విలేకరి అక్షయ్ సింగ్ ఆకస్మిక మృతి
జబువా (మధ్యప్రదేశ్): మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకున్న వృత్తిపరీక్షల బోర్డు(వ్యాపమ్) కుంభకోణంపై వార్తలు అందిస్తున్న అక్షయ్ సింగ్ అనే విలేకరి శనివారం ఆకస్మికంగా మృతి చెందారు. టీవీ టుడే టీవీ చానల్ విలేకరిగా పనిచేస్తున్న అక్షయ్ మధ్యప్రదేశ్‌లోని మేఘ్‌నగర్‌లో హఠాత్తుగా అనారోగ్యానికి గురై కన్నుమూశారు.
ఢిల్లీలో పనిచేస్తున్న ఆయన అనుమానాస్పదంగా మృతిచెందిన ఈ స్కాం నిందితురాలు నమ్రతా దామోర్ తల్లిదండ్రులతో మాట్లాడేందుకుశనివారం మేఘ్‌నగర్ వచ్చారు. నమ్రత తండ్రి మెహతాబ్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. అక్షయ్, మరో ఇద్దరు మెహతాబ్ ఇంటికి వెళ్లారు. ఇంటర్వ్యూ అయిపోయాక ఏవో కాగితాలను జిరాక్స్ చేయించేందుకు ఒక వ్యక్తిని పంపారు.
అక్షయ్ ఆ ఇంటి వెలుపల వేచిచూస్తుండగా హఠాత్తుగా నోట్లోంచి నురగ వచ్చింది. ఆయనను దగ్గర్లోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఫలితం లేకపోవంతో దగ్గర్లోనే ఉన్న దాహోద్(గుజరాత్)కు తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఈ స్కాంలో లబ్ధి పొందినట్లు భావిస్తున్న నమ్రత మృతదేహం 2012లో రైలు పట్టాలపై కనిపించింది. అక్షయ్ మృతిపై కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ సందేహాలు లేవనెత్తారు. పోస్ట్‌మార్టంను వీడియోలో చిత్రీకరించాలని డిమాండ్ చేశారు.