offence
-
పెదవుల పై ముద్దు పెట్టుకోవడం అసహజ నేరం కాదు
kissing on lips and fondling are not unnatural offences : మైనర్ బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తికి బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అంతేకాదు ఐపీసీ సెక్షన్ 377 ప్రకారం పెదవుల పై ముద్దు పెట్టుకోవడం, ముద్దుచేయడం వంటివి అసహజ లైంగిక నేరాలు కాదని బాంబే ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు 14 ఏళ్ల బాలుడి తండ్రి చేసిన పోలీసు ఫిర్యాదు మేరకు గతేడాది అరెస్టయిన వ్యక్తికి జస్టిస్ అనూజా ప్రభుదేసాయి బెయిల్ మంజూరు చేశారు. కేసు పూర్వాపరాల ప్రకారం....ఆ బాలుడి తండ్రి అల్మారాలో డబ్బు కనిపించకపోవడంతో కొడుకుని ఆరాతీశాడు. అప్పుడు ఆ బాలుడు ఓలా పార్టీ' రీఛార్జ్ కోసం ముంబైలోని శివారు ప్రాంతంలో సదరు నిందితుడి దుకాణానికి వెళ్లేవాడినని, అతనికి ఇచ్చానని మైనర్ చెప్పాడు. ఐతే ఓ రోజు రీచార్జ్ చేయించుకునేందుకు వెళ్లినప్పుడూ నిందితుడు తన పెదవులపై ముద్దుపెట్టి, తన ప్రైవేట్ పార్ట్‌లను తాకాడని ఆ బాలుడు ఆరోపించాడు. దీంతో ఆ బాలుడు తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు సదరు నిందితుడి పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఐతే జస్టిస్ ప్రభుదేసాయి సదరు నిందితుడికి బెయిల్ మజూరు చేస్తూ..బాలుడికి నిర్వహించిన వైద్య పరీక్షలో లైంగిక వేధింపుల వాంగ్మూలం మద్దతు ఇవ్వలేదని పేర్కొన్నారు. అంతేకాదు ప్రస్తుత కేసులో అసహజ లైంగిక అంశం ప్రాథమికంగా వర్తించదని న్యాయమూర్తి తెలిపారు. అంతేకాదు నిందితుడు ఇప్పటికే ఏడాది పాటు కస్టడీలో ఉన్నాడని, అందువల్ల ఈ కేసు విషయమే ఇప్పట్లో విచారణ ప్రారంభమయ్యే అవకాశం లేదని హైకోర్టు పేర్కొంది. (చదవండి: వైద్య రహస్యం చెప్పలేదని.. ఏడాదిన్నరపాటు గదిలో బంధించి..) -
ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఇక తాట తీసుడే
పాట్నా: భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు రాజ్యాంగంలో కల్పించారు. అయితే ఈ హక్కు ఉందని చెప్పి కొందరు ఇష్టారీతిన ప్రభుత్వాన్ని, ప్రజాప్రతినిధులను తీవ్రరూపంలో విమర్శించడం వివాదమవుతోంది. ఈ రకమైన విమర్శలు సామాజిక మాధ్యమాల వేదికగా తీవ్రంగా ఉంది. ఇది పలుసార్లు తీవ్ర వివాదాలకు దారి తీసే పరిస్థితి ఏర్పడింది. గతంలో ఇలాంటి ఘటనలు ఎన్నో చోటుచేసుకున్నాయి. ఇకపై ఇలాంటివి బిహార్‌లో చెల్లవు. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి విమర్శలపై ఉక్కుపాదం మోపనుంది. ఈ సందర్భంగా అన్ని విభాగాలకు నోటీసులు పంపించారు. ఇన్నాళ్లు వస్తున్న విమర్శలను సహించం. ఇకపై సహించబోమని ఐజీ నయ్యర్ హస్ నయిన్ ఖాన్ తెలిపారు. ప్రభుత్వం, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలపై వివాదాస్పద విమర్శలు.. అసభ్య మాటలు వస్తే చట్టం ప్రకారం నేరమని ఆయా విభాగ శాఖ అధికారులకు ఐజీ గుర్తుచేశారు. వారిపై చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉందని తెలిపారు. సంస్థలయినా.. వ్యక్తులైనా వారిపై కఠిన చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేశారు. వారిపై న్యాయపరమైన విచారణ చేసి శిక్ష విధించవచ్చని వివరించారు. ఈ మేరకు ఈనెల 21వ తేదీన ఐజీ ఆయా విభాగాల కార్యదర్శులకు లేఖ రాశారు. విమర్శించే వారిపై ఉక్కుపాదం మోపుతామని బిహార్ ప్రభుత్వం హెచ్చరించింది. ఇకపై సోషల్ మీడియాలోనైనా.. ఇక ఎక్కడైనా ఆచుతూచి మాట్లాడాలని పరోక్షంగా హితవు పలికింది. అయితే ఈ ఉత్తర్వులను ప్రతిపక్షాలు తప్పుపట్టాయి. విమర్శలకు బదులివ్వకుండా ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నారని ఆర్జేడీ, జనతా దళ్ తెలిపాయి. నిర్వేదంతో ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నాయి. -
బానిసత్వం నేటికీ నేరం కాదా?
బానిసత్వం ప్రతిచోటా చట్టవిరుద్ధమే అంటూ న్యూయార్క్ టైమ్స్ పదేపదే ప్రపంచ ఆర్థిక వేదికపై ప్రవచిస్తూనే ఉంది. గత 40 సంవత్సరాలుగా దీన్ని ఒక మంత్రంలాగా ఆ పత్రిక జపిస్తూనే ఉంది. ఈ ప్రకటనలోని సత్యాన్ని దశాబ్దాలుగా ప్రపంచం అంగీకరిస్తూనే ఉంది. కానీ మేం చేసిన తాజా పరిశోధన బట్టి చూస్తే మన ప్రపంచంలోని దాదాపు సగం దేశాలకు పైగా.. మనిషిని బానిసగా చేసుకోవడం నేరం అని నేటికీ చట్టాలు చేయకుండా గడిపేస్తున్నాయి. ప్రజలపై చట్టబద్ధ యాజమాన్యం కలిగి ఉండటాన్ని గత రెండు శతాబ్దాల క్రమంలో అన్ని దేశాలు నిషేధించాయి. కానీ అనేక దేశాల్లో ప్రజలపై యాజమాన్య హక్కు కలిగి ఉండటం అనేది ఒక నేరంగా నేటికీ గుర్తించడం లేదు. ప్రపంచంలోని దాదాపు సగం దేశాలు బానిసత్వం లేక బానిస వ్యాపారాన్ని చేస్తే జరిమానా విధిస్తూ క్రిమినల్ లాను నేటికీ రూపొందించలేదు. 94 దేశాల్లో మరొక మనిషిని బానిసగా ఉంచుకున్నందుకు న్యాయవిచారణ జరిపి శిక్షలు విధించడం జరగటం లేదు. ప్రపంచమంతటా బానిసత్వం చట్టవిరుద్ధ మని ప్రకటించారని ఆధునిక బానిసత్వ వ్యతిరేక ఉద్యమం ప్రకటించిన అత్యంత ప్రాథమిక అంచనాలను మేం తాజాగా చేసిన పరిశోధన తోసిపుచ్చుతోంది. ఈ పరిశోధనలో బయటపడిన వాస్తవాల ఆధారంగా, 2030 నాటికి ఆధునిక బానిసత్వాన్ని నిర్మూలించాలనే లక్ష్యంతో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రయత్నాలపై మరోసారి దృష్టి పెట్టడానికి వీలవుతోంది. నిర్బంధ శ్రమ, మనుషుల అక్రమ తరలింపు, బానిసత్వాన్ని ఆచరిస్తున్న సంస్థల కార్యకలాపాలు, బానిస వ్యాపారం, బానిసత్వ భావన కూడా ఆధునిక బానిసత్వంలో భాగమే అవుతుంది. ప్రపంచంలోని 96 దేశాల్లో మనుషుల అక్రమ తరలింపు వ్యతిరేక చట్టాలు ఏదో రకంగా అమలులో ఉన్నాయి కానీ మనుషుల దోపిడీ రకాలను నిషేధించడంలో చాలా దేశాలు విఫలమవుతున్నాయి. మా పరిశోధనలో తేలిన వివరాల ప్రకారం.. 1. ప్రపంచంలోని 94 దేశాలు లేక మొత్తం దేశాల్లో 49 శాతం బానిసత్వాన్ని నిషేధిస్తున్న చట్టాలను ఇంకా రూపొందించలేదు. 2. 112 దేశాలు లేక ప్రపంచ దేశాల్లో 58 శాతం నిర్బంధ శ్రమకు శిక్ష విధించే శాసన నిబంధనలను అమలుపర్చలేదు. 3. 180 దేశాలు లేక ప్రపంచ దేశాల్లో 93 శాతం బానిసత్వాన్ని పాటించడం నేరంగా ప్రకటించే చట్టాలను రూపొందించలేదు. 4. 170 దేశాలు లేక ప్రపంచ దేశాల్లో 88 శాతం బానిసత్వానికి సమానమైన కార్యకలాపాలను సాగిస్తున్న సంస్థలను నేరస్త సంస్థలుగా ప్రకటించలేదు. ఈ అన్నిదేశాల్లో, మానవ దోపిడీకి సంబంధించి అత్యంత తీవ్ర విధానాలను పాటిస్తున్న ప్రజలను, సంస్థలను శిక్షించడానికి ఏవిధమైన నేర న్యాయ శాసనాలనూ ఇంకా రూపొందించలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే బానిసత్వం చట్టవిరుద్ధం అనే భావన ఈనాటికీ సమాజ అనుభవంలోకి రావడం లేదు. బానిసత్వ క్లుప్త చరిత్ర ఆధునిక చరిత్రలో బ్రిటిష్ బానిసత్వ నిషేధ ఉద్యమం బానిస వ్యాపారానికి అంతం పలికింది. బానిస వ్యాపారాన్ని చట్టబద్ధమైన వ్యాపారంగా అనుమతిస్తున్న చట్టాలను ఇది నిషేధించింది. 19వ శతాబ్దిలో బానిస వ్యాపారాన్ని నేరంగా భావించే చట్టాలను రూపొందించాలని ప్రభుత్వాలు అడిగేవి కాదు. దానికి బదులుగా బానిస వ్యాపారాన్ని అనుమతించే ఏ చట్టాన్నయినా రద్దు చేయాలని మాత్రమే అవి భావించేవి. తర్వాత 1926లో నానాజాతి సమితి స్లేవరీ కన్వెన్షన్‌ని రూపొందించింది. ఇది బానిసత్వాన్ని అనుమతించే ఏ చట్టాన్నయినా రద్దు చేయాల్సిందిగా ఆయా దేశాలను కోరింది. కానీ తర్వాత వచ్చిన అంతర్జాతీయ మానవహక్కుల వ్యవస్థ దీన్ని పూర్తిగా మార్చివేసింది. 1948 నుంచి దేశాలకు బానిసత్వ విధానాలను రద్దు చేయడం కాకుండా పూర్తిగా నిషేధించాలని కోరడం మొదలైంది. దీంతో బానిసత్వాన్ని అనుమతించే ఏ చట్టాన్నయినా ఉంచుకోకుండా జాగ్రత్తపడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై పడింది. ఒక వ్యక్తిని బానిసగా చేసుకునే విధానాన్ని నిలిపివేసే చట్టాలను ప్రభుత్వాలు రూపొందించాల్సి వచ్చింది. కానీ చాలా ప్రభుత్వాలు బానిసత్వాన్ని పాటించడం నేరం అనేలా చట్టాలు అమలుపర్చలేదని తెలుస్తోంది. దాదాపు 90 సంవత్సరాలుగా అంటే 1926 నుంచి 2016 వరకు.. ఒక వ్యక్తిపై మరో వ్యక్తి ఆజమాయిషీకి, నియంత్రణకు వీలిస్తున్న బానిసత్వం ఉనికిలో లేదని ఎందుకంటే వ్యక్తులపై యాజ మాన్య హక్కులను అనుమతిస్తున్న అన్ని చట్టాలను ప్రభుత్వాలు రద్దు చేసేశాయనే అభిప్రాయం బలపడిపోయింది. బానిసత్వం ఉనికిలో లేకుండా చట్టాలు వచ్చేశాయనే స్పృహ అందరిలో బలపడిపోయింది. బానిసత్వమే ఉనికిలో లేకుండా పోయాక, దాన్ని నిషేధించే చట్టాలను ఆమోదించడంలో హేతువు లేదనే ఆలోచన కూడా వచ్చేసింది. అయితే ఈ రకం ఆలోచనకు 1926లో బానిసత్వంపై మొదటగా ఇచ్చిన నిర్వచనం మలాం పూసింది. ఈ నిర్వచనం ప్రకారం ఒక వ్యక్తికి చెందిన కొన్ని లేక అన్ని అధికారాలనూ మరొకరి యాజమాన్యానికి కట్టబెట్టే స్థితిని బానిసత్వం అని చెప్పాల్సి ఉంటుంది. అయితే ఈ నిర్వచనం ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చట్టబద్ధంగా సొంతం చేసుకునే పరిస్థితులకు మాత్రమే అన్వయమవుతోందని ప్రపంచవ్యాప్తంగా న్యాయస్థానాలు గుర్తించాయి. కాబట్టి బానిసత్వంపై ఈ నిర్వచనంలోని భాషను పరిశీలిద్దాం. సంప్రదాయికంగా ప్రజలపై చట్టపరమైన యాజమాన్యం అమలయ్యే వ్యవస్థల ద్వారా బానిసత్వాన్ని రూపొందిస్తూ వచ్చారు. దీని ప్రకారం కొందరి హక్కులు మరొకరి ఆస్తిగా చలామణి కావడానికి చట్టమే అవకాశమిచ్చింది. కానీ కొత్తగా గుర్తించిన బానిసత్వపు పరిస్థితి అనేది చట్టంతో పనిలేకుండా వాస్తవంగానే అమలవుతున్న బానిసత్వం గురించి చెబుతోంది. దీంట్లో చట్టబద్ధంగా వ్యక్తిపై యాజమాన్యం అనేది కనిపిం చదు కానీ ఒక వ్యక్తి మరొకరిపై యాజమాన్య అధికారాన్ని చలాయించగలడు. అది మరొక వ్యక్తికి చెందిన బానిస స్థితినే సూచిస్తుంది. ఈ నేపథ్యంలో బానిసత్వాన్ని చట్టబద్ధంగా నిర్మూలించినప్పటికీ బానిసత్వం మరొక రూపంలో ప్రపంచంలో అమలవడానికి వీలుందనే అభిప్రాయం బలపడుతోంది. వ్యక్తిని అధికారబలంతో చిత్రహింస పెట్టడం అనేది 18వ శతాబ్దంలోనే చట్టం ద్వారా నిషేధించినప్పటికీ, అణగదొక్కడం అనేది చట్టవిరుద్ధమే అయినప్పటికీ నేటికీ అమలవుతూనే ఉందని చెప్పాలి. వ్యాసకర్త రైట్స్ ల్యాబ్ అసోసియేట్ డైరెక్టర్, అసోసియేట్ ప్రొఫెసర్, నాటింగ్‌హామ్ వర్సిటీ -
భార్యకు ఇష్టం లేకపోతే నేరమే!
