సాక్షి, న్యూఢిల్లీ : బిలియనీర్ జ్యూవెలర్ నీరవ్ మోదీ నిర్వాకం పట్ల ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ట్వీట్ల దాడి కొనసాగుతోంది. విద్యార్థులతో మోదీ నిర్వహించిన పరీక్షా పే చర్చా కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ ‘పిల్లలు ఎలా ఉత్తీర్ణులు కావాలో రెండు గంటలు ప్రసంగిస్తారు కానీ..22,000 కోట్ల బ్యాంకింగ్ స్కామ్‌పై రెండు నిమిషాలు కూడా మాట్లాడరు’ అంటూ ప్రధానిని ఉద్దేశించి రాహుల్ వ్యంగ్యాస్ర్తాలు సంధించారు.
పీఎన్‌బీకి కుచ్చుటోపీ పెట్టిన నీరవ్ మోదీ వ్యవహారంపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇప్పటివరకూ నోరు మెదపకపోవడాన్ని రాహుల్ ఆక్షేపించారు. నీరవ్ స్కామ్‌పై పెదవివిప్పాలని మోదీ, జైట్లీలకు సూచించారు. మోదీ, జైట్లీల మౌనంపై రాహుల్ శనివారం కూడా ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.
నీరవ్ బాగోతంపై సామాజిక న్యాయశాఖ మంత్రి, రక్షణ మంత్రి సహా పలువురు మంత్రులు మాట్లాడుతున్నా ఈ వ్యవహారానికి బాధ్యత వహించాల్సిన ఆర్థిక మంత్రి, ప్రధాని ఒక్క మాట మాట్లాడటం లేదని విస్మయం వ్యక్తం చేశారు. నోట్ల రద్దు అనంతరం వెలుగుచూసిన అతిపెద్ద కుంభకోణం ఇదేనని, ఈ స్కామ్‌పై బీజేపీ ఎలాంటి చర్యలు తీసుకుందని రాహుల్ నిలదీశారు.
Comments
Please login to add a commentAdd a comment