న్యూఢిల్లీ : గృహ నిర్బంధంలో ఉన్న తన తల్లిని కలిసేందుకు జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తి కూతురు సనా ఇల్తిజా జావేద్‌కు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. అయితే శ్రీనగర్‌లో స్వేచ్ఛగా పర్యటించే విషయమై స్థానిక అధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అలా జరగని పక్షంలో నిబంధనలకు లోబడి ముఫ్తిని చూడవచ్చని పేర్కొంది. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర విభజన నేపథ్యంలో కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తి సహా ఒమర్ అబ్దుల్లాను గృహ నిర్బంధంలో ఉంచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ‘మా అమ్మను నిర్బంధంలో ఉంచారు. పార్టీ కార్యకర్తలు, న్యాయవాదులు.. ఆఖరికి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడేందుకు ఆమెకు అనుమతి లేదు’ అంటూ ఇల్తిజా జావేద్ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా కశ్మీర్‌లో కేంద్రం అనుసరిస్తున్న విధానాలను తీవ్రంగా విమర్శించారు.
ఈ క్రమంలో తన తల్లిని కలిసేందుకు కేంద్రం అనుమతి ఇవ్వడం లేదని పేర్కొంటూ ఇల్తిజా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చెన్నైకి వెళ్లేందుకు మాత్రం అనుమతించారు గానీ శ్రీనగర్‌లో స్వేచ్ఛగా తిరగకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ ఆమె పిటిషన్ దాఖలు చేశారు. అదే విధంగా తన తల్లితో వ్యక్తిగతంగా మాట్లాడేందుకు పర్మిషన్ ఇవ్వాలన్న ఇల్తిజా అభ్యర్థనపై స్పందించిన సుప్రీంకోర్టు.. నేడు ఆమె పిటిషన్‌ను విచారించింది. ఇందులో భాగంగా ఇల్తిజా శ్రీనగర్‌కు వెళ్లేందుకు ఎందుకు అనుమతించడం లేదని సీజేఐ రంజన్ గొగోయ్ ప్రభుత్వం తరఫు న్యాయవాదిని ప్రశ్నించారు. ఇందుకు బదులుగా స్థానిక జిల్లా మెజిస్ట్రేట్ అనుమతితో ఇల్తిజా ముఫ్తిని కలవచ్చని చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. ఇరు వర్గాల వాదనల అనంతరం ఇల్తిజా తన తల్లిని కలిసేందుకు సర్వోన్నత న్యాయస్థానం అనుమతించింది.
Comments
Please login to add a commentAdd a comment