సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ గవర్నర్‌కు నోటీసులు జారీ చేయబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తన వద్దకు పంపిన పలు బిల్లులపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా నెలల తరబడి పెండింగ్‌లో పెట్టారంటూ రాష్ట్ర గవర్నర్‌పై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం ప్రధానన్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ పీఎస్ నరసింహా, జస్టిస్ జేబీ పార్డీవాలాతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పంజాబ్ రాష్ట్రానికి సంబంధించి కూడా ఇదే తరహా అంశాన్ని విచారణకు తీసుకున్నారని తెలంగాణ ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే గుర్తుచేశారు.
ఈ నేపథ్యంలో గవర్నర్ సెక్రటరీ, కేంద్రానికి నోటీసులు జారీచేయాలని ధర్మాసనాన్ని కోరారు. అయితే గవర్నర్‌కు నోటీసులు ఇవ్వబోమని, ప్రస్తుతం కేంద్రానికి మాత్రమే జారీచేస్తామని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ స్పష్టం చేశారు. సాధారణంగా గవర్నర్‌కు నోటీసులు జారీచేయమని తెలిపారు. గవర్నర్‌కు కాకుండా సెక్రటరీకి జారీచేయాలని దవే మరోసారి కోరారు. తెలంగాణ గవర్నర్ బిల్లులు పెండింగ్‌లో ఉంచారని దాఖలైన ఈ పిటిషన్‌లో నోటీసులు జారీ చేయొచ్చా అని సీజేఐ ప్రశ్నించగా, అవసరం లేదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు.
గవర్నర్ లాంటి రాజ్యాంగ వ్యవస్థలకు నోటీసులు జారీ చేయాల్సిన అవసరం లేదని మెహతా స్పష్టం చేశారు. దీంతో గవర్నర్‌కు నోటీసులు జారీ చేయడంలేదని జస్టిస్ పీఎస్ నరసింహా పేర్కొన్నారు. తాను ఇక్కడే ఉన్నందున పిటిషన్ కాపీని తనకు సర్వ్ చేయాలని మెహతా ధర్మాసనాన్ని కోరారు. అనంతరం ధర్మాసనం కేంద్రానికి నోటీసులు జారీచేస్తూ తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment