జరిగే తొలి దశ ఎన్నికల కోసం ఎన్నికల సంఘం మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. పశ్చిమ యూపీలోని 15 జిల్లాల్లో ఉన్న 73 నియోజక వర్గాల్లో తొలి దశ ఎన్నికలు జరగనున్నాయి. లక్నోలో ముఖ్య ఎన్నికల అధికారి నోటిఫికేషన్ జారీ చేయగానే ఉదయం 11 గంటలకు నియోజకవర్గాల్లో నామినేషన్ల సందడి ప్రారంభమైంది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ జనవరి 24 కాగా.. విత్‌డ్రాకు గడువు జనవరి 27.
మెత్తబడిన ములాయం
ఒకవైపు మహాకూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు సాగిస్తూనే తండ్రిని బుజ్జగించే ప్రయత్నాల్ని అఖిలేశ్ కొనసాగించారు. మంగళవారం కూడా ములాయంతో సమావేశమయ్యారు. తండ్రి ములాయంతో కలిసి ముందుకు సాగుతానని చెప్పారు. కొడుకుతో చర్చల అనంతరం ములాయం మొత్తబడినట్లు కనిపించారు. తన వర్గం ఎంపిక చేసిన 40 మందికి తప్పకుండా సీట్లు ఇవ్వాలని కొడుకుని ములాయం కోరారు. ఈ జాబితాలో పలువురు సీనియర్ మంత్రుల పేర్లు ఉండగా.. అఖిలేశ్ బాబాయ్, ములాయం సన్నిహితుడు శివ్‌పాల్ యాదవ్ పేరు లేకపోవడం గమనార్హం. ఇరు వర్గాల జాబితాలో 90 శాతం పేర్లు ఒకటేనని... త్వరలో అభ్యర్థుల జాబితా ఖరారు చేస్తామని అఖిలేశ్ చెప్పారు. పార్టీ గుర్తు (సైకిల్)పై ఈసీ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ములాయం వర్గం కోర్టుకెళితే... ముందుగా తమకు తెలియచేసేలా అఖిలేశ్ వర్గం సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేసింది.