35 ఏళ్ల తర్వాత స్టాలిన్ తప్పుకున్నారు!
చెన్నై: తనకు ఎంతో ఇష్టమైన బాధత్యల నుంచి డీఎంకే నిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ తప్పుకున్నారు. గత మూడున్నర దశాబ్దాలుగా డీఎంకే యూత్ విభాగం కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించిన స్టాలిన్ ఆ పదవి నుంచి వైదొలిగారు. ఆ స్థానాన్ని డీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి ఎం.పి. సామినాథన్‌కు కేటాయించారు. పార్టీ కోశాధికారిగా ఉన్న స్టాలిన్‌ను ఆయన తండ్రి, డీఎంకే చీఫ్ కరుణానిధి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించిన విషయం తెలిసిందే. డీఎంకే యూత్ విభాగాన్ని 1980-81 సమయంలో స్వయంగా స్టాలిన్ ఏర్పాటు చేశారు. డిప్యూటీ సీఎంగా ఉన్న సమయంలోనూ ఆయన యూత్ వింగ్ పోస్టు నుంచి తప్పుకోవడానికి విముఖత చూపించారు.
యూత్ విభాగం అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన సామినాథన్ పార్టీ చీఫ్ కరుణానిధిని కలిసి ధన్యావాదాలు తెలిపారు. పార్టీని మరింత బలోపేతం చేస్తానని, మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా నెగ్గిన ఆయన పేర్కొన్నారు. తిర్పూర్ జిల్లాలో అన్నాడీఎంకే దీటుగా డీఎంకేను అభివృద్ధి చేస్తానని చెప్పారు. పార్టీ నేత చంద్రశేఖర్‌ను యూత్ విభాగానికి జాయింట్ సెక్రటరీగా నియమించారు.