న్యూఢిల్లీ: అర్హత పరీక్షల్లో రిజర్వేషన్లు ఉండటానికి వీల్లేదని సుప్రీంకోర్టు తేల్చింది. సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటీఈటీ–(సీటెట్)–2019లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్ కోరుతూ దాఖలైన పిటిషన్‌ను జడ్జీలు జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ సంజీవ్ ఖన్నాల వెకేషన్ బెంచ్ సోమవారం విచారించింది. ఎవరికైనా రిజర్వేషన్ అనేది అడ్మిషన్ల వేళ మాత్రమే పరిశీలనలోకి వస్తుందంది. అర్హత పరీక్షలకు రిజర్వేషన్ అనేది అర్ధరహితమని పేర్కొంది.
సీటెట్ అనేది అర్హత పరీక్ష మాత్రమేనని, రిజర్వేషన్ అంశం అడ్మిషన్ల సమయంలోనే తెరపైకి వస్తుందని తెలిపింది. జూలై 7వ తేదీన జరగనున్న సీటెట్ పరీక్ష నోటిఫికేషన్ గురించి పిటిషనర్ తరఫు లాయర్ ప్రస్తావించగా ధర్మాసనం స్పందించింది. ఈ పరీక్ష నోటిఫికేషన్ ఎస్సీలకు కానీ, ఎస్టీలకుగానీ రిజర్వేషన్ ఇవ్వడం లేదని తెలిపింది. ఈ నేపథ్యంలో తొలుత పిటిషన్‌ను కొట్టేసిన కోర్టు..ఈ అంశాన్ని పరిశీలించాల్సిందిగా లాయర్ మరోసారి అభ్యర్థించడంతో తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది. సీటెట్–2019 నిర్వహణ కోసం సీబీఎస్‌ఈ జనవరి 23వ తేదీన పత్రికా ప్రకటన జారీ చేసింది.
ఐఏఎస్, ఐపీఎస్‌ల కేడర్‌పై విచారణ
2018 బ్యాచ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కేడర్ కేటాయింపులు చెల్లవంటూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు కోర్టు అంగీకరించింది. జస్టిస్ ఇందిర, జస్టిస్ సంజీవ్‌ల బెంచ్ సోమవారం ఈ పిటిషన్‌ను విచారించింది. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ తన వాదనలు వినిపిస్తూ.. 2018 ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు శిక్షణ పూర్తి చేసుకుని, కేటాయించిన కేడర్‌లలో ఈ నెల 10వ తేదీన వారు జాయిన్ కావాల్సి ఉందన్నారు. ఈ సమయంలో అధికారుల కేటాయింపుల ప్రక్రియను మళ్లీ చేపట్టాలంటూ హైకోర్టు ఆదేశించిందని తెలిపారు.
దీంతో ఈ పిటిషన్‌పై 17న వాదనలు వింటామని కోర్టు తెలిపింది. కేడర్ కేటాయింపులు అన్యాయంగా ఉన్నాయంటూ నలుగురు ఐపీఎస్ అధికారులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీంతోకేటాయింపుల ప్రక్రియను మళ్లీ చేపట్టాలంటూ హైకోర్టు ఆదేశించడం తెల్సిందే. కాగా, తీవ్రమైన ఎండలు, రంజాన్ నెల కారణంగా ఆఖరి దశ లోక్‌సభ ఎన్నికల ఓటింగ్‌ను ఉదయం 7కు బదులు 5.30గంటలకే మొదలయ్యేలా ఈసీను ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
Comments
Please login to add a commentAdd a comment