న్యూఢిల్లీ: కరోనా చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లేందుకు ప్రజలు వెనకడుగు వేస్తున్నట్టు తెలిసింది. కోవిడ్ చికిత్సలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల సేవలపై ప్రజల అభిప్రాయం అనే అంశంపై జరిగిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. లోకల్ సర్కిల్స్ అనే సోషల్ మీడియా ఫ్లాప్‌ఫాం ఈ అధ్యయనం చేసింది. ఐదు ప్రశ్నలతో కూడిన తమ స్టడీ 40 వేల మందిపై సాగిందని నిర్వాహకులు తెలిపారు.
కోవిడ్ చికిత్సలో ప్రైవేటు ఆస్పత్రుల అధిక చార్జీల బాదుడు తట్టుకోలేమని 57 శాతం మంది అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్తే సెకండరీ కాంటాక్టు ద్వారా వైరస్ బారిన పడతామని మరో 46 శాతం మంది ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా చికిత్సలో ప్రైవేటు ఆస్పత్రుల చార్జీల విషయంలో కేంద్ర ప్రభుత్వం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని.. ఒక నిర్ణీత మొత్తం ఫిక్స్ చేయాలని 61 శాతం మంది కోరుతున్నారు. దేశవ్యాప్తంగా కరోనా చికిత్సకు సరిపడా వైద్యసదుపాయాలు లేవని 32 శాతం మంది చెప్పుకొచ్చారు.
ఒకవేళ కరోనా బారిన పడితే చికిత్స కోసం ఏ ఆస్పత్రికి వెళ్తారనే ప్రశ్నకు.. 32 శాతం మంది ప్రైవేటు ఆస్పత్రులకు, 22 శాతం మంది ప్రభుత్వ ఆస్పత్రు వైపు మొగ్గు చూపారు. మరో 32 శాతం మంది అసలు ఆస్పత్రులకే వెళ్లమని అంటున్నారు. ఇంటి వద్దే చికిత్స తీసుకుంటామని, పరిస్థితి తీవ్రంగా ఉంటేనే ఆస్పత్రికి వెళ్తామని చెప్తున్నారు. 14 శాతం మంది మాత్రం కచ్చితంగా ఫలానా ఆస్పత్రికి వెళ్తామని చెప్పమలేమన్నారు.
కరోనా లాక్‌డౌన్‌తో అందరి ఆర్థిక పరిస్థితులు తలకిందులయ్యాయని, ఖరీదైన వైద్య ఖర్చులు భరించే శక్తి లేదని తమ అధ్యయనంలో భాగమైన ప్రజలు చెప్తున్నారని లోకల్ సర్కిల్స్ జనరల్ మేనేజర్ అక్షయ్ గుప్తా వెల్లడించారు. ప్రజల అభిప్రాయాల నివేదికను కేంద్ర ఆరోగ్యశాఖకు అందించామని తెలిపారు. కాగా, దేశంలో కరోనా కేసులు బయటపడిన తొలినాళ్లలో కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే వైద్యానికి అనుమతించారు. అనంతరం ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా కోవిడ్ చికిత్సకు అనుమతినిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment