ఆపదల్లో, దయనీయ స్థితిలో ఉన్నవారిని చూస్తే మనసు చివుక్కుమంటుంది
ఆపదల్లో, దయనీయ స్థితిలో ఉన్నవారిని చూస్తే మనసు చివుక్కుమంటుంది. వీలైనంతలో వారికేదైనా సాయం చేయాలనిపిస్తుంది. కానీ ఏ రూపంలో సాయం అందించాలో తెలియని పరిస్థితి. దేశంలో ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ఆయా విభాగాల్లో సేవలందిస్తున్నా సరైన వలంటీర్లు దొరకని స్థితి. ఈ లోటును భర్తీ చేస్తూ స్వచ్ఛంద సంస్థలు, వలంటీర్లను అనుసంధానం చేసేందుకు రూపొందిన సంస్థ ‘కనెక్ట్‌ఫర్’! దీని ద్వారా ఎందరినో సమాజ సేవలో భాగస్వాములను చేస్తున్నారు.. ముంబైకి చెందిన ఇద్దరమ్మాయిలు.. శ్లోక రసెల్ మెహతా, మనితి మోదీ.
శ్లోక రసెల్ మెహతా.. ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ నుంచి ఆంత్రోపాలజీలో బ్యాచిలర్ డిగ్రీ, తర్వాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి లా, ఆంత్రోపాలజీ అండ్ సొసైటీలో ఎంఎస్ చేసి 2014లో ముంబైకి తిరిగొచ్చింది. మనితి మోదీ.. ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో శ్లోకకు జూనియర్. లండన్ యూనివర్సిటీ కాలేజ్ నుంచి బయోమెడికల్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ, ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ నుంచి మేనేజ్‌మెంట్‌లో ఎంఎస్ పూర్తి చేసింది. ఆ తర్వాత అక్కడే ఒక మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్ సంస్థలో ఏడాదిపాటు పనిచేసి, తర్వాత ముంబైకి తిరిగొచ్చింది.
శ్లోకకు పాఠశాల రోజుల నుంచే సామాజిక సేవపై ఆసక్తి ఉండేది. సమాజానికి వీలైనంతలో సేవ చేయాలని తపించేది. ఆ క్రమంలోనే పిల్లలకు పాఠాలు చెప్పడం, వారికి పుస్తకాలు ఇవ్వడం వంటివి చేసేది. చదువు పూర్తయ్యాక కూడా తన ఆశయాన్ని కొనసాగించాలని నిర్ణయించుకుంది. అందుకే లండన్‌లో ఎంఎస్ పూర్తి చేసి, 2013లో ముంబైకి తిరిగొచ్చింది. ఉన్నత ఉద్యోగ ఆఫర్లను సైతం వదులుకుంది.
సరైన వేదిక కోసం..
ముంబైకి తిరిగొస్తూనే శ్లోక తన తండ్రి నెలకొల్పిన చారిటీ సంస్థ రోజీ బ్లూ ఫౌండేషన్ (ఆర్‌బీఎఫ్) ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు చేపట్టింది. ఉచిత విద్య, వైద్యం తదితరాలకు సంబంధించిన కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంది. అయినా ఏదో అసంతృప్తి. దేశంలో ఎన్నో ఎన్‌జీవోలున్నా, వాటి ద్వారా అవసరమైన వారికి పూర్తిస్థాయిలో సేవలందకపోవడానికి కారణాలపై అధ్యయనం చేసింది. క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టింది.
సమాజ సేవలో భాగస్వాములయ్యేందుకు ఆసక్తి ఉన్న వారిని అన్వేషించడంలో ఎన్‌జీవోలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలుసుకుంది. మరోవైపు సేవాతత్పరత కలిగిన వ్యక్తులున్నా, వారికి సరైన వేదికలు కనిపించడం లేదని అర్థమైంది. అందుకే ఎన్‌జీవోలు, వలంటీర్లను అనుసంధానం చేయాలని నిర్ణయించింది. అదే సమయంలో లండన్ నుంచి తిరిగొచ్చిన స్నేహితురాలు మనితికి తన ఆలోచన చెప్పింది. ఇద్దరూ కలిసి 2015, డిసెంబర్‌లో ‘కనెక్ట్‌ఫర్’ పేరుతో ప్రత్యేక సంస్థను నెలకొల్పారు.
కనెక్ట్‌ఫర్ కార్యకలాపాలు..
కనెక్ట్‌ఫర్ వెబ్‌సైట్లో ఆయా రంగాల వారీగా సేవలందించాలనుకుంటున్న వలంటీర్లు తమ వివరాలు నమోదు చేసుకోవచ్చు. ఆ వివరాల ఆధారంగా సంబంధిత ఎన్‌జీవో కార్యకలాపాలకు సరిపోయే వలంటీర్లను గుర్తించేందుకు కనెక్ట్‌ఫర్ కృషి చేస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థ చిల్డ్రన్ అండ్ యూత్, కమ్యూనిటీ డెవలప్‌మెంట్, ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ, హెల్త్ అండ్ మెడిసిన్, ఎన్విరాన్‌మెంట్, వయోవృద్ధుల సంరక్షణ, దివ్యాంగుల సంక్షేమం తదితర విభాగాల్లో ఎన్‌జీవోలు, స్వచ్ఛందంగా సేవలందించాలనుకుంటున్నవారికి ఉమ్మడి వేదికగా నిలుస్తోంది.
స్పందన – సంతోషం
ఇప్పటి వరకు దాదాపు 2,500 మంది వలంటీర్లు సేవలందించేందుకు కనెక్ట్‌ఫర్‌లో పేర్లు నమోదు చేసుకున్నారు. ఎన్‌జీవోల ద్వారా 3,200 గంటల పాటు సేవలందాయి. వీటిద్వారా ఆయా స్వచ్ఛంద సంస్థలకు రూ.9 లక్షల వరకు ఖర్చు ఆదా అయింది. వలంటీర్‌గా సేవలందించేందుకు ఉన్నత హోదాల్లో ఉన్న వ్యక్తుల నుంచి విద్యార్థుల వరకు ఎందరో ముందుకొస్తుండటం తమకు సంతోషం కలిగిస్తోందని అంటున్నారు శ్లోక, మనితి. సామాజిక సేవ అంటే తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో తిరగడమనే భావన సరికాదని, చారిటీ కార్యకలాపాలకు ఊతమిచ్చేలా అందించే ఎలాంటి తోడ్పాటైనా సామాజిక సేవలో భాగమేనని వారు పేర్కొంటున్నారు.
లక్ష్యం... అంతటా విస్తరించడం
ప్రస్తుతం కనెక్ట్‌ఫర్ కార్యకలాపాలు మహారాష్ట్ర, గుజరాత్‌కు పరిమితమయ్యాయి. ఈ సేవలు దేశంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించేలా చేయడం తమ లక్ష్యమని శ్లోక, మనితి చెబుతున్నారు.