ఆయనకు సమన్లు జారీ చేయండి
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు సమన్లు జారీ చేయాలని జార్ఖండ్ మాజీ సీఎం మధుకోడా ఓ పిటిషన్ లో కోరుతున్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ఢిల్లీ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మన్మోహన్‌సింగ్ సహా, మరో ఇద్దరికి సమన్లు జారీ చేయాలని మధుకోడా తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై తదుపరి విచారణ ఆగస్టు 28 న జరగనుంది.
బొగ్గ క్షేత్రాల అక్రమ కేటాయింపుల కేసులో కాంగ్రెస్ నాయకుడు నవీన్ జిందాల్, మధు కోడా, కేంద్ర మాజీ సహాయమంత్రి దాసరి నారాయణరావు, మాజీ కోల్ సెక్రటరీ హెచ్సీ గుప్తా తదితరులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీరిపై చార్జ్షీట్ కూడా నమోదైంది.
అయితే మధుకోడా సహా 8 మంది నిందితులకు ప్రత్యేకకోర్టు ఇటీవలే బెయిల్ మంజూరుచేసింది. ప్రైవేటు సంస్థలకు బొగ్గు బ్లాక్‌ల కేటాయింపులో మధుకోడా సహా, మిగిలిన నిందితులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేశారని కోర్టు పేర్కొంది. కాగా ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే మన్మోహన్ సింగ్ తన అభిప్రాయాలను కోర్టు ముందుంచిన సంగతి తెలిసిందే.