తిండి కలిగితే కండ కలదోయ్ అని మహాకవి గురుజాడ అప్పారావు చాలా తేలికగా చెప్పేశారు గానీ.. ఈ కాలంలో తిండి ఒక్కదానితోనే కండలు వచ్చేయవు. ఆ కండలతో కలిసి ఆరోగ్యమూ సమకూరాలంటే.. ఏం తింటున్నాం? ఎలా తింటున్నాం? ఎప్పుడు.. ఎక్కడ తింటున్నామన్నదీ ముఖ్యం. అవగాహన లోపం కొంత.. కాలుష్యం మరికొంత కలిసి.. ఆహారం కారణంగా కొన్ని అనారోగ్య సమస్యలను తెలియకుండానే చవిచూస్తున్నాం. నేడు ప్రపంచ ఆహార భద్రత దినోత్సవం సందర్భంగా కొన్ని సంగతులు..
ఆహార భద్రత... అందరి వ్యవహారం
ఆహార భద్రత దినోత్సవాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2019లో మొదలుపెట్టింది. తినే తిండి వల్ల కలిగే నష్టాలపై, రాగల ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన పెంచడం, తద్వారా మానవ ఆరోగ్యానికి, ఆహార భద్రతకు, ఆర్థిక అభివృద్ధి, వ్యవసాయానికి, పర్యాటకానికి సాయపడటం లక్ష్యం. గతేడాది అడిస్ అబాబా, జెనీవాలో జరిగిన అంతర్జాతీయ సదస్సుల్లో ‘ఆహార భద్రత–భవిష్యత్తు’ అనే అంశంపై చర్చలు జరిగాయి. మేలైన ఆహారం తగినంత అందరికీ లభించడం వెనుక సామాజిక ఆర్థిక కారణాలు ఉండవచ్చుగానీ, దీని ప్రభావం మాత్రం అందరిపై ఉంటుందని డబ్ల్యూహెచ్‌ఓ స్పష్టం చేస్తోంది. అందుకే ఈ ఏడాది ‘ఆహార భద్రత.. అందరి వ్యవహారం’ అనే ఇతివృత్తంతో కార్యక్రమాలను రూపొందించింది. మనం తినే ఆహారం సురక్షితంగా ఉండేందుకు, మన ఆరోగ్యాన్ని పాడుచేయకుండా ఉండేందుకు పొలంలోని రైతు మొదలుకొని, విధానాలు రూపొందించే ప్రభుత్వాధినేతల వరకూ ప్రతి ఒక్కరు తమదైన పాత్ర పోషించాలని డబ్ల్యూహెచ్‌ఓ చెబుతోంది. ఫలితంగా కలుషిత ఆహారం తినడం వల్ల వచ్చే వ్యాధుల భారం తగ్గి సమాజం అభివృద్ధి చెందుతుందని అంచనా.
వీటితో ఆరోగ్యానికి చేటు
ఆహారం కలుషితమయ్యేందుకు, తద్వారా అనారోగ్యం కలిగేందుకు బ్యాక్టీరియా, వైరస్, పరాన్న జీవులు కారణం. అధిక మోతాదులో వాడే రసాయనిక ఎరువులు, నిల్వ చేసేందుకు, రుచి కల్పించేందుకు ఉపయోగించే రసాయనాలు కూడా చేటు చేసేవే. సాల్మనెల్లా, కాంపీలోబ్యాక్టర్, ఈ –కోలీ వంటి బ్యాక్టీరియా ఏటా కొన్ని కోట్ల మందిని అస్వస్థులుగా చేస్తోంది. ఈ బ్యాక్టీరియా కారణంగా తలనొప్పి, వాంతులు, తల తిరగడం, కడుపునొప్పి వంటి సమస్యలు వస్తాయి. గుడ్లు, కోళ్లు, జంతు సంబంధిత ఆహారం ద్వారా సాల్మనెల్లా బ్యాక్టీరియా వ్యాపిస్తుంది. కాంపీలోబ్యాక్టర్, ఈ–కోలి పచ్చిపాలు, సక్రమంగా వండని కోళ్ల ఉత్పత్తులు, నీటి ద్వారా వ్యాపిస్తాయి. పూర్తిగా ఉడికించని సముద్రపు ఉత్పత్తుల ఆహారం ద్వారా హెపటైటిస్– ఏ వైరస్ వేగంగా వ్యాపించడమే కాకుండా.. కాలేయ వ్యాధికి కారణమవుతుంది. కొన్ని రకాల పరాన్నజీవులు చేపల ద్వారా, మరికొన్ని ఇతర ఆహార పదార్థాల ద్వారా వ్యాపిస్తాయి. ఆహార పదార్థాలను ఎక్కువ కాలం నిల్వ చేయడం వల్ల లేదా తేమ ఎక్కువ ఉన్న చోటనిల్వ చేయడం వల్ల వచ్చే బూజు (ఆఫ్లాటాక్సిన్)తోపాటు అనేక ఇతర సహజసిద్ధమైన రసాయనాలు కూడా మన ఆహారాన్ని కలుషితం చేస్తాయి. ఈ విషపదార్థాలు దీర్ఘకాలం శరీరంలోకి పోతే రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది. శరీరంలో పోగుపడే వాతావరణంలోని కాలుష్యాలు పాలీక్లోరినేటెడ్ బైఫినైల్స్, డయాక్సిన్స్‌లు జంతువుల ద్వారా మన శరీరాల్లోకి చేరుతున్నట్లు తెలుస్తోంది. ఇవి పునరుత్పత్తి వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. సీసం, కాడ్మియం, పాదరసం వంటి విషతుల్యమైన రసాయనాలు కూడా ఆహారం ద్వారా శరీరంలోకి ప్రవేశించి మూత్రపిండాలు దెబ్బతినేందుకు కారణమవుతున్నాయి.
ఇలా చేస్తే ఆరోగ్యానికి మేలు
మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా? మీ ఆహారం మీకు సమస్యలు సృష్టించకుండా ఉండేందుకు దీన్ని తగిన రీతిలో వాడుకోవడం చాలా అవసరమని చెబుతోంది జాతీయ పోషకాహార సంస్థ. ఇంకా ఏం సూచిస్తోందంటే..
- వండిన, వండని ఆహార పదార్థాలను రిఫ్రిజిరేటర్‌లో వేర్వేరుగా ఉంచాలి.
- ఆకుకూరలను నిల్వచేసే ముం దే.. వాటి వేళ్లను తొలగించి శుభ్రంగా కడిగి ఉంచడం మేలు.
- కోడిగుడ్లను మూత ఉన్న కాగితపు అట్ట డబ్బాలో ఉంచి నిల్వ చేయాలి.
- వండిన ఆహార పదార్థాలను నాలుగు రోజుల కంటే ఎక్కువ ఉంచరాదు.
- మూతతో కూడిన చిన్నచిన్న పాత్రల్లోనే వండిన ఆహారాన్ని ఉంచాలి.
- వండిన ఆహార పదార్థాలను కూడా గది ఉష్ణోగ్రతలో ఆరు గంటల కంటే ఎక్కువ సమయం ఉంచకూడదు.
- ఫ్రిడ్జ్‌లో నిల్వచేసిన పదార్థాలను తినే ముందు వేడి చేసుకోవడం అవసరం.
- ఆహారం వండే క్రమంలో ఇతర కాలుష్యాలేవీ అందులోకి చేరకుండా చూడాలి.
- అన్నింటికంటే ముఖ్యం.. ఆహా రం వండే ముం దు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. నిల్వ ఉన్న నీటితో కాకుండా.. నల్లా కింద చేతులు పెట్టి సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి.
- కాయగూరలు, పండ్లను తినేముందు కూడా శుభ్రంగా నీటితో కడుక్కోవాలి.
- ఆహారం వండేటప్పుడు వీలైనంత మేరకు శుభ్రమైన నీటినే వాడాలి. æ సురక్షితమైన మంచినీటి వ్యవస్థ లేనప్పుడు ఆ నీటిని మరిగించి వాడొచ్చు.
- వంటపాత్రలోకి నీరు పోసేందుకు విడిగా గ్లాసుల్లాంటివి వాడటం మేలు.
- ఇల్లు, వంటగది శుభ్రంగా ఉంచుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment