బానిసత్వం ప్రతిచోటా చట్టవిరుద్ధమే అంటూ న్యూయార్క్ టైమ్స్ పదేపదే ప్రపంచ ఆర్థిక వేదికపై ప్రవచిస్తూనే ఉంది. గత 40 సంవత్సరాలుగా దీన్ని ఒక మంత్రంలాగా ఆ పత్రిక జపిస్తూనే ఉంది. ఈ ప్రకటనలోని సత్యాన్ని దశాబ్దాలుగా ప్రపంచం అంగీకరిస్తూనే ఉంది. కానీ మేం చేసిన తాజా పరిశోధన బట్టి చూస్తే మన ప్రపంచంలోని దాదాపు సగం దేశాలకు పైగా.. మనిషిని బానిసగా చేసుకోవడం నేరం అని నేటికీ చట్టాలు చేయకుండా గడిపేస్తున్నాయి. ప్రజలపై చట్టబద్ధ యాజమాన్యం కలిగి ఉండటాన్ని గత రెండు శతాబ్దాల క్రమంలో అన్ని దేశాలు నిషేధించాయి. కానీ అనేక దేశాల్లో ప్రజలపై యాజమాన్య హక్కు కలిగి ఉండటం అనేది ఒక నేరంగా నేటికీ గుర్తించడం లేదు. ప్రపంచంలోని దాదాపు సగం దేశాలు బానిసత్వం లేక బానిస వ్యాపారాన్ని చేస్తే జరిమానా విధిస్తూ క్రిమినల్ లాను నేటికీ రూపొందించలేదు. 94 దేశాల్లో మరొక మనిషిని బానిసగా ఉంచుకున్నందుకు న్యాయవిచారణ జరిపి శిక్షలు విధించడం జరగటం లేదు.
ప్రపంచమంతటా బానిసత్వం చట్టవిరుద్ధ మని ప్రకటించారని ఆధునిక బానిసత్వ వ్యతిరేక ఉద్యమం ప్రకటించిన అత్యంత ప్రాథమిక అంచనాలను మేం తాజాగా చేసిన పరిశోధన తోసిపుచ్చుతోంది. ఈ పరిశోధనలో బయటపడిన వాస్తవాల ఆధారంగా, 2030 నాటికి ఆధునిక బానిసత్వాన్ని నిర్మూలించాలనే లక్ష్యంతో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రయత్నాలపై మరోసారి దృష్టి పెట్టడానికి వీలవుతోంది. నిర్బంధ శ్రమ, మనుషుల అక్రమ తరలింపు, బానిసత్వాన్ని ఆచరిస్తున్న సంస్థల కార్యకలాపాలు, బానిస వ్యాపారం, బానిసత్వ భావన కూడా ఆధునిక బానిసత్వంలో భాగమే అవుతుంది. ప్రపంచంలోని 96 దేశాల్లో మనుషుల అక్రమ తరలింపు వ్యతిరేక చట్టాలు ఏదో రకంగా అమలులో ఉన్నాయి కానీ మనుషుల దోపిడీ రకాలను నిషేధించడంలో చాలా దేశాలు విఫలమవుతున్నాయి. మా పరిశోధనలో తేలిన వివరాల ప్రకారం.. 1. ప్రపంచంలోని 94 దేశాలు లేక మొత్తం దేశాల్లో 49 శాతం బానిసత్వాన్ని నిషేధిస్తున్న చట్టాలను ఇంకా రూపొందించలేదు. 2. 112 దేశాలు లేక ప్రపంచ దేశాల్లో 58 శాతం నిర్బంధ శ్రమకు శిక్ష విధించే శాసన నిబంధనలను అమలుపర్చలేదు. 3. 180 దేశాలు లేక ప్రపంచ దేశాల్లో 93 శాతం బానిసత్వాన్ని పాటించడం నేరంగా ప్రకటించే చట్టాలను రూపొందించలేదు. 4. 170 దేశాలు లేక ప్రపంచ దేశాల్లో 88 శాతం బానిసత్వానికి సమానమైన కార్యకలాపాలను సాగిస్తున్న సంస్థలను నేరస్త సంస్థలుగా ప్రకటించలేదు. ఈ అన్నిదేశాల్లో, మానవ దోపిడీకి సంబంధించి అత్యంత తీవ్ర విధానాలను పాటిస్తున్న ప్రజలను, సంస్థలను శిక్షించడానికి ఏవిధమైన నేర న్యాయ శాసనాలనూ ఇంకా రూపొందించలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే బానిసత్వం చట్టవిరుద్ధం అనే భావన ఈనాటికీ సమాజ అనుభవంలోకి రావడం లేదు.
బానిసత్వ క్లుప్త చరిత్ర
ఆధునిక చరిత్రలో బ్రిటిష్ బానిసత్వ నిషేధ ఉద్యమం బానిస వ్యాపారానికి అంతం పలికింది. బానిస వ్యాపారాన్ని చట్టబద్ధమైన వ్యాపారంగా అనుమతిస్తున్న చట్టాలను ఇది నిషేధించింది. 19వ శతాబ్దిలో బానిస వ్యాపారాన్ని నేరంగా భావించే చట్టాలను రూపొందించాలని ప్రభుత్వాలు అడిగేవి కాదు. దానికి బదులుగా బానిస వ్యాపారాన్ని అనుమతించే ఏ చట్టాన్నయినా రద్దు చేయాలని మాత్రమే అవి భావించేవి. తర్వాత 1926లో నానాజాతి సమితి స్లేవరీ కన్వెన్షన్‌ని రూపొందించింది. ఇది బానిసత్వాన్ని అనుమతించే ఏ చట్టాన్నయినా రద్దు చేయాల్సిందిగా ఆయా దేశాలను కోరింది. కానీ తర్వాత వచ్చిన అంతర్జాతీయ మానవహక్కుల వ్యవస్థ దీన్ని పూర్తిగా మార్చివేసింది. 1948 నుంచి దేశాలకు బానిసత్వ విధానాలను రద్దు చేయడం కాకుండా పూర్తిగా నిషేధించాలని కోరడం మొదలైంది.
దీంతో బానిసత్వాన్ని అనుమతించే ఏ చట్టాన్నయినా ఉంచుకోకుండా జాగ్రత్తపడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై పడింది. ఒక వ్యక్తిని బానిసగా చేసుకునే విధానాన్ని నిలిపివేసే చట్టాలను ప్రభుత్వాలు రూపొందించాల్సి వచ్చింది. కానీ చాలా ప్రభుత్వాలు బానిసత్వాన్ని పాటించడం నేరం అనేలా చట్టాలు అమలుపర్చలేదని తెలుస్తోంది.
దాదాపు 90 సంవత్సరాలుగా అంటే 1926 నుంచి 2016 వరకు.. ఒక వ్యక్తిపై మరో వ్యక్తి ఆజమాయిషీకి, నియంత్రణకు వీలిస్తున్న బానిసత్వం ఉనికిలో లేదని ఎందుకంటే వ్యక్తులపై యాజ మాన్య హక్కులను అనుమతిస్తున్న అన్ని చట్టాలను ప్రభుత్వాలు రద్దు చేసేశాయనే అభిప్రాయం బలపడిపోయింది. బానిసత్వం ఉనికిలో లేకుండా చట్టాలు వచ్చేశాయనే స్పృహ అందరిలో బలపడిపోయింది. బానిసత్వమే ఉనికిలో లేకుండా పోయాక, దాన్ని నిషేధించే చట్టాలను ఆమోదించడంలో హేతువు లేదనే ఆలోచన కూడా వచ్చేసింది. అయితే ఈ రకం ఆలోచనకు 1926లో బానిసత్వంపై మొదటగా ఇచ్చిన నిర్వచనం మలాం పూసింది. ఈ నిర్వచనం ప్రకారం ఒక వ్యక్తికి చెందిన కొన్ని లేక అన్ని అధికారాలనూ మరొకరి యాజమాన్యానికి కట్టబెట్టే స్థితిని బానిసత్వం అని చెప్పాల్సి ఉంటుంది. అయితే ఈ నిర్వచనం ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చట్టబద్ధంగా సొంతం చేసుకునే పరిస్థితులకు మాత్రమే అన్వయమవుతోందని ప్రపంచవ్యాప్తంగా న్యాయస్థానాలు గుర్తించాయి.
కాబట్టి బానిసత్వంపై ఈ నిర్వచనంలోని భాషను పరిశీలిద్దాం. సంప్రదాయికంగా ప్రజలపై చట్టపరమైన యాజమాన్యం అమలయ్యే వ్యవస్థల ద్వారా బానిసత్వాన్ని రూపొందిస్తూ వచ్చారు. దీని ప్రకారం కొందరి హక్కులు మరొకరి ఆస్తిగా చలామణి కావడానికి చట్టమే అవకాశమిచ్చింది. కానీ కొత్తగా గుర్తించిన బానిసత్వపు పరిస్థితి అనేది చట్టంతో పనిలేకుండా వాస్తవంగానే అమలవుతున్న బానిసత్వం గురించి చెబుతోంది. దీంట్లో చట్టబద్ధంగా వ్యక్తిపై యాజమాన్యం అనేది కనిపిం చదు కానీ ఒక వ్యక్తి మరొకరిపై యాజమాన్య అధికారాన్ని చలాయించగలడు. అది మరొక వ్యక్తికి చెందిన బానిస స్థితినే సూచిస్తుంది. ఈ నేపథ్యంలో బానిసత్వాన్ని చట్టబద్ధంగా నిర్మూలించినప్పటికీ బానిసత్వం మరొక రూపంలో ప్రపంచంలో అమలవడానికి వీలుందనే అభిప్రాయం బలపడుతోంది. వ్యక్తిని అధికారబలంతో చిత్రహింస పెట్టడం అనేది 18వ శతాబ్దంలోనే చట్టం ద్వారా నిషేధించినప్పటికీ, అణగదొక్కడం అనేది చట్టవిరుద్ధమే అయినప్పటికీ నేటికీ అమలవుతూనే ఉందని చెప్పాలి.
వ్యాసకర్త రైట్స్ ల్యాబ్ అసోసియేట్ డైరెక్టర్, అసోసియేట్ ప్రొఫెసర్, నాటింగ్‌హామ్ వర్సిటీ
బానిసత్వం నేటికీ నేరం కాదా?
Published Sun, Feb 23 2020 5:12 AM | Last Updated on Sun, Feb 23 2020 5:12 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment