
మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాల్సిందే: సుప్రీం
పురపాలక, నగర పాలక ఎన్నికలు నిర్వహించాలన్న రాష్ట్ర హైకోర్టు తీర్పుపై స్టే విధించాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
సాక్షి, న్యూఢిల్లీ: పురపాలక, నగర పాలక ఎన్నికలు నిర్వహించాలన్న రాష్ట్ర హైకోర్టు తీర్పుపై స్టే విధించాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. రాజ్యాంగ అనివార్యత దృష్ట్యా ఎన్నికలు నిర్వహించాల్సిందేనని స్పష్టం చేసింది. నాలుగు వారాల్లోగా మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించాలంటూ ఫిబ్రవరి 3న హైకోర్టు తీర్పు ఇవ్వడం తెలిసిందే. దీనిపై స్టే కోరుతూ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించగా ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది.
విభజన నేపథ్యంలో ప్రస్తుతానికి ఎన్నికలు నిర్వహించలేమని, మార్చి, ఏప్రిల్ నెలల్లో పరీక్షలున్నందున అప్పుడు కూడా ఎన్నికలు అసాధ్యమని ప్రభుత్వం తరఫు న్యాయవాది విన్నవించారు. దానితో ధర్మాసనం ఏకీభవించలేదు. మున్సిపాలిటీల కాలపరిమితి 2010 సెప్టెంబర్‌తోనే ముగిసిందని, నాలుగేళ్ల నుంచీ ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించింది. రాజ్యాంగ అనివార్యత దృష్ట్యా హైకోర్టు తీర్పును సమర్థిస్తున్నట్టు స్పష్టం చేసింది. దీంతో ఎన్నికల నిర్వహణపై మార్చి 3లోగా హైకోర్టులో స్పష్టత ఇవ్వాల్సిన అనివార్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఏర్పడింది.