పొత్తుల విషయంలో అఖిలేశ్ పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నారు. బీజేపీకి అసలైన ప్రత్యామ్నాయంగా ఎస్పీ–కాంగ్రెస్–ఆర్‌ఎల్‌డీల మహాకూటమిని నిలపాలనేది ఆయన ఆలోచన. తద్వారా ముస్లిం ఓట్లలో చీలికను అడ్డుకోవచ్చని భావిస్తున్నారు. యూపీ జనాభాలో 9 శాతంగా ఉన్న యాదవులు, 19 శాతంగా ఉన్న ముస్లింలు ఎస్పీకి సంప్రదాయ ఓటు బ్యాంకు. 2012లో 11.65 శాతం ఓట్లు (28 సీట్లు) సాధించిన కాంగ్రెస్, 2014 లోక్‌సభ ఎన్నికల్లో 7.5 శాతం ఓట్లు పొందింది. కాంగ్రెస్‌కు ప్రతి నియోజకవర్గంలో పడుతున్న దాదాపు 5 వేల ఓట్లు ఎస్పీకి బదిలీ అయితే విజయావకాశాలు మెండుగా ఉంటాయని అఖిలేశ్ శిబిరం అంచనా.