
‘పద్మశ్రీ’ కేసులో మోహన్‌బాబుకు ఊరట
హైకోర్టు ఆదేశాలపై మధ్యంతర స్టే ఇచ్చిన సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: సినీనటుడు మంచు మోహన్‌బాబుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని తిరిగి భారత రాష్ట్రపతికి అప్పగించాలని... ఇందుకు కేంద్ర హోంశాఖ తగిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు మధ్యంతర స్టే ఇచ్చింది. ‘పద్మశ్రీ’ని మోహన్‌బాబు పేరుకు ముందు సినిమాల్లో వాడుతున్నారని, ఇది వాణిజ్య అవసరాలకు వినియోగించడమేనని బీజేపీ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దానిని విచారించిన హైకోర్టు.. ‘పద్మశ్రీ’ని తిరిగి అప్పగించేలా కేంద్ర హోంశాఖ చర్యలు తీసుకోవాలని తీర్పు ఇచ్చింది.
దాంతో మోహన్‌బాబు గత శుక్రవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ హెచ్.ఎల్.దత్తు, జస్టిస్ ఎస్.ఎ.బాబ్డేలతో కూడిన ధర్మాసనం... ఎక్కడా పేరుకు ముందు ‘పద్మశ్రీ’ని వాడకూడదని, ఈ మేరకు ప్రమాణ పత్రం దాఖలు చేయాలని ఆదేశించింది. దీనిపై మోహన్‌బాబు ప్రమాణ పత్రం దాఖలు చేయగా.. హైకోర్టు ఆదేశాలపై మధ్యంతర స్టే ఇస్తూ సుప్రీంకోర్టు గురువారం ఆదేశాలు జారీచేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని పేర్కొంది. కేసులో ప్రతివాదులైన కేంద్ర హోంశాఖను ఈ అఫిడవిట్‌పై సమాధానం కోరుతూ నోటీసులు జారీ చేసింది.