స్టాలినే వారసుడు
ద్రవిడ మున్నేట్ర కళగం (డీఎంకే) భావి రథసారథిగా స్టాలిన్ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. పార్టీ నేతృత్వానికి స్టాలిన్ అన్ని రకాల అర్హుడని తనకు తానుగా నిరూపించుకున్నాడని కరుణ కితాబిచ్చారు. తన వారసుడు ఆయనేనని పార్టీ అధినేత కరుణానిధి మంగళవారం మరోసారి స్పష్టం చేశారు.
చెన్నై:
వారసత్వ రాజకీయాలు మామూలైపోయిన ఈ రోజుల్లో తమిళనాట సుదీర్ఘ చరిత్ర కలిగిన డీఎంకేలో కరుణ తర్వాత ఆ పార్టీ పగ్గాలు ఎవరి చేతుల్లోకి వెళతాయనే అంశం కొన్నేళ్లుగా నానుతోంది. 92 ఏళ్ల కరుణానిధికి వారసుని ఎంపిక అనివార్యమైంది. డీఎంకే వ్యవస్థాపకులు అన్నాదురై 1969లో మరణించిన తర్వాత నుంచి పార్టీ బాధ్యతలను కరుణానిధినే నిర్వర్తిస్తున్నారు.
డీఎంకేలో కరుణ తర్వాత కీలకనేతగా చెలామణి అయిన ఎంజీ రామచంద్రన్ ఆయనతో విభేదించి అన్నాడీఎంకే పేరుతో మరో పార్టీ పెట్టుకోవడంతో పార్టీలో కరుణ పెత్తనానికి ఎదురులేకుండా పోయింది. రాజకీయ చతురుడిగా, మంచి వక్తగా పార్టీని పరుగులు పెట్టించిన కరుణానిధి అనేకసార్లు అధికారంలోకి తేగలిగారు. నడవలేని స్థితిలో పూర్తిగా మూడు చక్రాల వాహనానికి పరిమితమైనా అపారమైన జ్ఞాపకశక్తి కరుణకు ఒక వరంగా పరిణమించి పార్టీకి పెద్ద దిక్కుగా నేటికీ నిలిపింది. అయితే ఎప్పటికైనా డీఎంకే పగ్గాలు మరో చేతికి మారక తప్పదనే వాస్తవం వారసత్వ చర్చకు మూడేళ్ల క్రితమే తెరలేచింది.
అళగిరి అవుట్‌తో లైన్‌క్లియర్..
ఆస్తి పంపకాలైనా, పార్టీ పగ్గాలైన పెద్ద కుమారుని ఆధిపత్యం షరా మామూలే. డీఎంకే అధినేత కరుణానిధికి రెండు కళ్లుగా చెలామణి అయిన పెద్ద కుమారుడు అళగిరి, రెండో కుమారుడు స్టాలిన్ మధ్య వారసత్వ పోరు బయలుదేరింది. మదురై కేంద్రంగా రాజకీయాలు నడిపే అళగిరి కంటే చెన్నైలోనే ఉండే తండ్రి కరుణకు చేరువగా నిలిచే స్టాలిన్‌దే సహజంగా పైచేయిగా మారింది. పార్టీలో స్టాలిన్ పెత్తనాన్ని సహించలేని అళగిరి తండ్రిపైనే తిరుగుబాటు చేసి పార్టీకీ దూరమై క్రమేణా బహిష్కృతుడయ్యాడు. రాజకీయ చాణక్యాన్ని తండ్రి నుంచి పుణికి పుచ్చుకున్న స్టాలిన్ తన సోదరుడైన అళగిరిని తనదైన శైలిలో అడ్డు తప్పించుకున్నాడు. స్టాలిన్ వారసత్వాన్ని గతంలో కరుణ పరోక్షంగా ప్రకటించినపుడు డీఎంకేలో ఉండిన నటి ఖుష్బు విమర్శలు గుప్పించారు. అదను కోసం కాచుకుని ఉండిన స్టాలిన్ ఖుష్బు సైతం పార్టీని వీడిపోయే పరిస్థితులు కల్పించారు. ఈ రకంగా పార్టీపై ఆధిపత్యం కోసం పావులు కదుపుకుంటూ వచ్చిన స్టాలిన్ క్రమేణా పరిస్థితిని తనకు అనుకూలంగా మలుచుకున్నారు. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు స్టాలిన్ చేపట్టిన ‘నమక్కు నామే’ పర్యటనకు ప్రజల నుంచి మంచి స్పందన లభించడం కరుణానిధిని ఆనందపరుస్తోంది.
పార్టీ నాయకత్వానికి స్టాలిన్ తగినవాడు : కరుణ
డీఎంకే అధినేత కరుణానిధి మంగళవారం తనను కలిసిన మీడియా ముందు వారసత్వంపై మరోసారి నోరువిప్పారు. డీఎంకే కేవలం ఒకరు పెట్టిన పార్టీ కాదు పెద్ద ఎత్తున ప్రజాస్వామ్య భావాలు, విలువలు కలబోసిన పార్టీ అన్నారు. ప్రజలు కోరినట్లుగానే పార్టీలో నిర్ణయాలు జరుగుతాయని ఇప్పటికే తాను ఎన్నోసార్లు చెప్పానని అన్నారు.
పార్టీ సర్వసభ్వ సమావేశం, కార్యవర్గం కలిసి తీసుకోవాల్సిన నిర్ణయాన్ని తానొక్కడిని తీసుకోజాలనని చెప్పారు. తాను ప్రకటించకుండానే పార్టీ ప్రధాన బాధ్యతలకు తగిన వ్యక్తిగా స్టాలిన్ వెలుగొందుతున్న వాస్తవాన్ని పార్టీలోని ప్రతిఒక్కరూ గుర్తించారని పేర్కొన్నారు. తద్వారా డీఎంకే పగ్గాలు స్టాలిన్ చేతుల్లోకి వెళ్లడం ఖాయమని కరుణానిధి మరోసారి తేల్చేశారు.