తెలంగాణ రివ్యూ పిటిషన్‌ను తిరస్కరణ
Published Wed, Aug 24 2016 7:22 PM | Last Updated on Sun, Apr 7 2019 3:35 PM
ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి ఆస్తులను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు జనాభా దామాషాలో పంచుకోవాలని గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. హైదరాబాద్‌లో ఉన్న ఉన్నత విద్యామండలి ఖాతాలు తెలంగాణకు చెందుతాయంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్‌ఉన్నత విద్యామండలి గతంలో సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. జనాభా ప్రాతిపదికన ఇరు రాష్ట్రాల మధ్య పంచుకోవాలని సుప్రీం కోర్టు మార్చి 18న తీర్పు ఇచ్చింది. రెండు నెలల్లోపు పరిష్కరించుకోలేనిపక్షంలో కేంద్ర ప్రభుత్వం కమిటీ ద్వారా పరిష్కారం చేపట్టాలని ఆదేశించింది. ఈనేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ఉన్నత విద్యామండలి ఏప్రిల్ 18న రివ్యూ పిటిషన్లు దాఖలు చేశాయి. ఇందులో ఒక పిటిషన్‌ను ఈనెల 10న జస్టిస్ గోపాలగౌడ, జస్టిస్ అరుణ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం తిరస్కరించింది. మరో పిటిషన్‌ను మంగళవారం ఛాంబర్‌లో పరిశీలించిన ధర్మాసనం.. ఈ తీర్పులో సమీక్షించదగిన అంశాలేవీ లేవంటూ పిటిషన్‌ను తోసిపుచ్చింది.
Advertisement