సాక్షి, న్యూఢిల్లీ : భార్యకు ఇష్టం లేకుండా బలవంతపు శృంగారానికి పాల్పడితే.. దానిని అత్యాచారంగా భావించవచ్చా? దేశవ్యాప్తంగా గత కొంత కాలం నుంచి విభిన్న వర్గాల మధ్య జరుగుతున్న చర్చ ఇది. ఈ నేపథ్యంలో మారిటల్ రేప్ (వైవాహిక అత్యాచారం)ను సమర్థిస్తూ..వ్యతిరేకిస్తూ దాఖలైన అభ్యర్థనల విచారిస్తున్న ఢిల్లీ హైకోర్టు.. ఈ అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పెళ్లి అనగానే భార్య ఎల్లవేళల భర్తతో శారీరక సంబంధానికి సిద్ధంగా ఉంటుందని అర్థం కాదని, వివాహం వంటి సంబంధాల్లో భార్యాభర్తలిద్దరికీ తమకు నచ్చనప్పుడు శారీకర సంబంధాలను నిరాకరించే హక్కు ఉంటుందని న్యాయస్థానం పేర్కొంది. ‘వివాహం అనగానే భార్య ఎల్లవేళలా సిద్ధంగా ఉండి.. భర్తతో సంబంధాలకు సమ్మతి తెలుపుతుందని అర్థం కాదు. భార్య సమ్మతితోనే భర్త ఈ సంబంధాన్ని కొనసాగించాల్సి ఉంటుంది’ అని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గీతా మిట్టల్, సీ హరిశంకర్‌తో కూడిన ధర్మాసనం పేర్కొంది. భాగస్వామి లైంగిక హింస విషయంలో బలవంతపెట్టడం, భయపెట్టడం వంటి చర్యలను మాత్రమే నేరంగా పరిగణించాలని, అలాంటివి లేనప్పుడు దీనిని నేరంగా పరిగణించలేమని మారిటల్ రేప్ అంశాన్ని వ్యతిరేకిస్తున్న పురుషుల సంక్షేమ ట్రస్ట్ అనే ఎన్జీవో సంస్థ వాదించగా.. ఈ వాదనతో న్యాయస్థానం ఏకీభవించలేదు. లైంగిక దాడి కోసం బలవంతపెట్టారా? గాయాలయ్యాయా అని చూడాల్సి అవసరం ఇప్పుడు లేదని, రేప్ నిర్వచనం ఇప్పుడు పూర్తిగా మారిపోయిందని ధర్మాసనం పేర్కొంది. ‘రేప్ కోసం బలవంతపెట్టడమనేది కచ్చితమైన షరతు ఏమీ కాదు. భార్యను ఆర్థిక ఇబ్బందులకు గురిచేసి.. శృంగారంలో పాల్గొంటేనే గృహావసరాలు, పిల్లల ఖర్చుల కోసం డబ్బులు ఇస్తానని భర్త ఒత్తిడి చేయవచ్చు. తప్పనిసరి పరిస్థితుల్లో భార్య అందుకు ఒప్పుకున్నా.. ఆ తర్వాత ఆమె భర్తకు వ్యతిరేకంగా రేప్ కేసు పెట్టవచ్చు. అది జరిగే అవకాశముంది’ అని ధర్మాసనం పేర్కొంది. గృహహింస నిరోధక చట్టం, వివాహిత మహిళల వేధింపుల నిరోధక చట్టం, వేరుగా ఉంటున్న భార్యతో బలవంతపు శృంగారం నిరోధించే చట్టాలు ఇప్పటికే అమలులో ఉన్నాయని, ఈ నేపథ్యంలో భార్యతో శృంగారం నేరం కాబోదని పేర్కొంటున్న సెక్షన్ 375ను మార్చాల్సిన అవసరం ఏముందని మారిటల్ రేప్‌ను వ్యతిరేకిస్తున్న పిటిషనర్ వాదించగా.. ఇన్ని చట్టాల్లో పరిధిలో ఉన్నప్పుడు సెక్షన్ 375లో మాత్రం ఎందుకు మినహాయింపు ఇవ్వాలని ధర్మాసనం పిటిషనర్‌ను ప్రశ్నించింది. -
స్వలింగ సంపర్కం నేరమే: సుప్రీంకోర్టు
ఇలాంటి అసహజమైన లైంగిక చర్యలు చట్టవిరుద్ధం ఐపీసీ సెక్షన్ 377కి సమర్థన ఢిల్లీ హైకోర్టు తీర్పు కొట్టివేత స్వలింగ సంపర్కులకు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్వలింగ సంపర్కం నేరమని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఈ మేరకు భారతీయ శిక్షాస్మృతి(ఐపీసీ)లో ఉన్న సెక్షన్ 377ను సమర్థిస్తూ న్యాయమూర్తులు జస్టిస్ జి.ఎస్.సింఘ్వీ, జస్టిస్ ఎస్.జె.ముఖోపాధ్యాయలతో కూడిన ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించింది. స్వలింగ సంపర్కం నేరం కాదంటూ 2009లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అయితే స్వలింగ సంపర్కాన్ని చట్టబద్ధం చేయాలా వద్దా అనే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత పార్లమెంటుదేనని పేర్కొంది. ఐపీసీ సెక్షన్ 377ను తొలగించే అధికారం పార్లమెంటుదేనని, అప్పటివరకు దానికి చట్టబద్ధత ఉంటుందని స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో ఇలాంటి అసహజ లైంగిక కార్యకలాపాలను ఈ న్యాయస్థానం చట్టబద్ధం చేయలేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. వివాదాస్పద అంశాలపై విదేశీ కోర్టుల తీర్పులను దేశంలో గుడ్డిగా అమలు చేయడం కుదరదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దేశ జనాభాలో నామమాత్రంగా ఉన్న స్వలింగ సంపర్కుల హక్కులను కాపాడాలన్న ఆతృతతోపాటు ఐపీసీ సెక్షన్ 377 వారి గోప్యత , స్వేచ్ఛా హక్కులను అతిక్రమిస్తుందని ప్రకటించాలన్న ఉద్దేశంతో ఢిల్లీ హైకోర్టు విదేశీ కోర్టుల తీర్పులపై ఎక్కువగా ఆధారపడిందని సుప్రీంకోర్టు పేర్కొంది. విదేశీ కోర్టుల తీర్పులు స్వలింగ సంపర్కుల హక్కులకు సంబంధించిన వివిధ అంశాలను ప్రస్తావించినప్పటికీ భారత పార్లమెంటు రూపొందించిన చట్టాల రాజ్యాంగబద్ధతను నిర్ణయించడంలో విదేశీ తీర్పులను తాము గుడ్డిగా అమలు చేయజాలమని స్పష్టం చేసింది. గత 150 ఏళ్లలో కేవలం 200 మందిలోపు వ్యక్తులనే ఐపీసీ సెక్షన్ 377లోని నేరాల కింద విచారించిన విషయాన్ని ఢిల్లీ హైకోర్టు మరచిపోయి ఈ సెక్షన్ రాజ్యాంగంలోని సెక్షన్ 14, 15, 21 నిబంధనలకు విరుద్ధంగా ఉందని తీర్పిచిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సెక్షన్ 377ను తొలగించాలని 172వ న్యాయ కమిషన్ నివేదిక సిఫార్సు చేసినా పార్లమెంటు ఆ పని చేయలేదని సుప్రీంకోర్టు తన తీర్పులో గుర్తుచేసింది. సెక్షన్ 377 సవాల్‌తో మొదలు... అసహజ శృంగార చర్యలు, స్వలింగ సంపర్కం నేరమని, అందుకు జీవితఖైదు వరకు శిక్ష విధించవచ్చని ఐపీసీ సెక్షన్ 377 చెబుతోంది. ఈ నేపథ్యంలో ఈ సెక్షన్‌ను సవాల్ చేస్తూ, స్వలింగ సంపర్కాన్ని చట్టబద్ధం చేయాలని కోరుతూ నాజ్ ఫౌండేషన్ ఢిల్లీ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఇద్దరు వయోజనులు పరస్పర సమ్మతితో ఏకాంతంలో చేసుకునే స్వలింగ సంపర్కం నేరం కాదంటూ జూలై 2, 2009న తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ బీజేపీ సీనియర్ నేత బి.పి.సింఘాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇలాంటి అసహజ లైంగిక చర్యలు అనైతికం, చట్టవిరుద్ధం, భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు వ్యతిరేకమని పేర్కొన్నారు. అఖిల భారత ముస్లిం లా బోర్డు, ఉత్కల్ క్రైస్తవ మండలి, అపోస్టోలిక్ చర్చిల కూటమి వంటి మతపరమైన సంస్థలు కూడా ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేశాయి. ఈ వ్యాజ్యాలపై గతేడాది ఫిబ్రవరి 15 నుంచి రోజువారీ పద్ధతిలో సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ అంశంపై అభిప్రాయం తెలియజేయాలని విచారణ సందర్భంగా కేంద్రాన్ని ఆదేశించింది. అంతేకాకుండా ఇలాంటి ముఖ్యమైన అంశాలను పార్లమెంటులో చర్చించకపోవడంపై ఆందోళన వ్యక్తంచేసింది. బ్రిటిష్ వలస పాలన ఫలితంగా స్వలింగ సంపర్కుల వ్యతిరేక చట్టం వచ్చిందని, కానీ భారతీయ సమాజం స్వలింగ సంపర్కాన్ని భరిస్తూ వచ్చిందని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. స్వలింగ సంపర్కాన్ని నేరరహితం చేయడానికి తాము సానుకూలమేనని పేర్కొంది. దేశంలో 25 లక్షల మంది స్వలింగ సంపర్కులు ఉన్నట్టు అంచనా అని, వారిలో ఏడు శాతం మందికి(దాదాపు 1.75 లక్షలు) హెచ్ఐవీకి సోకిందని నివేదించింది. ఢిల్లీ హైకోర్టులో ఈ అంశంపై విచారణ జరిగినప్పుడు హోంశాఖ, ఆరోగ్యశాఖలు సెక్షన్ 377పై విరుద్ధ అభిప్రాయాలు వ్యక్తంచేశాయి. సెక్షన్ 377 కొనసాగించాలని హోంశాఖ పేర్కొనగా, దానిని తొలగించాలని ఆరోగ్యశాఖ కోరింది. అయితే సుప్రీంకోర్టులో మాత్రం కేంద్రం దీనిపై ఒకే వైఖరికి కట్టుబడింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. గతేడాది మార్చిలో తన తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా కిక్కిరిసిన కోర్టు హాలులో దీనిపై తీర్పు వెలువరించింది. ఈ తీర్పుతో స్వలింగ సంపర్కులు నిరాశలో మునిగిపోయారు. సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామని స్వలింగ సంపర్కుల హక్కుల కార్యకర్తలు వెల్లడించారు. చారిత్రక అవకాశం పోయింది: ఏఎస్జీ రాజ్యాంగ విలువల్ని విస్తృతం చేయడానికి లభించిన చారిత్రక అవకాశం పోయిందని అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) ఇందిరా జైసింగ్ వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు తీర్పుపై ఆమె స్పందిస్తూ.. స్వలింగ సంపర్కులకు మద్దతు ప్రకటించారు. స్వలింగ సంపర్కానికి వ్యతిరేకంగా ఐపీసీలో ఉన్న నిబంధన, మధ్యయుగం నాటి మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తోందన్నారు. ఎన్నో అంశాలు, విధానాలపై సమీక్ష జరిపిన సుప్రీంకోర్టు.. స్వలింగ సంప్కరంపై నిర్ణయాన్ని పార్లమెంటుకు వదలిపెట్టడం ఆశ్చర్యం కలిగించిందని తెలిపారు.