సమయం తక్కువ.. సౌకర్యాలు ఎక్కువ! | Specialities of Vande Bharat Express | Sakshi
Sakshi News home page

వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రత్యేకతలు ఇవే..

Published Thu, Oct 3 2019 4:10 PM | Last Updated on Thu, Oct 3 2019 4:16 PM

Specialities of Vande Bharat Express - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : వైష్ణోదేవి భక్తుల కోసం కేంద్ర ప్రభుత్వం సెమీ-హైస్పీడ్ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును గురువారం ప్రారంభించింది. ఢిల్లీ–కత్రా (జమ్మూకశ్మీర్‌) మధ్య ఎనిమిది గంటల పాటు ప్రయాణించనున్న ఈ రైలు గంటకు గరిష్టంగా 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనుంది. తక్కువ సమయంతో ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చనున్న ఈ రైలులో వైఫై సదుపాయం, జీపీఎస్‌ వ్యవస్థతో అనుసంధానం ఇలా అనేక అధునాతనమైన సకల సదుపాయాలు ఉన్నాయి. (చదవండి: జమ్మూ కశ్మీర్‌కు భారీ బహుమతి: అమిత్‌ షా)

ప్రత్యేకతలు ఇవే...
వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో 16 ఏసీ చైర్‌ కార్‌ బోగీలు ఉన్నాయి.  ఇందులో రెండు  డ్రైవర్‌ కార్స్‌, రెండు ఎగ్జిక్యూటివ్‌ చైర్‌ కార్‌ బోగీలు ఉన్నాయి.

ప్రతి కోచ్‌లోనూ ఆటోమేటిక్‌ లైటింగ్‌ డోర్‌ సిస్టమ్‌తో దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా బయో మరుగుదొడ్లు ఉన్నాయి.

ఒక బోగీ నుంచి మరొక బోగీలోకి సులభంగా వెళ్లే విధంగా కోచ్‌లను రూపొందించారు.

వాక్యూమ్‌ టాయిలెట్లు, హ్యాండ్‌ ఫ్రీ ట్యాప్స్‌, డ్రయర్లు, డిప్యూజ్డ్‌ లైటింగ్‌తో పాటు ప్రతి సీటుకు మొబైల్‌ చార్జింగ్‌ పాయింట్లు పెట్టారు.

ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌లో సీట్లను 360 డిగ్రీల కోణంలో తిరిగేందుకు అనువుగా అమర్చారు.

ప్రయాణికులకు తాము దిగబోయే స్టేషన్ల గురించి తెలిపేందుకు ప్రతి బోగీలో ఎల్‌ఈడీ స్క్రీన్స్‌ పెట్టారు. రైలు వేగం, ఇతర వివరాలు కూడా ఇందులో ఉంటాయి. సీసీ కెమెరాలు, అనౌన్స్‌మెంట్‌ సిస్టం కూడా ఉంది.

అన్ని కోచ్‌ల తలుపులు గార్డ్‌ పర్యవేక్షణలో ఆటోమెటిక్‌గా తెరుచుకుని, మూసుకుంటాయి. దుమ్ము, ధూళి చొరబడని విధంగా వీటిని ఏర్పాటు చేశారు.

వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో చెయిన్‌ లాగే వ్యవస్థ లేదు. ప్రయాణికులకు ఏదైనా సమస్య తలెత్తితే బటన్‌ నొక్కి గార్డ్‌కు సమాచారం అందించాలి.

రాళ్ల దాడిని తట్టుకునే అద్దాలతో పొడవైన కిటికీలు ప్రతి కోచ్‌కు ఇరువైపుల ఏర్పాటు చేశారు. వీటి ద్వారా బయటి దృశ్యాలను స్పష్టంగా చూడొచ్చు

ఎక్కువ సామాను పెట్టు​కునేందుకు వీలుగా లాగేజీ ర్యాకుల ఏర్పాటు చేశారు.

జంతువులు రైలు కింద పడినప్పుడు పట్టాలు తప్ప​కుండా, ఎటువంటి నష్టం జరగకుండా ‘క్యాటిల్‌ గార్డ్‌’  ఉంచారు.

రైలును శుభ్రం చేసేందుకు రసాయనాలకు బదులుగా నీళ్ల ఆధారిత సేంద్రియ ద్రావకాలు వాడతారు. అందుకే దీన్ని దేశంలోని మొదటి ‘గ్రీన్‌ ట్రైన్‌’గా పేర్కొంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement