
న్యూఢిల్లీ: కేసులో వాదనలు వినిపిస్తున్న ఓ న్యాయవాదిపై కోర్టు ధిక్కరణ నేరం మోపుతానంటూ బెదిరించిన సంఘటనలో సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్ అరుణ్ మిశ్రా గురువారం క్షమాపణ చెప్పారు. తమతో వ్యవహరించే విషయంలో ఓపికగా ఉండాలన్న సీనియర్ న్యాయవాదుల సూచనకు అంగీకరించిన జస్టిస్ అరుణ్ మిశ్రా... తన వైఖరి కారణంగా ఎవరైనా బాధపడి ఉంటే క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు. భూ సేకరణకు సంబంధించిన కేసులను చూస్తున్న ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి జస్టిస్ మిశ్రా నేతృత్వం వహిస్తుండగా మంగళవారం ఒక కేసుకు సంబంధించి వాదనలు వినిపిస్తున్న లాయర్ గోపాల్ శంకర నారాయణన్‌ను కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేస్తానని బెదిరించారు. ఈ విషయంపై కపిల్ సిబల్, ముకుల్ రోహత్గీ, అభిషేక్ సింఘ్వీ, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాకేశ్ ఖన్నా తదితరులు గురువారం జడ్జిని కలిసి జరిగిన సంఘటనను ప్రస్తావించారు. ‘ఏ సమయంలోనైనా ఎవరైనా ఏదైనా అనుకునిఉంటే చేతులు జోడించి క్షమాపణలు కోరుతున్నా’ అని జడ్జి వ్యాఖ్యానించారు.