సునంద పుష్కర్(ఫైల్)
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సునంద పుష్కర్ హత్య కేసు దర్యాప్తు మరింత పురోగతి సాధించింది. మానసిక ఆందోళన నుంచి ఉపశమనం కోసం వాడే ‘అల్ప్రాక్స్’ ట్యాబ్లెట్లను అతిగా తీసుకోవడం వల్ల ఆమె శరీరం విషతుల్యమైందని, అది ఆమె మరణానికి దారితీసిందని స్థానిక ఎయిమ్స్ అధికారులు తాజా నివేదికలో వెల్లడించినట్టు ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపాయి.
సునంద పుష్కర్ ఎందుకు మోతాదుకు మించి ఆ ట్యాబ్లెట్లు తీసుకున్నారు? లేదా ఎవరైనా ఉద్దేశపూర్వకంగానే ఆమెకు అతిగా ట్యాబ్లెట్లు ఇచ్చారన్న విషయం ఇప్పటికీ సందేహాస్పదమేనని, ఈ విషయంలో మరొకసారి సునంద పుష్కర్ భర్త, కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్‌ను విచారించాల్సి ఉందని పోలీసు అధికారులు చెబుతున్నారు. ఎయిమ్స్ నుంచి తాజా నివేదిక అందిన విషయాన్ని ఢిల్లీ పోలీసు కమిషనర్ భీమ్‌సేన్ బస్సీ శుక్రవారం నాడు ట్విట్టర్‌లో ధ్రువీకరించారు. ఇప్పటివరకున్న సాక్ష్యాధారాల ప్రకారం సునందది అసహజ మరణమేనని తాను కచ్చితంగా చెప్పగలనంటూ ఆయన శనివారం ఉదయం కూడా ట్వీట్ చేశారు.
ఎయిమ్స్ నుంచి అందిన తాజా నివేదిక 11 పేజీలు ఉందని, దానికి అనుబంధ నివేదిక 32 పేజీలు ఉందని బస్సీ తెలిపారు. అందులో కొన్ని నిర్ధారణలు ఉన్నాయని, వాటిని దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. 2014, జనవరి 17న సునంద పుష్కర్ ఢిల్లీలోని ఓ హోటల్లో అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన విషయం తెల్సిందే. ముందుగా అనుమానాస్పద మృతిగా కేసును నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు గతేడాది జనవరిలో దాన్ని హత్య కేసుగా మార్చారు.