పులికోసం పూజలు!
నాగ్ పూర్ః తప్పిపోయిన మనుషులు, పెంపుడు జంతువులకోసం పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు ఇవ్వడం చూస్తాం. ఆచూకీకోసం గాలింపు చర్యలు చేపట్టడం వింటాం. అయితే అభయారణ్యాల్లో నివసించే జంతుజాలం కనిపిస్తే వేటాడటమే తప్పించి... కబురు చెప్పమంటూ ప్రకటనలు ఇవ్వడం, నగదు బహుమతులు ప్రకటించడం ఎక్కడైనా చూశారా? నాగ్‌పూర్‌లోని ఉమ్‌రెడ్-కర్హండ్లా అభయారణ్యం ప్రాంతంలో అదే జరిగింది. తప్పిపోయిన ప్రముఖ పులి జాయ్ ఆచూకీ తెలిపిన వారికి నగదు బహుమతిని అందజేస్తామని ప్రకటించడమే కాదు.. అది ఎలాగైనా తిరిగి రావాలంటూ ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్నారు.
ఉమ్ రెడ్-కర్హండ్లా అభయారణ్యం నుంచి తప్పిపోయిన ప్రముఖ పులి 'జాయ్' కోసం నాగపూర్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏప్రిల్ 18 నుంచీ కనిపించకుడా పోయిన జాయ్ ( పులి) ఆచూకీ తెలిపిన వారికి 50 వేల రూపాయల నగదు బహుమతిని ఇస్తామంటూ కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఇంతకు ముందే ప్రకటించగా.. జాయ్ తిరిగి రావాలని కోరుకుంటూ కొందరు అభిమానులు ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తున్నారు.
ఈ ఏడాది ఏప్రిల్ 18న జాయ్ తప్పిపోయిన నాటినుంచీ దాని సమాచారంకోసం అనేక విధాలుగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. పులి ఆచూకీ, అడుగుజాడలు, అది సంచరిస్తున్న ప్రదేశం వంటి వివరాలు ఏవి తెలిసినా వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని, వివరాలు తెలిపిన వారికి 50 వేల రూపాయల నగదు బహుమతిని కూడా అందిస్తామని కన్జర్వేషన్ లెన్సెస్ అండ్ వైల్డ్ లైఫ్ (సీఎల్ఏడబ్ల్యూ) స్వచ్ఛంద సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. ఒకప్పుడు నాగ్ జీరా టైగర్ రిజర్వ్ నుంచి ఉమ్రెడ్ కర్హండ్లా అభయారణ్యానికి వలస వచ్చిన జాయ్.. అప్పట్నుంచీ స్థానికులు, పర్యటకుల అభిమానాన్ని చూరగొంది.
భారీ శరీరాకృతి, రాచరికాన్ని ప్రదర్శించే తీరులో జీవన విధానం కలిగి ఉండే జాయ్... చూపరులను కళ్ళు తిప్పుకోకుండా చేసేది. అభయారణ్యానికి వచ్చిన దగ్గరనుంచీ విదేశీయులతో సహా అనేక మంది పర్యటకులను ఆకట్టుకుంది. పులి జాతిలోనే విభిన్నంగా కనిపించే జాయ్... సుమారు 250 కేజీల దాకా బరువుంటుంది. అటువంటి ప్రముఖ పులి ఆ ప్రాంతంలో కనిపించకుండా పోవడంతో దాని ఆచూకీకోసం అనేక రకాలుగా అన్వేషణ కొనసాగిస్తున్నారు. అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వికాస్ ఖర్గే ఆదేశాల మేరకు.. అధికారులు జాయ్ కోసం ప్రత్యేక సెర్స్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. జాయ్ పాదముద్రలు ట్రేస్ చేసేందుకు ప్రత్యేక పెట్రోలింగ్ నిర్వహించి, ఎప్పటికప్పుడు నివేదికలు పంపాలని అటవీ సిబ్బందికి అధికారులు సూచించారు. ఇప్పటికే 100 మందివరకూ వ్యక్తులు, వన్యప్రాణుల ఫోటోగ్రాఫర్లు స్వచ్ఛందంగా జాయ్ కోసం శోధిస్తుండగా... వన్యప్రాణుల పర్యవేక్షకులు, ఎన్జీవోలు కూడా జాయ్ ను వెతికేందుకు సహకరించాలని అధికారులు కోరుతున్నారు.