సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ స్కూల్స్‌లో గాయత్రి మంత్రం పఠించాలనే నిబంధన దుమారం రేపింది. తమ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధులచే గాయత్రి మంత్రం పఠించాలని నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల ఢిల్లీ మైనారిటీ కమిషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్‌డీఎంసీ) నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సదరు సంస్థకు మైనారిటీ కమిషన్ నోటీసులు జారీ చేసింది.
పాఠశాల అసెంబ్లీలో ఉదయాన్నే గాయత్రి మంత్రం జపించాలని ఎందుకు ఉత్తర్వులు జారీ చేశారో వివరణ ఇవ్వాలని కోరామని ఢిల్లీ మైనారిటీ కమిషన్ చీఫ్ జఫరుల్ ఇస్లాం ఖాన్ తెలిపారు. ఎన్‌డీఎంసీ ఉత్తర్వులు లౌకిక స్ఫూర్తికి విఘాతమని, మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్ధులు ఓ మతానికి చెందిన మంత్రాలను పఠించేందుకు ఇష్టపడరని చెప్పారు.
కాగా, గాయత్రి మంత్రం జపించాలనే ఉత్తర్వులను ఎన్‌డీఎంసీ అధికారులు సమర్ధించుకున్నారు. స్కూళ్లలో గాయత్రి మంత్రం పఠించాలనే ఉత్తర్వులు తప్పనిసరిగా పాటించాల్సినవి కాదని స్పష్టం చేశారు. ఎన్‌డీఎంసీ పరిధిలో 765 పాఠశాలలు నిర్వహిస్తున్నక్రమంలో 2.2 లక్షల మంది విద్యార్ధులు అభ్యసిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment