
సునంద కేసులో పోలీసులను కలసిన కొడుకు
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ భార్య సునంద్ పుష్కర్ మృతి కేసులో ఆయన చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసును నిష్పక్షపాతంగా విచారణ చేయాలని సునంద కొడుకు శివ మీనన్ పోలీసులను కోరారు. ఢిల్లీ పోలీసులను కలసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. సునందకు ఆత్మహత్య చేసుకుని చనిపోయేంత పిరికితనం లేదని బంధువులు చెబుతున్నారు. అయితే శశి థరూర్ హత్య చేసి ఉంటారని వారు ఆరోపించలేదు. సునంద మృతికి గల కారణాలను బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
సునందాపుష్కర్ జనవరి 17వ తేదీన ఢిల్లీలోని ఓ ఫైవ్స్టార్ హోటల్లో అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన విషయం తెలిసిందే. గురువారం లీకైన పోస్టుమార్టం నివేదికలో ఆమె మరణానికి విషప్రభావమే కారణమని ఉంది. కాగా సునందాపుష్కర్ ఎందుకు మరణించారనే విషయం ఫోరెన్సిక్ నివేదికలో ఏమీ తేలలేదని ఢిల్లీ పోలీసులు తెలిపారు. అసలు ఆ నివేదికలో ఏమీ తేలనేలేదని ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ తెలిపారు. ఈ కేసును మళ్లీ విచారించాలని రాజకీయ డిమాండ్లు కూడా వచ్చాయి.