అభివృద్ధికి ‘హిందుత్వ’ జోడిస్తేనే గెలుపు
న్యూఢిల్లీ: ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీకి అభివృద్ధి మంత్రం ఒక్కటే సరిపోదని.. హిందుత్వ అంశాన్ని జోడిస్తేనే ఓట్లు పడతాయని బీజేపీ ఎంపీ, పార్టీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి అన్నారు. ‘ఆర్థికాభివృద్ధి చాలా అవసరం. కానీ ఎన్నికల్లో ఇదొక్కటే సరిపోదు’ అని ఆజ్‌తక్ చానల్ నిర్వహించిన ‘దేశ్ కా ముద్దా’ (దేశం ముందున్న ప్రధాన సమస్య) కార్యక్రమంలో మాట్లాడుతూ తెలిపారు. ‘పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలు తెచ్చారు. దీంతో ఆర్థిక వ్యవస్థ 3 నుంచి 9 శాతానికి పెరిగింది.
రాజీవ్ గాంధీ కాలంలో పారిశ్రామికాభివృద్ధి 14 శాతానికి చేరింది. కానీ వీరిద్దరూ ఎన్నికల్లో ఓడిపోయారు’ అని స్వామి చెప్పారు. బీజేపీ అధికార ప్రతినిధులు ఎప్పుడూ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారని.. వీరంతా వాజ్‌పేయి నుంచి నేర్చుకోవాలన్నారు. 2004 లోక్‌సభ ఎన్నికల సమయంలో భారత్ వెలిగిపోతోందన్న బీజేపీ నినాదం బెడిసికొట్టి.. సగం సీట్లను కమలదళం కోల్పోవాల్సి వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. అందుకే అభివృద్ధికి హిందుత్వను జోడించటం ద్వారానే మంచి ఫలితాలు సాధించొచ్చన్నారు.