
మైనర్లతో బట్టలిప్పించి.. చెప్పుల దండలేసి..
ఠాణే: స్వీట్ షాపులో దొంగతనానికి పాల్పడినందుకు ఇద్దరు మైనర్ల బట్టలిప్పించి వారి మెడలో చెప్పుల దండలు వేసి ఊరేగించిన దారుణ సంఘటన మహారాష్ట్రలోని ఠాణేలో చోటు చేసుకుంది. స్వీట్ షాపుకు చేరువలో ఉండే ఇద్దరు బాలురు షాపు నుంచి ఫుడ్‌ను దొంగిలించారు. దీంతో ఆగ్రహించిన షాపు యజమాని అతని కుమారుల సాయంతో వారిని పట్టుకున్నాడు.
తొలుత పిల్లల జుట్టును కట్ చేయించాడు. అక్కడితో ఆగకుండా వారి బట్టలను తీసేయించాడు. ఆపై చెప్పుల దండలు వేసి వీధిలో ఊరేగించాడు. పిల్లలపై షాపు యజమాని ఒడిగట్టిన దారుణాన్ని తట్టుకోలేకపోయిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకున్న పోలీసులు స్వీట్ షాపు యజమాని మెహమూద్ పఠాన్(69)తో సహా అతని తనయులు ఇర్ఫాన్(26), సలీమ్(22)లను అరెస్టు చేశారు.