బీజేపీని దెబ్బ తీసిన నిరుద్యోగం, ద్రవ్యోల్బణం
అగ్నివీర్ పథకంపై యువత ఆగ్రహం
చేటు చేసిన మోదీ వ్యాఖ్యలు, విమర్శలు
విపక్షాల ‘రిజర్వేషన్ల’ ప్రచారంతో తీవ్ర నష్టం
ఓటర్లను ఆకట్టుకోని ‘అబ్ కీ బార్...’ నినాదం
లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు తిరుగులేని విజయాలు. ఈసారి 370 సీట్ల లక్ష్యం. 300 నుంచి 350 స్థానాల దాకా ఖాయమంటూ ఎగ్జిట్ పోల్స్ జోస్యం. కానీ ఎగ్జాక్ట్ ఫలితాలు బీజేపీకి తేరుకోలేని షాకిచ్చాయి. ఎవరూ ఊహించని విధంగా కనీసం మెజారిటీ మార్కును కూడా అందుకోలేకపోయింది. కేవలం 240 స్థానాలకు పరిమితమై చతికిలపడింది. తరచి చూస్తే ఇందుకు పలు కారణాలు కని్పస్తున్నాయి...
⇒ అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ పేలవ ప్రదర్శన ఎవరూ ఊహించనిది. అక్కడ బీజేపీ బలం 62 నుంచి ఏకంగా 33 స్థానాలకు పడిపోయింది. రాష్ట్రంలో ఓబీసీలతో పాటు ప్రధానంగా దళిత, ముస్లిం ఓట్లను ఎస్పీ–కాంగ్రెస్ కూటమి పూర్తిస్థాయిలో ఒడిసిపట్టడమే ఇందుకు కారణం. దాంతో వాటి భాగస్వామ్యం యూపీలో సూపర్‌హిట్టయింది. బీజేపీకి దేశవ్యాప్తంగా తగ్గిన 63 సీట్లలో సగానికి సగం యూపీలోనే కావడం విశేషం.
⇒ యూపీ తర్వాత కీలకమైన మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీలను బీజేపీ చీలి్చన తీరును జనం వ్యతిరేకించారు. తాజా ఫలితాల్లో చీలిక వర్గాలకే ఆదరణ లభించింది. ఆ మేరకు రాష్ట్రంలో ఎన్డీఏ స్థానాలకు భారీగా గండి పడింది.
⇒ ప్రచారం పొడవునా మోదీతో పాటు బీజేపీ నేతలు ప్రదర్శించిన మితిమీరిన దూకుడు కూడా బెడిసికొట్టింది.
⇒ నానాటికీ పెరిగిన ద్రవ్యోల్బణం, నిరుద్యోగం మధ్య తరగతి, యువతలో ఆగ్రహానికి కారణమయ్యాయి.
⇒ సైన్యంలో చేరేందుకు మోదీ సర్కారు తెచ్చిన అగ్నివీర్ పథకాన్ని యువత దేశవ్యాప్తంగా తీవ్రంగా వ్యతిరేకించడం తెలిసిందే. ఆ పథకాన్ని రద్దు చేస్తామన్న కాంగ్రెస్ హామీ యువకులను బాగా ఆకట్టుకున్నాయి.
⇒ సైనిక దళాల్లో యువత ఎక్కువగా చేరే రాజస్తాన్, హరియాణాల్లో బీజేపీకి సీట్లు తగ్గడం అగ్నివీర్ పథకంపై ఆగ్రహ ప్రతిఫలమే.
⇒ ఓవైపు ఇన్ని సమస్యలు కన్పిస్తుంటే పట్టించుకోకుండా బీజేపీ ఇచ్చిన ‘అబ్ కీ బార్, 400 పార్ (ఈసారి 400 సీట్లకు మించి)’ నినాదాన్ని ప్రజలు హర్షించలేదు. 2004 నాటి ‘ఇండియా షైనింగ్’ నినాదం అంతగా కాకున్నా ‘అబ్ కీ బార్...’ బీజేపీకి కాస్త చేటే చేసిందంటున్నారు. నిజంగానే అన్ని సీట్లు వస్తే నిరంకుశత్వానికి బాటలు పడతాయన్న భావన ప్రబలింది. అంతేగాక బీజేపీ నేతల్లో అలసత్వానికి కూడా ఈ నినాదం కారణమైంది.
మోదీ మాటతీరు...
⇒ పార్టీని పూర్తిగా తోసిరాజని ఈసారి ప్రచారంలో సర్వం మోదీమయంగా మారింది. ప్రతిదానికీ ‘మోదీ హామీ’ అంటూ ప్రధాని పదేపదే చెబుతూ వచ్చారు. ఏకంగా బీజేపీ మేనిఫెస్టో పేరునే ‘మోదీ కీ గ్యారెంటీ’గా మార్చేశారు! సర్వం తననే కేంద్రం చేసుకుని నడిపించారు.
⇒ దీనికి తోడు మోదీ మాటతీరును, విపక్షాలపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు, విమర్శలను ప్రజలు ఆమోదించలేదు. విపక్షాలపై ఆయన చేసిన ముజ్రా తదితర విమర్శలు బీజేపీకి మేలు కంటే కీడే ఎక్కువ చేశాయి.
⇒ మంగళసూత్రాలు మొదలుకుని మాంసాహారం, ముస్లిం రిజర్వేషన్ల దాకా మోదీ చేసిన వ్యాఖ్యలను జనం జీరి్ణంచుకోలేదని ఫలితాలు చెబుతున్నాయి.
⇒ వీటికి తోడు ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటన దేశవ్యాప్తంగా ఆ వర్గం ఓట్లు పూర్తిగా బీజేపీకి వ్యతిరేకంగా సంఘటితమయ్యేందుకు కారణమైంది.
⇒ షా ప్రకటనను కాంగ్రెస్, విపక్షాలు అందిపుచ్చుని బీజేపీ మళ్లీ వస్తే మొత్తం రిజర్వేషన్లనే ఎత్తేస్తుందంటూ చేసిన ప్రచారం ప్రజల్లోకి బాగా వెళ్లింది. ఇది బీజేపీకి చెప్పలేనంత చేటు చేసింది.
⇒ విపక్షాలపైకి మోదీ సర్కారు దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతోందన్న ప్రచారం కూడా బీజేపీకి ప్రతికూలంగా మారింది. ఎన్నికల వేళ ఆప్ అధినేత కేజ్రీవాల్ అరెస్టు కూడా చేటే చేసింది.
⇒ ఇక కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నిరుద్యోగ భృతి, మహిళలకు ఏటా రూ.లక్ష సాయం వంటి హామీలు ఓటర్లను ఆకట్టుకోవడంలో సఫలమయ్యాయి.
⇒ మోదీ పాలనలో అంబానీ, అదానీ వంటి కొద్దిమంది కుబేరులకే భారీ లబ్ధి చేకూరుతోందంటూ కాంగ్రెస్, విపక్షాలు పదేపదే చేసిన ప్రభావం కూడా ప్రజల్లోకి వెళ్లింది.
⇒ అభ్యర్థుల ఎంపికలోనూ బీజేపీ పలు తప్పిదాలు చేయడం పలు చోట్ల ఓటమికి కారణాలుగా మారింది. – సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment