న్యూఢిల్లీ: ప్రధాని మోదీ జీవిత కథ ఆధారంగా తీసిన ‘పీఎం నరేంద్ర మోదీ’ సినిమా పై నిషేధం నిర్ణయాన్ని వాస్తవ పరిస్థితుల ఆధారంగా మరోసారి పరిశీలించాలని ఎన్నికల సంఘాన్ని (ఈసీ)సుప్రీంకోర్టు కోరింది. ఎన్నికల నియమావళి అమల్లో ఉండగా ‘పీఎం నరేంద్ర మోదీ’ ద్వారా ఓటర్లను ప్రభావితం చేసేందుకు అధికార బీజేపీ యత్నిస్తోందంటూ ఈసీకి ప్రతిపక్షాలు ఫిర్యాదు చేశాయి. దీంతో ఈ నెల 11వ తేదీన దేశవ్యాప్తంగా విడుదల కావాల్సిన ఈ సినిమాపై ఈసీ నిషేధం విధించింది. తదుపరి ఉత్తర్వులు వెలువరించే వరకు ఈ నిషేధం ఉంటుందని స్పష్టం చేసింది. సినిమాలోని ఏ చిత్రం లేదా సన్నివేశాన్ని ఓటర్లను ప్రభావితం చేసే విధంగా ఎలక్ట్రానిక్ మీడియాలో ఉంచరాదని కూడా పేర్కొంది. దీనిపై ‘పీఎం నరేంద్ర మోదీ’ నిర్మాతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ సంజీవ్ ఖన్నాల ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. ఎన్నికల సంఘం ‘పీఎం నరేంద్ర మోదీ’ మొత్తం సినిమా కాకుండా కేవలం రెండు నిమిషాల ట్రైలర్‌ను చూసి ఈసీ నిషేధం నిర్ణయం తీసుకుందని పిటిషనర్ తరఫు లాయర్ ముకుల్ రోహిత్గీ తెలిపారు. ఈసీ బృందానికి ఈనెల 16, 17వ తేదీల్లో పూర్తి చిత్రం చూపేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. తాము ట్రైలర్ మాత్రమే చూసినట్లు ఈసీ కూడా అంగీకరించింది. దీంతో పీఎం మోదీ సినిమాను ఆసాంతం చూసిన తర్వాతే నిషేధించాలో వద్దో నిర్ణయించాలని ధర్మాసనం తెలిపింది. ఈ నెల 19వ తేదీలోగా నిర్ణయం తీసుకుని, సంబంధిత నివేదికను సీల్డు కవర్‌లో సమర్పించాలని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment