స్వలింగ సంపర్కం నేరమే: సుప్రీంకోర్టు | Supreme Court says Homosexuality an offence | Sakshi
Sakshi News home page

స్వలింగ సంపర్కం నేరమే: సుప్రీంకోర్టు

Published Thu, Dec 12 2013 12:57 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM

స్వలింగ సంపర్కం నేరమే: సుప్రీంకోర్టు - Sakshi

స్వలింగ సంపర్కం నేరమే: సుప్రీంకోర్టు

    ఇలాంటి అసహజమైన లైంగిక చర్యలు చట్టవిరుద్ధం
     ఐపీసీ సెక్షన్ 377కి సమర్థన   ఢిల్లీ హైకోర్టు తీర్పు కొట్టివేత


స్వలింగ సంపర్కులకు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్వలింగ సంపర్కం నేరమని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఈ మేరకు భారతీయ శిక్షాస్మృతి(ఐపీసీ)లో ఉన్న సెక్షన్ 377ను సమర్థిస్తూ న్యాయమూర్తులు జస్టిస్ జి.ఎస్.సింఘ్వీ, జస్టిస్ ఎస్.జె.ముఖోపాధ్యాయలతో కూడిన ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించింది. స్వలింగ సంపర్కం నేరం కాదంటూ 2009లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అయితే స్వలింగ సంపర్కాన్ని చట్టబద్ధం చేయాలా వద్దా అనే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత పార్లమెంటుదేనని పేర్కొంది. ఐపీసీ సెక్షన్ 377ను తొలగించే అధికారం పార్లమెంటుదేనని, అప్పటివరకు దానికి చట్టబద్ధత ఉంటుందని స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో ఇలాంటి అసహజ లైంగిక కార్యకలాపాలను ఈ న్యాయస్థానం చట్టబద్ధం చేయలేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

 వివాదాస్పద అంశాలపై విదేశీ కోర్టుల తీర్పులను దేశంలో గుడ్డిగా అమలు చేయడం కుదరదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దేశ జనాభాలో నామమాత్రంగా ఉన్న స్వలింగ సంపర్కుల హక్కులను కాపాడాలన్న ఆతృతతోపాటు ఐపీసీ సెక్షన్ 377 వారి గోప్యత , స్వేచ్ఛా హక్కులను అతిక్రమిస్తుందని ప్రకటించాలన్న ఉద్దేశంతో ఢిల్లీ హైకోర్టు విదేశీ కోర్టుల తీర్పులపై ఎక్కువగా ఆధారపడిందని సుప్రీంకోర్టు పేర్కొంది. విదేశీ కోర్టుల తీర్పులు స్వలింగ సంపర్కుల హక్కులకు సంబంధించిన వివిధ అంశాలను ప్రస్తావించినప్పటికీ భారత పార్లమెంటు రూపొందించిన చట్టాల రాజ్యాంగబద్ధతను నిర్ణయించడంలో విదేశీ తీర్పులను తాము గుడ్డిగా అమలు చేయజాలమని స్పష్టం చేసింది. గత 150 ఏళ్లలో కేవలం 200 మందిలోపు వ్యక్తులనే ఐపీసీ సెక్షన్ 377లోని నేరాల కింద విచారించిన విషయాన్ని ఢిల్లీ హైకోర్టు మరచిపోయి ఈ సెక్షన్ రాజ్యాంగంలోని సెక్షన్ 14, 15, 21 నిబంధనలకు విరుద్ధంగా ఉందని తీర్పిచిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సెక్షన్ 377ను తొలగించాలని 172వ న్యాయ కమిషన్ నివేదిక సిఫార్సు చేసినా పార్లమెంటు ఆ పని చేయలేదని సుప్రీంకోర్టు తన తీర్పులో గుర్తుచేసింది.

 సెక్షన్ 377 సవాల్‌తో మొదలు...

 అసహజ శృంగార చర్యలు, స్వలింగ సంపర్కం నేరమని, అందుకు జీవితఖైదు వరకు శిక్ష విధించవచ్చని ఐపీసీ సెక్షన్ 377 చెబుతోంది. ఈ నేపథ్యంలో ఈ సెక్షన్‌ను సవాల్ చేస్తూ, స్వలింగ సంపర్కాన్ని చట్టబద్ధం చేయాలని కోరుతూ నాజ్ ఫౌండేషన్ ఢిల్లీ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఇద్దరు వయోజనులు పరస్పర సమ్మతితో ఏకాంతంలో చేసుకునే స్వలింగ సంపర్కం నేరం కాదంటూ జూలై 2, 2009న తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ బీజేపీ సీనియర్ నేత బి.పి.సింఘాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇలాంటి అసహజ లైంగిక చర్యలు అనైతికం, చట్టవిరుద్ధం, భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు వ్యతిరేకమని పేర్కొన్నారు. అఖిల భారత ముస్లిం లా బోర్డు, ఉత్కల్ క్రైస్తవ మండలి, అపోస్టోలిక్ చర్చిల కూటమి వంటి మతపరమైన సంస్థలు కూడా ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేశాయి.

ఈ వ్యాజ్యాలపై గతేడాది ఫిబ్రవరి 15 నుంచి రోజువారీ పద్ధతిలో సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ అంశంపై అభిప్రాయం తెలియజేయాలని విచారణ సందర్భంగా కేంద్రాన్ని ఆదేశించింది. అంతేకాకుండా ఇలాంటి ముఖ్యమైన అంశాలను పార్లమెంటులో చర్చించకపోవడంపై ఆందోళన వ్యక్తంచేసింది. బ్రిటిష్ వలస పాలన ఫలితంగా స్వలింగ సంపర్కుల వ్యతిరేక చట్టం వచ్చిందని, కానీ భారతీయ సమాజం స్వలింగ సంపర్కాన్ని భరిస్తూ వచ్చిందని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. స్వలింగ సంపర్కాన్ని నేరరహితం చేయడానికి తాము సానుకూలమేనని పేర్కొంది. దేశంలో 25 లక్షల మంది స్వలింగ సంపర్కులు ఉన్నట్టు అంచనా అని, వారిలో ఏడు శాతం మందికి(దాదాపు 1.75 లక్షలు) హెచ్‌ఐవీకి సోకిందని నివేదించింది.

 ఢిల్లీ హైకోర్టులో ఈ అంశంపై విచారణ జరిగినప్పుడు హోంశాఖ, ఆరోగ్యశాఖలు సెక్షన్ 377పై విరుద్ధ అభిప్రాయాలు వ్యక్తంచేశాయి. సెక్షన్ 377 కొనసాగించాలని హోంశాఖ పేర్కొనగా, దానిని తొలగించాలని ఆరోగ్యశాఖ కోరింది. అయితే సుప్రీంకోర్టులో మాత్రం కేంద్రం దీనిపై ఒకే వైఖరికి కట్టుబడింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. గతేడాది మార్చిలో తన తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా కిక్కిరిసిన కోర్టు హాలులో దీనిపై తీర్పు వెలువరించింది. ఈ తీర్పుతో స్వలింగ సంపర్కులు నిరాశలో మునిగిపోయారు. సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామని స్వలింగ సంపర్కుల హక్కుల కార్యకర్తలు వెల్లడించారు.

 చారిత్రక అవకాశం పోయింది: ఏఎస్‌జీ

 రాజ్యాంగ విలువల్ని విస్తృతం చేయడానికి లభించిన చారిత్రక అవకాశం పోయిందని అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ) ఇందిరా జైసింగ్ వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు తీర్పుపై ఆమె స్పందిస్తూ.. స్వలింగ సంపర్కులకు మద్దతు ప్రకటించారు. స్వలింగ సంపర్కానికి వ్యతిరేకంగా ఐపీసీలో ఉన్న నిబంధన, మధ్యయుగం నాటి మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తోందన్నారు. ఎన్నో అంశాలు, విధానాలపై సమీక్ష జరిపిన సుప్రీంకోర్టు.. స్వలింగ సంప్కరంపై నిర్ణయాన్ని పార్లమెంటుకు వదలిపెట్టడం ఆశ్చర్యం కలిగించిందని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement