ఆదివారాల్లో క్లాసులా?
ఇంజనీరింగ్ కాలేజీల షెడ్యూల్‌పై సుప్రీం తీవ్ర అసంతృప్తి
సాక్షి, న్యూఢిల్లీ: ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్‌కు అవకాశమిస్తే సకాలంలో సిలబస్ పూర్తిచేసేందుకు వీలుగా ఇంజనీరింగ్ కళాశాలలు సమర్పించిన తరగతుల షెడ్యూల్‌పై సుప్రీంకోర్టు మంగళవారం తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. తొలి సెమిస్టర్ ముగిసేనాటికి ఆదివారాలు మినహాయించి రోజుకు పది గంటలకు మించకుండా కనీసం అరవై పని దినాలు ఉండాలని, ఆ మేరకు షెడ్యూల్‌ను రూపొందించి తిరిగి సమర్పించాలని కాలేజీలను ఆదేశించింది. రెండో విడత కౌన్సెలింగ్ కోసం గడువు పొడిగించేందుకు తమకు ఇబ్బందేమీ లేదని, తరగతుల నిర్వహణకు తగిన షెడ్యూలు ఇవ్వాలంటూ జస్టిస్ ఎస్‌జే ముఖోపాధ్యాయ, ఎస్‌ఏ బాబ్డేలతో కూడిన ధర్మాసనం సోమవారం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కళాశాలలు మంగళవారం నాడు సుప్రీంకోర్టుకు షెడ్యూల్‌ను సమర్పించాయి. ఆదివారాలతో కలిపి రోజుకు రెండున్నర గంటల పాటు అదనపు పని గంటలు కేటాయిస్తూ తరగతులు బోధిస్తామని అందులో పేర్కొన్నాయి. జేఎన్టీయూహెచ్ అకడమిక్ కేలండర్ ప్రకారం సెప్టెంబర్ 6, 2014 నుంచి మే 9, 2015 వరకు ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం పూర్తవుతుందని తెలిపాయి. నవంబర్ 19న ఫస్ట్‌మిడ్, వచ్చే జనవరి 27న సెకండ్ మిడ్, ఏప్రిల్ 6న థర్డ్ మిడ్ పరీక్షలు ఉంటాయని, ఇక ఏప్రిల్ 27 నుంచి మే 9 వరకు వార్షిక పరీక్షలు ఉంటాయని నివేదికలో పేర్కొన్నాయి. అలాగే రోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు తరగతులు నిర్వహిస్తామని, గంట విరామం ఉంటుందని కాలేజీలు తెలిపాయి. రెండో విడత అడ్మిషన్ల వరకు నష్టపోయిన పనిదినాలను తాజా షెడ్యూల్ ప్రకారం భర్తీ చేయొచ్చని చెప్పాయి. ఆదివారాలతో సహా అదనపు పని దినాలు, అదనపు పని గంటలు కల్పించడం వల్ల ఏప్రిల్ 6, 2015 వరకు సిలబస్‌ను పూర్తి చేస్తామని, ఆ తర్వాత యూనివర్సిటీ అకడమిక్ కేలండర్ ప్రకారం నడుచుకుంటామని కాలేజీ యాజమాన్యాలు వె ల్లడించాయి.
అలా కుదరదు!
అయితే ఈ షెడ్యూల్‌పై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. ఆదివారాల్లోనూ తరగతులు బోధించడం, అలాగే రోజుకు పది గంటలు బోధించడం కూడా సరికాదని అభిప్రాయపడింది. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) షెడ్యూల్ ప్రకారం ఇంజనీరింగ్ తొలి సెమిస్టర్‌ను జనవరి 15తో ముగించాల్సి ఉందని, మొత్తంగా 75 రోజుల పాటు 525 పని గంటలు ఉండాలని పేర్కొంది. విచారణ సందర్భంగా ఏఐసీటీఈ న్యాయవాది కూడా ఇదే చెప్పారు. దీంతో న్యాయమూర్తి జస్టిస్ ముఖోపాధ్యాయ స్పందిస్తూ.. ఏఐసీటీసీ షెడ్యూలు ప్రకారం జనవరి 15తో తొలి సెమిస్టర్ పూర్తవుతున్నందున.. ఇందులో పరీక్షలకు కొన్ని దినాలు, అందుకు విద్యార్థులు సన్నద్ధమయ్యేందుకు 15 రోజులు తీసేసి, ఆదివారాలు కూడా మినహాయించి కనీసం 60 రోజుల పని దినాలను చూపాలని పేర్కొన్నారు. పని గంటలు కూడా 10 గంటలకు మించరాదని, అందులో గంట భోజన విరామం ఉండాలని సూచించారు. నవంబర్ 15 నుంచి జనవరి 15లోపు పనిదినాలనే లెక్కించాలని పేర్కొన్నారు. దీనికి కళాశాలల తర ఫు న్యాయవాదులు గోపాల సుబ్రమణ్యం, అభిషేక్‌మను సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. వాస్తవానికి జేఎన్టీయూహెచ్‌లో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరానికి సెమిస్టర్ విధానం లేదని, మూడు మిడ్ పరీక్షలు, ఒక రెగ్యులర్(వార్షిక) పరీక్ష మాత్రమే ఉంటాయని వివరించారు. అందువల్ల జనవరి 15 నాటికి సెమిస్టర్ పూర్తవ్వాలన్న అంశమే ఉత్పన్నం కాదని చాలా సేపు వాదించారు. అయితే న్యాయమూర్తి మాత్రం ఇందుకు అంగీకరించలేదు. ఏఐసీటీఈ అకడమిక్ కేలండర్ సెమిస్టర్ విధానంలోనే ఉందని, పార్శ్వనాథ్ కేసు తీర్పులో నిర్దేశించిన షెడ్యూలునే ఏఐసీటీఈ జారీచేసిందని, దాని ప్రకారమే తరగతులు ఉంటాయని పేర్కొన్నారు. దాని ప్రకారం 75 రోజుల పనిదినాలు ఉండాలన్నారు. అలాగే ఇప్పుడు ఇచ్చే ఆదేశాలు అందరికీ వర్తింపజేయాల్సి ఉంటుందన్నారు. దీనికి పిటిషనర్లు వాదిస్తూ.. తమను చివరి క్షణంలో కౌన్సెలింగ్ నుంచి పక్కనబెట్టారని, దీనిపై హైకోర్టు నుంచి తమకు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకున్నా ప్రభుత్వం, వర్సిటీ పట్టించుకోలేదని వివరించారు. వాదనలన్నీ విన్న ధర్మాసనం.. ఏఐసీటీఈ నిబంధనల మేరకు కొత్త షెడ్యూల్‌తో బుధవారం నాడు కోర్టుకు రావాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.
కొత్త షెడ్యూల్‌కు కాలేజీలు సిద్ధం
సాక్షి, హైదరాబాద్: రోజుకు రెండు గంటల పాటు అదనంగా తరగతులు నిర్వహించేలా రివైజ్డ్ షెడ్యూలును సుప్రీంకోర్టుకు అందజేయాలని పిటిషన్ వేసిన కాలేజీల యాజమాన్యాలు నిర్ణయించాయి. ఏఐసీటీఈ నిబంధనల ప్రకారమే షెడ్యూల్‌ను రూపొందించి తీసుకురావాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగా జనవరి 15 నాటికి మొదటి సెమిస్టర్ పూర్తి చేసేలా షెడ్యూలును రూపొందనుంది. ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం మొదటి సెమిస్టర్‌లో 525 గంటలపాటు బోధన జరగాలి. ప్రస్తుతం రోజుకు 7 గంటల పాటు ఏడు పీరియడ్లలో బోధన కొనసాగుతోంది. అయితే ప్రస్తుతం రెండో కౌన్సెలింగ్‌ను నవంబర్ 14 వ రకు పూర్తి చేసి, 15వ తేదీ నుంచి తరగతులు ప్రారంభించాల్సి ఉంటుంది. దీంతో జనవరి 15 నాటికి 60 రోజుల పనిదినాలు మాత్రమే ఉంటాయి. వాటిల్లో రోజుకు 9 గంటలపాటు, 9 పీరియడ్లతో బోధన చేపట్టడం ద్వారా 525 పనిగంటలు పూర్తవుతాయని కాలేజీ యాజమాన్యాల ప్రతినిధి తిరుమల్‌రావు పేర్కొన్నారు. ఈ మేరకు షెడ్యూలును రూపొందించి బుధవారం కోర్టుకు సమర్పించనున్నట్లు వెల్లడించారు.
ఇక ఫస్టియర్‌లో సెమిస్టర్ విధానమే!
సాక్షి, హైదరాబాద్: జేఎన్టీయూ హైదరాబాద్ పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో మొదటి సంవత్సరంలో ఇక సెమిస్టర్ విధానం అమల్లోకి రానుంది. ప్రస్తుతం ఈ కాలేజీల్లో ద్వితీయ సంవత్సరం నుంచే సెమిస్టర్ విధానం ఉంది. మొదటి సంవత్సరంలో మిడ్ పరీక్షలు, వార్షిక పరీక్షలను మాత్రమే నిర్వహిస్తున్నారు. అయితే ఏఐసీటీఈ నిబంధ నల ప్రకారం ఇంజనీరింగ్‌లో వార్షిక విధానం లేదని, సెమిస్టర్ విధానమే ఉందని, ప్రథమ సంవత్సరంలోనూ సెమిస్టర్ విధానాన్ని అమలు చేయాల్సిందేనని సుప్రీంకోర్టు తాజాగా పేర్కొన్న నేపథ్యంలో జేఎన్టీయూ దీన్ని పాటించాల్సి ఉంది. దీనిపై వర్సిటీ వర్గాలు కూడా దృష్టి సారించినట్లు తెలిసింది.