SP-Congress
-
‘అబ్ కీ బార్...’ పాచిక పారలేదు
లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు తిరుగులేని విజయాలు. ఈసారి 370 సీట్ల లక్ష్యం. 300 నుంచి 350 స్థానాల దాకా ఖాయమంటూ ఎగ్జిట్ పోల్స్ జోస్యం. కానీ ఎగ్జాక్ట్ ఫలితాలు బీజేపీకి తేరుకోలేని షాకిచ్చాయి. ఎవరూ ఊహించని విధంగా కనీసం మెజారిటీ మార్కును కూడా అందుకోలేకపోయింది. కేవలం 240 స్థానాలకు పరిమితమై చతికిలపడింది. తరచి చూస్తే ఇందుకు పలు కారణాలు కని్పస్తున్నాయి...⇒ అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ పేలవ ప్రదర్శన ఎవరూ ఊహించనిది. అక్కడ బీజేపీ బలం 62 నుంచి ఏకంగా 33 స్థానాలకు పడిపోయింది. రాష్ట్రంలో ఓబీసీలతో పాటు ప్రధానంగా దళిత, ముస్లిం ఓట్లను ఎస్పీ–కాంగ్రెస్ కూటమి పూర్తిస్థాయిలో ఒడిసిపట్టడమే ఇందుకు కారణం. దాంతో వాటి భాగస్వామ్యం యూపీలో సూపర్‌హిట్టయింది. బీజేపీకి దేశవ్యాప్తంగా తగ్గిన 63 సీట్లలో సగానికి సగం యూపీలోనే కావడం విశేషం. ⇒ యూపీ తర్వాత కీలకమైన మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీలను బీజేపీ చీలి్చన తీరును జనం వ్యతిరేకించారు. తాజా ఫలితాల్లో చీలిక వర్గాలకే ఆదరణ లభించింది. ఆ మేరకు రాష్ట్రంలో ఎన్డీఏ స్థానాలకు భారీగా గండి పడింది. ⇒ ప్రచారం పొడవునా మోదీతో పాటు బీజేపీ నేతలు ప్రదర్శించిన మితిమీరిన దూకుడు కూడా బెడిసికొట్టింది. ⇒ నానాటికీ పెరిగిన ద్రవ్యోల్బణం, నిరుద్యోగం మధ్య తరగతి, యువతలో ఆగ్రహానికి కారణమయ్యాయి. ⇒ సైన్యంలో చేరేందుకు మోదీ సర్కారు తెచ్చిన అగ్నివీర్ పథకాన్ని యువత దేశవ్యాప్తంగా తీవ్రంగా వ్యతిరేకించడం తెలిసిందే. ఆ పథకాన్ని రద్దు చేస్తామన్న కాంగ్రెస్ హామీ యువకులను బాగా ఆకట్టుకున్నాయి. ⇒ సైనిక దళాల్లో యువత ఎక్కువగా చేరే రాజస్తాన్, హరియాణాల్లో బీజేపీకి సీట్లు తగ్గడం అగ్నివీర్ పథకంపై ఆగ్రహ ప్రతిఫలమే. ⇒ ఓవైపు ఇన్ని సమస్యలు కన్పిస్తుంటే పట్టించుకోకుండా బీజేపీ ఇచ్చిన ‘అబ్ కీ బార్, 400 పార్ (ఈసారి 400 సీట్లకు మించి)’ నినాదాన్ని ప్రజలు హర్షించలేదు. 2004 నాటి ‘ఇండియా షైనింగ్’ నినాదం అంతగా కాకున్నా ‘అబ్ కీ బార్...’ బీజేపీకి కాస్త చేటే చేసిందంటున్నారు. నిజంగానే అన్ని సీట్లు వస్తే నిరంకుశత్వానికి బాటలు పడతాయన్న భావన ప్రబలింది. అంతేగాక బీజేపీ నేతల్లో అలసత్వానికి కూడా ఈ నినాదం కారణమైంది. మోదీ మాటతీరు... ⇒ పార్టీని పూర్తిగా తోసిరాజని ఈసారి ప్రచారంలో సర్వం మోదీమయంగా మారింది. ప్రతిదానికీ ‘మోదీ హామీ’ అంటూ ప్రధాని పదేపదే చెబుతూ వచ్చారు. ఏకంగా బీజేపీ మేనిఫెస్టో పేరునే ‘మోదీ కీ గ్యారెంటీ’గా మార్చేశారు! సర్వం తననే కేంద్రం చేసుకుని నడిపించారు. ⇒ దీనికి తోడు మోదీ మాటతీరును, విపక్షాలపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు, విమర్శలను ప్రజలు ఆమోదించలేదు. విపక్షాలపై ఆయన చేసిన ముజ్రా తదితర విమర్శలు బీజేపీకి మేలు కంటే కీడే ఎక్కువ చేశాయి. ⇒ మంగళసూత్రాలు మొదలుకుని మాంసాహారం, ముస్లిం రిజర్వేషన్ల దాకా మోదీ చేసిన వ్యాఖ్యలను జనం జీరి్ణంచుకోలేదని ఫలితాలు చెబుతున్నాయి. ⇒ వీటికి తోడు ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటన దేశవ్యాప్తంగా ఆ వర్గం ఓట్లు పూర్తిగా బీజేపీకి వ్యతిరేకంగా సంఘటితమయ్యేందుకు కారణమైంది. ⇒ షా ప్రకటనను కాంగ్రెస్, విపక్షాలు అందిపుచ్చుని బీజేపీ మళ్లీ వస్తే మొత్తం రిజర్వేషన్లనే ఎత్తేస్తుందంటూ చేసిన ప్రచారం ప్రజల్లోకి బాగా వెళ్లింది. ఇది బీజేపీకి చెప్పలేనంత చేటు చేసింది. ⇒ విపక్షాలపైకి మోదీ సర్కారు దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతోందన్న ప్రచారం కూడా బీజేపీకి ప్రతికూలంగా మారింది. ఎన్నికల వేళ ఆప్ అధినేత కేజ్రీవాల్ అరెస్టు కూడా చేటే చేసింది. ⇒ ఇక కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నిరుద్యోగ భృతి, మహిళలకు ఏటా రూ.లక్ష సాయం వంటి హామీలు ఓటర్లను ఆకట్టుకోవడంలో సఫలమయ్యాయి. ⇒ మోదీ పాలనలో అంబానీ, అదానీ వంటి కొద్దిమంది కుబేరులకే భారీ లబ్ధి చేకూరుతోందంటూ కాంగ్రెస్, విపక్షాలు పదేపదే చేసిన ప్రభావం కూడా ప్రజల్లోకి వెళ్లింది. ⇒ అభ్యర్థుల ఎంపికలోనూ బీజేపీ పలు తప్పిదాలు చేయడం పలు చోట్ల ఓటమికి కారణాలుగా మారింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పొడవని పొత్తు?
• ఎస్పీ–కాంగ్రెస్‌ల మధ్య కుదరని సయోధ్య • 99 సీట్లు ఇస్తామన్న ఎస్పీ.. 120కి తగ్గేది లేదన్న కాంగ్రెస్.. అఖిలేశ్‌కు సోనియా ఫోన్ లక్నో, న్యూఢిల్లీ: యూపీలో ఆదిలోనే మహాకూటమి ఏర్పాటుకు బ్రేక్ పడగా... తాజాగా ఎస్పీ–కాంగ్రెస్‌ల మధ్య పొత్తుపై ప్రతిష్టంభన వీడలేదు. బీజేపీ, బీఎస్పీల్ని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్‌తో పొత్తుకు తహతహలాడిన అఖిలేశ్ 99 సీట్లు ఇస్తామన్నా... కాంగ్రెస్ మరిన్ని సీట్లకు పట్టుబట్టడంతో సయోధ్యపై నీలి నీడలు కమ్ముకున్నాయి. 85 సీట్లకు మించి ఇచ్చేది లేదంటూ శుక్రవారం స్పష్టం చేసిన ఎస్పీ... శనివారం దిగివచ్చి మరో 14 సీట్లకు ఓకే చెప్పింది. 150 స్థానాలు ఇవ్వాలంటూ మొదట్లో డిమాండ్ చేసిన కాంగ్రెస్... చివరకు 120 స్థానాలు ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పేసింది. సీట్ల సంఖ్యపై తగ్గేది లేదని చెపుతూ... మొదటి రెండు దశలకు అభ్యర్థుల్ని కూడా ఖరారు చేసేసింది. శుక్రవారం సమాజ్‌వాదీ పార్టీ 210 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించడంతో కాంగ్రెస్ ఉలిక్కిపడింది. ఎస్పీ జాబితాలో కాంగ్రెస్‌కు చెందిన 8 సిట్టింగ్ స్థానాలు సహా గాంధీల కంచుకోటలు అమేథీ, రాయ్‌బరేలీ పరిధిలోని స్థానాలు ఉండడంతో ఆ పార్టీలో కలవరం మొదలైంది. దీంతో ప్రియాంక గాంధీ తరఫున ప్రత్యేక ప్రతినిధిగా యూపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ గులాం నబీ ఆజాద్ రంగంలోకి దిగారు. ఎస్పీతో పొత్తు చర్చలు జరిపినా ఎలాంటి పురోగతి కనిపించలేదు. కాంగ్రెస్ డిమాండ్లకు తలొగ్గేది లేదంటూ సమాజ్‌వాదీ కూడా స్పష్టం చేసింది. పొత్తు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయంటూ ఎస్పీ ఎంపీ నరేష్ అగర్వాల్ తేల్చి చెప్పారు. ‘పొత్తు దాదాపు ముగిసినట్లే. కాంగ్రెస్‌కు యూపీ సీఎం 100 సీట్ల వరకూ ఇస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ మాత్రం 120 సీట్లు ఇస్తేనే ఒప్పుకోవాలనే ఆలోచనలో ఉంది’ అని చెప్పారు. మేం కూడా తగ్గేది లేదు.. కాంగ్రెస్: పొత్తుపై కాంగ్రెస్ పార్టీ నిర్ణయం కోసం వేచి ఉండకుండా ఎస్పీ అభ్యర్థుల్ని ప్రకటించేసిందని, ఆ పార్టీ నాయకత్వం రాజీ ధోరణితో వ్యహరించడం లేదనేది కాంగ్రెస్ ఎదురుదాడి చేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నిక కమిటీ శనివారం సమావేశమై మొదటి రెండు దశల్లో 140 సీట్లకు అభ్యర్థుల్ని ఖరారు చేసింది. తాము కూడా పట్టువీడేది లేదంటూ ఎస్పీకి పరోక్ష సంక్షేతాలు పంపింది. ఎస్పీతో పొత్తు ముగిసినట్లేనా అని ఆజాద్‌ను ప్రశ్నించగా.. ‘వేచి చూడండి. ఆదివారం ఉదయం తెలుస్తుంది’ అని పేర్కొన్నారు. ఆదివారం సమాజ్‌వాదీ మేనిఫెస్టోను అఖిలేశ్ యాదవ్ విడుదల చేయనున్నారు. ఎస్పీ–కాంగ్రెస్‌లు కలిసి ఉమ్మడిగా మేనిఫెస్టో విడుదల చేస్తారని భావించినా... కూటమిపై సందిగ్ధతతో ఎస్పీ మాత్రం తన పని తాను చేసుకుపోతోంది. సీట్ల పంపకంపై సందిగ్ధత నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ రంగంలోకి దిగారు. యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్‌తో ఫోన్లో ఆమె మాట్లాడారు. ప్రచారకుల జాబితాలో అడ్వాణీకి దక్కని చోటు యూపీ తొలి, రెండో విడత ఎన్నికల్లో పార్టీ ముఖ్య ప్రచారకుల జాబితాను బీజేపీ శనివారం విడుదల చేసింది. జాబితాలో బీజేపీ సీనియర్ నేత అడ్వాణీ, ఎంపీ వరుణ్ గాంధీ, యూపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు వినయ్ కటియార్ పేర్లు లేకపోవడం గమనార్హం. ప్రధానిమోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్, రాజ్‌నాథ్, ఉమా భారతి, సంజీవ్ బల్యన్, కల్రాజ్ మిశ్రా, మేనకా గాంధీలు పార్టీ తరఫున ప్రచారం చేయనున్నారు. -
పోరు నష్టం.. పొత్తు లాభం!
-
పోరు నష్టం.. పొత్తు లాభం!
కాంగ్రెస్‌తో పొత్తుపై అఖిలేశ్ వ్యూహం పొత్తుల విషయంలో అఖిలేశ్ పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నారు. బీజేపీకి అసలైన ప్రత్యామ్నాయంగా ఎస్పీ–కాంగ్రెస్–ఆర్ఎల్డీల మహాకూటమిని నిలపాలనేది ఆయన ఆలోచన. తద్వారా ముస్లిం ఓట్లలో చీలికను అడ్డుకోవచ్చని భావిస్తున్నారు. యూపీ జనాభాలో 9 శాతంగా ఉన్న యాదవులు, 19 శాతంగా ఉన్న ముస్లింలు ఎస్పీకి సంప్రదాయ ఓటు బ్యాంకు. 2012లో 11.65 శాతం ఓట్లు (28 సీట్లు) సాధించిన కాంగ్రెస్, 2014 లోక్‌సభ ఎన్నికల్లో 7.5 శాతం ఓట్లు పొందింది. కాంగ్రెస్‌కు ప్రతి నియోజకవర్గంలో పడుతున్న దాదాపు 5 వేల ఓట్లు ఎస్పీకి బదిలీ అయితే విజయావకాశాలు మెండుగా ఉంటాయని అఖిలేశ్ శిబిరం అంచనా. ముస్లిం ఓట్ల కోసం: కాంగ్రెస్‌కు 2012లో 18%, 2014లో 11% ముస్లిం ఓట్లు పడ్డాయి. ఎస్పీకి 2012లో 39%, 2014లో బీజేపీపై వ్యతిరేకతతో 58% ముస్లిం ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పొత్తుతో ముస్లిం ఓట్లూ దక్కుతాయని అఖిలేశ్ లెక్క. బీజేపీకి బలమైన ప్రత్యర్థిగా కనపడితే ముస్లింలు బీఎస్పీ వైపు వెళ్లరని అంచనా. జాట్ల కోసం గాలం: రాష్ట్ర జనాభాలో జాట్లు 1.7%. జాట్ల పార్టీగా పరిగణించే ఆర్‌ఎల్‌డీనీ కూటమిలోకి తేవాలనేది అఖిలేశ్ వ్యూహం. 2012లో కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకున్న ఆర్ఎల్డీ 46 స్థానాల్లో పోటీచేసి 9 చోట్ల గెలిచింది. 2.3 శాతం ఓట్లు సాధించింది. పశ్చిమ యూపీలో 50 స్థానాల్లో ప్రభావం చూపగల జాట్ల ఓట్ల కోసం కూటమి తరఫున ఆర్ఎల్డీ అధినేత అజిత్‌సింగ్ కుమారుడు జయంత్‌ను డిప్యూటీ సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలూ ఉన్నాయని పరిశీలకుల అంచనా. తమను ఓబీసీల్లో చేర్చకపోవడం వంటి కారణాలతో జాట్లు బీజేపీపై గుర్రుగా ఉన్నారు. చిన్నపార్టీలు ఓట్లు చీల్చకుండా త్రిముఖ పోరు ఉండేలా(ఎస్పీ–కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ) అఖిలేశ్ యత్నిస్తున్నారు. కాంగ్రెస్‌కు 75–80 సీట్లు, ఆర్ఎల్డీ, ఇతర చిన్నాచితకా పార్టీలకు కలిపి 25 సీట్ల వరకు వదులుకోవడానికి ఎస్పీ సిద్ధంగా ఉంది. మరోపక్క.. ఎస్పీ కలహాలతో విసిగిన ముస్లింలు తమవైపు మొగ్గుతారనే ఆశతో ఉన్న బీఎస్పీ అధినేత్రి మాయావతికి ఎస్పీ–కాంగ్రెస్ పొత్తు ఆశనిపాతమే. ముస్లిం ఓట్లపై భారీ అంచనాలతో ఆమె ఏకంగా 97 మంది ముస్లింలకు టికెట్లిచ్చారు. ముస్లిం ఓట్లు ఎస్పీ– బీఎస్పీ మధ్య ఎంతగా చీలిపోతే అంత లాభమనేది బీజేపీ లెక్క. బీజేపీని మహాకూటమి నిలువరించగలదంటూ ముస్లింలు దానివైపు మొగ్గితే బీజేపీ లెక్కలూ తప్పుతాయి. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఇక ‘మహా’ సంగ్రామమే
ఒకట్రెండు రోజుల్లో కాంగ్రెస్‌తో పొత్తుపై తుది నిర్ణయం: అఖిలేశ్ • యూపీలో తదుపరి ప్రభుత్వం ఎస్పీ–కాంగ్రెస్‌లదే: గులాంనబీ ఆజాద్ • కూటమిలో చేరేందుకు ఆర్ఎల్డీ, ఎన్సీపీ ఆసక్తి • కొడుకుతో రాజీకి ములాయం ఓకే... • తాను సూచించిన 40 మందికి టికెట్లు ఇవ్వాలంటూ కొడుకుకు షరతు ⇔ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సంగ్రామం రసవత్తరంగా మారింది. బీజేపీ, బీఎస్పీల్ని ఎదుర్కొని యూపీ అధికారం చేజిక్కించుకునే లక్ష్యంతో ‘మహా లౌకిక కూటమి’ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. పొత్తుకు సై అంటూ సమాజ్‌వాదీ, కాంగ్రెస్ పార్టీలు మంగళవారం స్పష్టమైన సంకేతాలిచ్చాయి. ఒకట్రెండు రోజుల్లో కూటమి ఏర్పాటుపై నిర్ణయం దాదాపు ఖరారవుతుందని యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ స్పష్టం చేయగా... ఎస్పీ–కాంగ్రెస్ కూటమే యూపీలో తదుపరి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందంటూ కాంగ్రెస్ ప్రకటించింది. లక్నో/న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సంగ్రామం రసవత్తరంగా మారింది. బీజేపీ, బీఎస్పీల్ని ఎదుర్కొని యూపీ అధికారం చేజిక్కించుకునే లక్ష్యంతో ‘మహా లౌకిక కూటమి’ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. పొత్తుకు సై అంటూ సమాజ్‌వాదీ, కాంగ్రెస్‌లు మంగళవారం స్పష్టమైన సంకేతాలిచ్చాయి. ఒకట్రెండు రోజుల్లో కూటమి ఏర్పాటుపై నిర్ణయం దాదాపు ఖరారవుతుందని యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ స్పష్టం చేయగా... ఎస్పీ–కాంగ్రెస్ కూటమే తదుపరి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందంటూ కాంగ్రెస్ ప్రకటించింది. మహాకూటమిలో చేరేందుకు సిద్ధమంటూ ఇప్పటికే ఆర్ఎల్డీ, ఎన్సీపీలు కూడా సంకేతాలివ్వడంతో యూపీ ఎన్నికల సంగ్రామంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. యూపీలో ఈసారి ఎస్పీ నేతృత్వంలోని మహా కూటమి, బీజేపీ, బీఎస్పీల మధ్య త్రిముఖ పోరు ఖాయమని తేలింది. సైకిల్ గుర్తును దక్కించుకున్నాక... అఖిలేశ్ సోమవారం రాత్రి నుంచి జోరు పెంచారు. మొదటి నుంచి కాంగ్రెస్‌తో పొత్తుకు ఆసక్తి చూపుతున్న ఆయన కాంగ్రెస్‌తో పొత్తుకు పచ్చజెండా ఊపారు. ‘కాంగ్రెస్‌తో పొత్తుపై ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటాం’ అని లక్నోలో చెప్పారు. మహా లౌకిక కూటమి ఆధ్వర్యంలోనే ఎన్నికల్ని ఎదుర్కొంటామంటూ ఎస్పీ ప్రధాన కార్యదర్శి రాంగోపాల్ యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. నేడో–రేపో రాహుల్, అఖిలేశ్‌ల భేటీ ఇదే సమయంలో ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు స్పందిస్తూ... పొత్తుకు తాము కూడా సిద్ధమేనని ప్రకటించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి గులాం నబీ ఆజాద్ విలేకరులతో మాట్లాడుతూ... ‘సమాజ్‌వాదీ–కాంగ్రెస్ కూటమి యూపీలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనే నమ్మకం ఉంది’ అని అన్నారు. కాగా ఏ క్షణమైనా అఖిలేశ్–రాహుల్‌గాంధీ సమావేశమై పొత్తును ఖరారు చేయవచ్చని భావిస్తున్నారు. ఎస్పీతో పొత్తుకు సిద్ధమంటూ ఇప్పటికే ఆర్ఎల్డీ ప్రకటించించగా... అఖిలేశ్ నేతృత్వంలోని ఎస్పీకే తమ మద్దతంటూ ఎన్సీపీ కూడా స్పష్టం చేసింది. అయితే ఆ రెండు పార్టీలు అధికారికంగా మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు కాంగ్రెస్ యూపీ సీఎం అభ్యర్థిగా భావించిన షీలాదీక్షిత్ మాట్లాడుతూ... ఒకవేళ కూటమి ఏర్పాటైతే అఖిలేశ్‌కు మద్ధతుగా తాను సీఎం అభ్యర్థిత్వం నుంచి పక్కకు తప్పుకుంటానని చెప్పారు. మొదటి దశకు నామినేషన్లు ఫిబ్రవరి 11న జరిగే తొలి దశ ఎన్నికల కోసం ఎన్నికల సంఘం మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. పశ్చిమ యూపీలోని 15 జిల్లాల్లో ఉన్న 73 నియోజక వర్గాల్లో తొలి దశ ఎన్నికలు జరగనున్నాయి. లక్నోలో ముఖ్య ఎన్నికల అధికారి నోటిఫికేషన్ జారీ చేయగానే ఉదయం 11 గంటలకు నియోజకవర్గాల్లో నామినేషన్ల సందడి ప్రారంభమైంది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ జనవరి 24 కాగా.. విత్‌డ్రాకు గడువు జనవరి 27. మెత్తబడిన ములాయం ఒకవైపు మహాకూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు సాగిస్తూనే తండ్రిని బుజ్జగించే ప్రయత్నాల్ని అఖిలేశ్ కొనసాగించారు. మంగళవారం కూడా ములాయంతో సమావేశమయ్యారు. తండ్రి ములాయంతో కలిసి ముందుకు సాగుతానని చెప్పారు. కొడుకుతో చర్చల అనంతరం ములాయం మొత్తబడినట్లు కనిపించారు. తన వర్గం ఎంపిక చేసిన 40 మందికి తప్పకుండా సీట్లు ఇవ్వాలని కొడుకుని ములాయం కోరారు. ఈ జాబితాలో పలువురు సీనియర్ మంత్రుల పేర్లు ఉండగా.. అఖిలేశ్ బాబాయ్, ములాయం సన్నిహితుడు శివ్‌పాల్ యాదవ్ పేరు లేకపోవడం గమనార్హం. ఇరు వర్గాల జాబితాలో 90 శాతం పేర్లు ఒకటేనని... త్వరలో అభ్యర్థుల జాబితా ఖరారు చేస్తామని అఖిలేశ్ చెప్పారు. పార్టీ గుర్తు (సైకిల్)పై ఈసీ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ములాయం వర్గం కోర్టుకెళితే... ముందుగా తమకు తెలియచేసేలా అఖిలేశ్ వర్గం సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేసింది.